Hydra: 30ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నాం.. హైడ్రా కూల్చివేతలపై బాధితుల ఆగ్రహం.. గాజులరామారంలో హైటెన్షన్.. నేలపై పడుకొని.. విద్యుత్ తీగలు పట్టుకొని..
Hydra demolitions in gajularamaram: గాజులరామారంలో ఉద్రిక్తత కొనసాగుతుంది. హైడ్రా కూల్చివేతలపై బాధితులు ఆందోళనకుదిగారు.

Hydra Demolitions In Gajularamaram
Hydra demolitions in gajularamaram: మేడ్చల్ జిల్లా గాజులరామారంలో ఉద్రిక్తత కొనసాగుతుంది. హైడ్రా కూల్చివేతలపై బాధితులు ఆందోళనకుదిగారు. అక్కడ 100 ఎకరాలకుపైగా ప్రభుత్వ స్థలాన్ని కబ్జాదారులు ఆక్రమించినట్లు ఆరోపణలు ఉన్నాయి. 60 నుంచి 70 గజాల్లో ఇళ్లను నిర్మించి రూ.10లక్షల చొప్పున విక్రయిస్తున్నారు. దీనిపై ఫిర్యాదు అందడంతో హైడ్రా రంగంలోకి దిగింది. ఆక్రమణదారుల చేతుల్లో విలువైన ప్రభుత్వ భూములు ఉన్నట్లు గుర్తించిన హైడ్రా.. పలు సర్వే నెంబర్‌లలో నిర్మించిన అక్రమ ఇళ్లను కూల్చివేసింది. మరోవైపు కూల్చివేతలపై స్థానికులు ఆందోళనకు దిగడంతో ఆ ప్రాంతంలో ఉధ్రిక్తత వాతావరణం నెలకొంది.
బాలయ్య బస్తీలో ప్రజలు చిన్న పిల్లలతో కలిసి జేసీబీ వాహనాలకు అడ్డుగా నిల్చొని నిరసన తెలిపారు. కొంత మంది మహిళలు నేలపై పడుకొని, విద్యుత్ తీగలు పట్టుకొని తమ నిరసనను తెలియజేశారు. మరికొందరు హైడ్రా తీరుపై పాటల రూపంలో బతుకమ్మ ఆడుతూ నిరసన తెలిపారు.
ఆదివారం ఉదయం 5గంటల నుంచి హైడ్రా సిబ్బంది కూల్చివేతలు చేపట్టారు. సుమారుగా 80కిపైగా ఇళ్లు కూల్చివేసినట్లు తెలిసింది. గాజులరామారంలోని సర్వే నెం. 300, 307, 308 సంబంధించిన ప్రాంతంలో చాలా మంది కొన్నేళ్లుగా ఆవాసాలు ఏర్పర్చుకొని ఉంటున్నారు. అయితే, హైడ్రా అధికారులు మాత్రం ఆ భూమిని ప్రభుత్వ సంబంధిత భూమిగా చెబుతున్నారు. ఈ భూమి కబ్జాకు సంబంధించి అనేక ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో అక్రమ నిర్మాణాలను కూల్చివేతలు చేపట్టిన హైడ్రా అధికారులు చెబుతున్నారు.
హైడ్రా తీరుపై బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 30ఏళ్లుగా ఇదే ప్రాంతంలో ఉంటున్నామని స్థానికులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేపట్టారు. బాధితులు తమ ఇళ్లకు ఏర్పాటు చేసుకున్న విద్యుత్ వైర్లను హైడ్రా అధికారులు తొలగించి కట్టడాలను కూల్చివేత చర్యలు చేపట్టారు. వాటర్ లైన్ కూడా నిలిపివేశారు.