Hyderabad : హైదరాబాద్‌లో మళ్లీ భారీ వర్షం, లోతట్టు ప్రాంతాలు జలమయం, మరో 3 రోజులు కుమ్ముడే..
మరో మూడు రోజులు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. మోస్తరు నుంచి భారీ వానలు కురిసే అవకాశం ఉందంది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. Hyderabad Rains
Hyderabad Rains (Photo : Google)
Hyderabad Rains : హైదరాబాద్ లో మళ్లీ వర్షం పడుతోంది. నగరంలోని పలు ప్రాంతాల్లో వాన దంచికొడుతోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిలింనగర్, మాదాపూర్, హైటెక్ సిటీ, కొండాపూర్ లో భారీ వాన కురుస్తోంది. యూసుఫ్ గూడ, పంజాగుట్ట, అమీర్ పేట్ లో కూడా వాన దంచికొడుతోంది. భారీ వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు చోట్ల ట్రాఫిక్ జామ్ అయ్యింది. వర్షం దంచికొట్టడంతో నాలాలు ఉప్పొంగాయి.
రెండు గంటల పాటు నగరంలో భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్ నగరంతో పాటు కామారెడ్డి, మేడ్చల్, మల్కాజ్ గిరి, వికారాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, భువనగిరి ఏరియాల్లో కూడా గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, అలాగే ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు అలర్ట్ జారీ చేశారు.
ఎడతెరిపిలేని వానలతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. ఇళ్లలోకి వర్షం నీరు రావడంతో అవస్థలు పడుతున్నారు. ఇప్పటికే రెండు రోజులుగా గ్యాప్ లేకుండా వాన పడుతోంది. మరో మూడు రోజులు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. మోస్తరు నుంచి భారీ వానలు కురిసే అవకాశం ఉందంది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
మరో మూడు రోజులు తెలంగాణ అంతటా ఇటు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది. ఎల్లో అలర్ట్ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వాన పడే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు వివరించారు. భారీ వర్షం నేపథ్యంలో నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు సూచించారు. వర్షం పడుతున్న సమయంలో రోడ్లపైకి రాకపోవడమే మంచిదన్నారు. అత్యవసరం అయితే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని హెచ్చరించారు.
