రాజధానిని కుమ్మేసిన వర్షం, నీట మునిగిన రోడ్లు, స్తంభించిన ట్రాఫిక్

heavy rain hyderabad, Heavy Traffic : రాజధానిని వర్షం కుమ్మేసింది. ఏకధాటిగా కురిసిన వర్షానికి ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఉరుములు, మెరుపులు, వేగమైన గాలులతో వర్షం కురిసింది. ఇప్పటికే వరదలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న పలు కాలనీల వాసులు మరోసారి వర్షానికి ఇక్కట్లకు గురయ్యారు.
2020, అక్టోబర్ 17వ తేదీ సాయంత్రం కురిసిన వర్షంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించిపోయింది. గంటల తరబడి ట్రాఫిక్ లో నరకం అనుభవించారు. అమీర్ పేటతో పాటు..ఇతర రహదారులపై భారీగా వరద నీరు చేరింది.
క్యుములోనిం బస్ మేఘాల తీవ్రతతో వర్షం కురుస్తోందంటున్నారు వాతావరణ శాఖాధికారులు. వరదతో కాలనీలు ఇంకా తేరుకోకముందే వరుణుడు పగబట్టిన రీతిలో… మళ్లీ ఆ ప్రాంతాల్లోనే శనివారం సైతం కుండపోతగా వర్షం కురిసింది. హయత్‌నగర్, ఉప్పల్, ఎల్బీనగర్, మలక్ పేట, చార్మినార్, చాంద్రాయణగుట్ట, బాలాపూర్, మీర్‌పేట, పోచారం, ఘట్కేసర్‌లలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జల దిగ్భందంలో చిక్కుకున్నాయి.
నాగోలు బండ్లగూడ పరిధిలోని సాయినగర్, ఆదర్శనగర్, ఎల్బీనగర్ పరిధిలోని హరిహరపురం, మిథులానగర్, మల్లికార్జుననగర్, బంజారాకాలనీ, రెడ్డికాలనీ, బైరామల్‌గూడ, హబ్సి గూడ రవీంద్రనగర్, లక్ష్మీనగర్, సాయిచిత్రనగర్, మధురానగర్‌లో వరద నీరు మరో అడుగు మీదకు చేరింది.
బీఎన్‌రెడ్డి డివిజన్ కప్రాయి చెరువు పరిసరాల్లోని హరిహరపురంకాలనీ, గాంధీనగర్‌కాలనీ సహా మీర్‌పేటలోని మంత్రాల చెరువు కింద ఉన్న మిథులానగర్, సాయినగర్ కాలనీలు నీటిలో చిక్కుకపోయాయి.
హయత్ నగర్ డివిజన్ పరిధిలోని బంజారాకాలనీ, వనస్థలిపురం కాలనీ పరిధిలోని మల్లికార్జున కాలనీలు గత నాలుగు రోజుల నుంచి నీటిలోనే ఉండిపో యాయి.
పాతబస్తీలోని ఛత్రినాకలో వరదనీటిలో పలు వాహనాలు మళ్లీ కొట్టుకుపోయాయి.
ఫలక్‌నుమా రైల్వే బ్రిడ్జి పైభాగంలో భారీ గొయ్యి పడటంతో బ్రిడ్జిని మొత్తం మూసేశారు.
పాతబస్తీ బాబానగర్ పరిధిలోని గుర్రంచెరువు గండి మరింత పెద్దది కావటంతో వరద ఉధృతి పెరిగింది.