వైద్య శాస్త్రంలో అద్భుతం.. కోల్పోయిన పురుషాంగాన్ని మోచేతిపై మొలిపించిన హైదరాబాద్‌ వైద్యులు.. ఎలాగంటే?

బాధితుడు పెళ్లికూడా చేసుకుని దాంపత్య జీవితం అనుభవించవచ్చని వైద్యులు అన్నారు.

వైద్య శాస్త్రంలో అద్భుతం.. కోల్పోయిన పురుషాంగాన్ని మోచేతిపై మొలిపించిన హైదరాబాద్‌ వైద్యులు.. ఎలాగంటే?

Updated On : February 7, 2025 / 10:22 AM IST

బాల్యంలో పురుషాంగాన్ని కోల్పోయిన ఓ వ్యక్తికి అరుదైన ఆపరేషన్‌ చేసి అతడి చేతిపై పురుషాంగం మొలిచేలా చేశారు వైద్యులు. ఈ ఆపరేషన్‌ను హైదరాబాద్‌లోని మెడికవర్‌ వైద్యులు చేశారు.

అతడికి చేసిన ఆపరేషన్‌ గురించి వైద్యులు మీడియాకు వివరించారు. సోమాలియాకు చెందిన ఓ యువకుడు (20) ఏడాదిన్నర క్రితం మెడికవర్‌ ఆసుపత్రికి చికిత్స కోసం వచ్చాడని చెప్పారు. అతడికి నాలుగేళ్ల వయసులో సున్తీ జరిగిందని, అయితే, ఆ కారణంగా ఇన్‌ఫెక్షన్‌ సోకడంతో డాక్టర్లు అప్పట్లో అతడి పురుషాంగాన్ని తొలగించారని తెలిపారు.

అతడి వృషణాల కింద నుంచి మూత్రం వెళ్లేలా ఆపరేషన్‌ చేసి మార్గాన్ని రూపొందించారని చెప్పారు. అతడికి 18 ఏళ్ల వయసులో మూత్ర విసర్జనలో సమస్యలు ఎదురయ్యాయని అన్నారు. దీంతో అతడు హైదరాబాద్‌ మాదాపూర్‌లోని తమ ఆసుపత్రికి వచ్చాడని చెప్పారు.

డాక్టర్లు అతడికి పరీక్షలు చేసి, మొదట మూత్ర విసర్జన సాఫీగా జరిగేలా ఆపరేషన్‌ చేసి, అనంతరం క్రమంగా పురుషాంగాన్ని మళ్లీ మొలిచేలా చేయాలనుకున్నామని తెలిపారు. అతడి తొడతో పాటు పొట్ట నుంచి రక్తనాళాలను, అలాగే, మోచేతి నుంచి కండరాన్ని సేకరించామని అన్నారు.

iPhone SE 4: శుభవార్త.. ఇక రెడీగా ఉండండి.. ఐఫోన్ ఎస్‌ఈ4 వచ్చేస్తోంది.. ధర ఇంత తక్కువా?

అతడి ముంజేయి ప్రాంతంలో మైక్రోవాస్క్యులర్‌ ఆపరేషన్‌ ద్వారా రేడియల్‌ ఆర్టెరీ ఫోర్‌ ఆర్మ్‌ ఫ్లాప్‌ పద్ధతిలో పురుషాంగాన్ని రూపొందించామని, రక్తనాళాలతో అనుసంధానం చేశామని తెలిపారు. వాటి ద్వారా అతడి చేతిపై పురుషాంగాన్ని మొలిపించి, దాన్ని విజయవంతంగా అది ఉండాల్సిన ప్రాంతంలో అమర్చామని చెప్పారు.

పెళ్లి చేసుకోవచ్చు..
దాదాపు ఏడాదిన్నర క్రితం ఆపరేషన్ చేయగా ఇప్పుడు ఆ యువకుడు పూర్తిగా కోలుకున్నాడని తెలిపారు. ఇప్పుడు అంగ స్తంభన కోసం పినైల్‌ ఇంప్లాంట్‌ను ఏర్పాటు చేసినట్లు వివరించారు. అతడికి మొత్తం రెండు దశల్లో ఆపరేషన్‌ చేశామని చెప్పారు. ఇటువంటి ఆపరేషన్‌ చేయడం రాష్ట్రంలో ఇదే తొలిసారని అన్నారు. పురుషాంగానికి పూర్తిగా స్పర్శ వచ్చిందని చెప్పారు.

ఇప్పుడు అతడు సాధారణ పురుషుల్లాగే నిలబడి మూత్రవిసర్జన చేసే స్థాయికి వచ్చాడని తెలిపారు. బాధితుడు పెళ్లికూడా చేసుకుని దాంపత్య జీవితం అనుభవించవచ్చని అన్నారు. అయితే, వీర్య ఉత్పత్తి మాత్రం జరగదని చెప్పారు. తనకు చిన్నప్పటి నుంచి ఉన్న సమస్య వల్ల ఇన్నాళ్లు తాను మానసిక క్షోభను అనుభవించానని బాధితుడు తెలిపాడు. ఇక్కడి డాక్టర్లు చేసిన ఆపరేషన్‌ వల్ల ఇప్పుడు తాను సంతోషంగా తమ దేశానికి వెళ్తున్నానని చెప్పాడు.