Pork Fat Oil : వామ్మో.. ఫాస్ట్ ఫుడ్ తింటున్నారా? అయితే బీకేర్ ఫుల్, మీ ప్రాణాలకే ప్రమాదం..
Pork Fat Oil : కుళ్లిన జంతువుల బొక్కలతో నూనెల తయారు చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడింది చాలదన్నట్లు..ఇప్పుడు పంది కొవ్వుతో కల్తీ నూనె తయారు చేస్తున్న వైనం బయటపడింది.

Pork Fat Oil
Hyderabad – Pork Fat Oil : ఫాస్ట్ ఫుడ్ అంటే చాలా మందికి ఇష్టమే. పిల్లల నుంచి పెద్దల వరకు.. రోడ్ సైడ్ లో దొరికే ఫాస్ట్ ఫుడ్ ని ఇష్టపడతారు. గరమ్ గరమ్ ఫాస్ట్ ఫుడ్ ని లొట్టలేసుకుని మరీ తింటారు. ఫ్రైడ్ రైస్, ఎగ్ ఫ్రైడ్ రైస్, నూడుల్స్, చికెన్ ఫ్రైడ్ రైస్.. ఇలా అన్నింటిని ఎగబడి మరీ తింటారు. అందుకే ఎక్కడ చూసినా వీధుల్లో ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చేశాయి.
మీరు కూడా ఫాస్ట్ ఫుడ్ ప్రియులే అయి ఉండొచ్చు. అయితే ఈ వార్త మీ కోసమే. ఫాస్ట్ ఫుడ్ లవర్స్ వెన్నులో వణుకు పుట్టించే వార్త ఇది. ఇకపై ఫాస్ట్ ఫుడ్ తినే ముందు బాగా ఆలోచన చేయాల్సిందే. లేదంటే మీ ప్రాణాలకే ప్రమాదం, పైకి పోవడం ఖాయం. విషయం ఏంటో తెలిస్తే ఇక జన్మలో ఫాస్ట్ ఫుట్ జోలికి వెళ్లకపోవచ్చు.
Also Read..Irregular Periods : పీరియడ్స్ సక్రమంగా రాకపోవటానికి 5 ప్రధాన కారణాలు !
హైదరాబాద్ లో వరుసగా దారుణాలు వెలుగుచూస్తున్నాయి. కాదేదీ కల్తీకి అనర్హం అన్నట్లు అన్నింటిని కల్తీ చేస్తున్నారు. కాసుల కక్కుర్తితో కొందరు కేటుగాళ్లు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఇప్పటికే నగరంలో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్, తాగే పాలు, ఐస్ క్రీమ్స్, సాస్, చాక్లెట్స్ బాగోతం వెలుగుచూసింది. చివరికి కూరల్లో వాడే నూనెలు కూడా కల్తీ చేసి పడేశారు. పంది కొవ్వుతో తయారు చేసిన కల్తీ నూనె బాగోతం బట్టబయలైంది. ఈ దారుణం హైదరాబాద్ నగరంలోని నేరేడ్ మెట్ లో వెలుగుచూసింది.
కుళ్లిన జంతువుల బొక్కలతో నూనెల తయారు చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడింది చాలదన్నట్లు..ఇప్పుడు పంది కొవ్వుతో కల్తీ నూనె తయారు చేస్తున్న వైనం బయటపడింది.
నేరేడ్ మెట్ ఆర్కేపురంలో నివాసం ఉండే రమేష్ కొంతకాలంగా తన ఇంట్లోనే గుట్టుచప్పుడు కాకుండా పంది కొవ్వుతో వంట నూనెను తయారు చేస్తున్నాడు. పంది మాంసం విక్రయించే దుకాణాల నుంచి పంది కొవ్వును సేకరించి, పంది కొవ్వును వేడి చేస్తాడు. దానికి పలు రకాల కెమికిల్స్ కలుపుతాడు. ఆ తర్వాత అచ్చం వంట నూనెలా ఉండే నూనెలు తయారు చేస్తాడు.
ఇలా తయారు చేసిన నూనెను అతగాడు రోడ్డు పక్కన ఫాస్ట్ ఫుడ్ దుకాణాలు నిర్వహించే వారికి తక్కువ ధరకు అమ్ముతున్నాడు. ఇలా కొన్నేళ్ల నుంచి గుట్టు చప్పుడు కాకుండా దందా సాగిస్తున్నారు. దీని గురించి మల్కాజ్ గిరి ఎస్వోటీ పోలీసులకు పక్కా సమాచారం అందింది.
Also Read..Arrhythmias : కార్డియాక్ అరిథ్మియా ప్రాణాంతకమా? అయితే ఎలా గుర్తించాలి?
రంగంలోకి దిగిన పోలీసులు రమేష్ ఇంటిపై ఆకస్మిక సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి. గుట్టుగా పంది కొవ్వుతో నూనె తయారు చేస్తున్న వైనాన్ని గుర్తించారు పోలీసులు. పంది కొవ్వుతో నూనె తయారు చేసి విక్రయిస్తున్నాడని తెలుసుకుని పోలీసులు నివ్వెరపోయారు. కాసుల కక్కుర్తితో దిగజారిపోయిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, పంది కొవ్వుతో తయారు చేసిన నూనెను కొనుగోలు చేసిన ఫాస్ట్ ఫుడ్ దుకాణదారులను వదిలిపెట్టేది లేదన్నారు పోలీసులు.
పంది కొవ్వుతో చేసిన నూనెను ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నిర్వాహాకులు వాడుతున్నారనే విషయం తెలిశాక ఫాస్ట్ ఫుడ్ ప్రియులు షాక్ కి గురయ్యారు. ఇది చాలా దారుణం అంటున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడిన కేటుగాళ్లను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.