Weather Update : బాబోయ్.. దంచికొడుతున్న ఎండలు.. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. ఈ రెండు రోజులు బయటకు రావొద్దు..!
Weather Update : వేసవి ఆరంభంలోనే ఎండల తీవ్రత పెరిగింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో తీవ్ర స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ రెండు రోజులు బయటకు రావొద్దని హెచ్చరించింది.

Weather Update
Weather Update : వేసవి వచ్చేసింది.. ఎండలు మండిపోతున్నాయి. బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు జనం. నిప్పులు చెరుగుతున్నాడు సూరీడు. వేసవి ప్రారంభంలోనే భానుడు భగ్గుమని మండిపోతున్నాడు. చాలా ప్రాంతాల్లో ఎండల ప్రభావం అంతకంతకూ పెరిగిపోతుంది.
తెలంగాణ రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. ఇప్పుడే ఇంతలా ఎండలు కొడితే.. రాబోయే ఏప్రిల్, మే నెలల్లో ఇంకా ఎండలు తీవ్రంగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఈ నేపథ్యంలో శుక్ర, శనివారాల్లో పలు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. మిగిలిన జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
రాష్ట్రంలో ఎండల తీవ్రత రోజురోజుకీగా పెరిగిపోతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు మాత్రం 40 డిగ్రీలు దాటేశాయి. మార్చి 13న దాదాపు 14 జిల్లాల్లో 40 డిగ్రీలకుపైగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణ శాఖ పేర్కొంది. గత ఏడాదిలో ఇదే రోజున రెండు జిల్లాల్లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
నిర్మల్ జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రత :
రాష్ట్రంలో సగానికిపైగా జిల్లాల్లో ఎండలు తీవ్రంగా ఉన్నాయి. ముఖ్యంగా నిర్మల్ జిల్లాలో అత్యధికంగా 40.7 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఈ సీజన్‌లో ఇదే అత్యధికమని చెప్పవచ్చు. హైదరాబాద్‌లో 38.6 డిగ్రీల ఉష్ణోగ్రత అత్యల్పంగా నమోదైంది.
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు సగటున 38 డిగ్రీల నుంచి 41 డిగ్రీల మధ్య నమోదవుతుండగా, రాత్రిపూట ఉష్ణోగ్రతలు 19 డిగ్రీల నుంచి 23 డిగ్రీల మధ్య రికార్డు అయ్యే అవకాశముందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.
వేసవి తాపాన్ని తట్టుకునేందుకు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న జిల్లాల్లోని ప్రజలు ఎవరూ బయటకు రావొద్దని వాతావరణ శాఖ సూచిస్తోంది. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు బయటకు రావొద్దని సూచిస్తోంది.
అనారోగ్య సమస్యలు ఉన్నవారు తప్పనిసరిగా ఇంటికే పరిమితం కావాలని సూచిస్తోంది. బయటకు వెళ్లే తప్పనిసరిగా ఏదైనా క్యాప్ లేదా గొడుగు వంటివి తీసుకెళ్లాలని, దాహం వేస్తే తాగేందుకు వెంట వాటర్ కూడా తీసుకెళ్లాలని సూచిస్తోంది. వడదెబ్బ తగలకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తోంది.