Apple Iphones : ఐఫోన్ లవర్స్‌కు షాక్.. వెలుగులోకి ఘరానా మోసం.. విచ్చలవిడిగా నకిలీ ఐఫోన్లు, విడిభాగాలు అమ్మకం
నకిలీ విడి భాగాలకు ఆపిల్ కంపెనీ లేబుల్స్, లోగోలు అతికించి కస్టమర్లను మోసగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల నుంచి పెద్ద ఎత్తున నకిలీ విడిభాగాలను స్వాధీనం చేసుకున్నారు. Duplicate iPhones

Duplicate Apple iPhones
Duplicate Apple iPhones : ఆపిల్ కంపెనీ నుంచి వచ్చే ఫోన్లకు ఉన్న క్రేజే వేరు. వరల్డ్ వైడ్ గా వాటికి చాలా డిమాండ్ ఉంది. ధర ఎక్కువే అయినా ఆపిల్ బ్రాండ్ ఫోన్లు కొనేందుకు పోటీలు పడతారు. అందులో ఉండే ఫీచర్స్, సెక్యూరిటీ అలాంటివి మరి. అందుకే వాటికంత క్రేజ్. ధర ఎక్కువైనా తగ్గేదేలే అంటూ ఆపిల్ ఫోన్లను తెగ కొనేస్తుంటారు.
అయితే వీటికున్న క్రేజ్ ను సొమ్ము చేసుకునే పనిలో పడ్డారు కేటుగాళ్లు. కాదేదీ నకిలీకి అనర్హం అన్నట్లు.. కేటుగాళ్ల కన్ను ఆపిల్ ఫోన్లపై పడింది. అంతే, నకిలీ ఐఫోన్లు, వాటి విడిభాగాలను గుట్టు చప్పుడు కాకుండా అమ్మేస్తున్నారు. ఇలాంటి ముఠా గుట్టు రట్టు చేశారు హైదరాబాద్ పోలీసులు.
ఇది ఐఫోన్ లవర్స్ కు షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. ఐఫోన్ లవర్లు జాగ్రత్తగా ఉండాల్సిందే. లేదంటే అడ్డంగా మోసపోవడం ఖాయం. హైదరాబాద్ లో నకిలీ ఐఫోన్ల కలకలం రేగింది. నకిలీ ఐఫోన్లు, ఐఫోన్ నకిలీ విడిభాగాలు అమ్మి సొమ్ము చేసుకుంటున్న ముఠాను పట్టుకున్నారు సెంట్రల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. ఏకకాలంలో నాలుగు షాపులపై దాడులు చేసి నలుగురిని అరెస్ట్ చేశారు. నకిలీ విడి భాగాలకు ఆపిల్ కంపెనీ లేబుల్స్, లోగోలు అతికించి కస్టమర్లను మోసగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల నుంచి పెద్ద ఎత్తున నకిలీ విడిభాగాలను స్వాధీనం చేసుకున్నారు.
ముందస్తు సమాచారంతో సెంట్రల్ టాస్క్ ఫోర్స్ కమిషనర్ నాయకత్వంలో రెండు పోలీసు బృందాలు జగదీశ్ మార్కెట్, హిమాయత్ నగర్ లోని షాపుపై దాడుల చేపట్టాయి. ఆపిల్ కంపెనీ పేరిట నకిలీ విడిభాగాలను అమ్ముతున్నట్లుగా గుర్తించారు. జగదీశ్ మార్కెట్ లోని జై రాజేశ్వర్ మొబైల్ స్టోర్, న్యూ కలెక్షన్ మొబైల్ స్టోర్, పీఎస్ టెలికం మొబైల్ షాప్, ట్రినిటీ మొబైల్ షాపుల్లో దాడులు చేశారు పోలీసులు.
నిందితుల నుంచి డూప్లికేట్ ఆపిల్ లోగోతో ఉన్న ఫోన్ బాక్స్ కవర్లు, లైటింగ్ కేబుల్స్, ఐఫోన్ బ్యాటరీలు, యూఎస్ బీ పవర్ అడాప్టర్స్, ప్రో 6 ఎయిర్ పాడ్స్, ఐఫోన్ బ్యాటరీ ప్యాక్, ఇయర్ పాడ్స్ లైటింగ్ కనెక్టర్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.
Also Read : ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధంలో చిక్కుకున్న భారతీయ విద్యార్థులు
నలుగురు నిందితులు(భరత్ రామ్, పదమ్ సింగ్, విసారం పురోహిత్, శివ ప్రసాద్) ఆపిల్ ఫోన్లకు సంబంధించిన లోగోలు, ఎయిర్‌పాడ్స్, యూఎస్‌బీ కేబుల్స్ నకిలీవి తీసుకొచ్చి వాటికి ఆపిల్ కంపెనీ లేబుల్స్ తగిలించి ఒరిజినల్‌గా నమ్మిస్తు మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. ఈ ముఠా రాజస్థాన్ నుండి ఐఫోన్ నకిలీ విడిభాగాలు దిగుమతి చేసుకుని హైదరాబాద్‌లో విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఐఫోన్ నకిలీ విడిభాగాలు అమ్ముతున్నారనే విషయం వెలుగులోకి రావడంతో ఐఫోన్ లవర్స్ షాక్ కి గురయ్యారు. ఐఫోన్ లవర్స్ జాగ్రత్త పడాల్సిన సమయం వచ్చింది. ఎక్కడపడితే అక్కడ వాటిని కొనుగోలు చేశారంటే మూల్యం చెల్లించుకోక తప్పదు.