పట్టభద్రుల ఓటు నమోదు గడువు పెంచాలి : ఈసీకి హైకోర్టు ఆదేశాలు

  • Publish Date - November 7, 2020 / 02:03 AM IST

Graduate vote registration : పట్టభద్రుల ఓటు నమోదు గడువు పెంచాలని ఎన్నికల కమిషన్‌కు తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలను అమలు చేస్తామని, డిసెంబరు 1 నుంచి 31 వరకు ఓటు నమోదుకు అవకాశం కల్పిస్తామని ఈసీ.. కోర్టుకు తెలిపింది. ఈ మేరకు కొత్తగా మరో నోటిఫికేషన్‌ జారీ చేస్తామని పేర్కొంది.



కరోనా వ్యాప్తి నేపథ్యంలో పట్టభద్రుల ఓటు నమోదు గడువును డిసెంబరు 7 వరకు గడువు పెంచాలంటూ న్యాయవాది రమేష్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయస్థానం శుక్రవారం నవంబర్ 6న విచారణ చేపట్టింది. ఈ క్రమంలో పట్టభద్రుల ఓటు నమోదు గడువు నేటితోనే ముగుస్తుందని ఈసీ కోర్టుకు తెలిపింది.



చట్ట ప్రకారం నవంబర్ 7లోపే ఓటరు నమోదు ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉందని స్పష్టం చేసింది. ఒకవేళ ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు ఉంటే దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. కోర్టు ఆదేశాల నేపథ్యంలో మరోసారి అవకాశం కల్పించనున్నట్లు వెల్లడించింది.