హైదరాబాద్‌లో కరోనాను క్యాష్ చేసుకుంటున్న బ్లాక్ మార్కెట్

హైదరాబాద్‌లో కరోనాను క్యాష్ చేసుకుంటున్న బ్లాక్ మార్కెట్

Updated On : July 18, 2020 / 6:36 PM IST

హైదరాబాద్‌లో కరోనా మహమ్మారిని కొన్ని ముఠాలు సొమ్ము చేసుకుంటున్నాయి. కరోనా పాజిటివ్‌ కేసులు విస్తరిస్తుండడంతో… బాధితులకు అత్యవసరమైన ఆక్సిజన్‌‌ను అవకాశంగా మలుచుకుంటున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి అనుమతులు లేకుండా ఆక్సిజన్‌ సిలిండర్లను హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. గుట్టుచప్పుడు కాకుండా అధిక ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అంతేకాదు.. కరోనా చికిత్సలో ఉపయోగించే యాంటీ వైరల్‌ డ్రెస్‌నూ బ్లాక్‌ మార్కెట్‌కు తరలిస్తున్నారు.

టాస్క్‌ఫోర్స్‌ దాడుల్లో ఇలాంటి ముఠాలు గుట్టు రట్టవుతోంది. చివరికి కరోనా రోగాన్ని కూడా కొన్ని ముఠాలు సంపాదనకు మార్గంగా మలచుకుంటున్నాయి. కరోనా చికిత్సలో ఉపయోగించే మందుల నుంచి… ఆక్సిజన్‌ వరకూ… అన్నింటినీ బ్లాక్‌ మార్కెట్‌లో విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. కరోనా చికిత్సలో ఉపయోగించే యాంటీ వైరల్‌ డ్రగ్స్‌ను బ్లాక్‌ మార్కెట్‌లో విక్రయిస్తున్న ఇద్దరు నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు చిక్కారు.

4 రెమిడెసివర్‌ ఇంజెక్షన్లు, 30 ఫ్యాబీ ఫ్లూ స్ట్రిప్పులు, 135 పల్స్‌ ఆక్సిమీటర్లను వారి నుంచి స్వాధీనం చేసుకుని సీజ్‌ చేశారు. మొత్తం 5 లక్షల 60వేలు విలువ చేసే మెడిసిన్స్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సోనూ అగర్వాల్‌, సోనూ అనే అన్నాదమ్ముళ్లు కొంతకాలంగా ఫార్మసీ బిజినెస్‌ చేస్తున్నారు. కరోనా భయాన్ని క్యాష్‌ చేసుకోవాలని ప్లాన్‌ వేశారు. బిల్లులు, డాక్టర్‌ ప్రిస్కిప్షన్‌ లేకుండా అవసరమున్న వారికి యాంటీ వైరల్‌ డ్రగ్స్‌ను అధిక ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.

మరికొన్ని ముఠాలు ఆక్సిజన్‌ సిలిండర్లతో దందా నిర్వహిస్తున్నాయి. వీటిపై పక్కా సమాచారంతో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు నగరంలో పలుచోట్ల ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఆక్సిజన్‌ సిలిండర్లు అమ్ముతున్న మోసగాళ్లపై ప్రత్యేక దృష్టి సారించారు. రెండు ముఠాలపై వెస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడి చేసి… 34 మెడికల్‌ ఆక్సిజన్‌ సిలిండర్లను స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్ట్‌ చేశారు.

గుజరాత్ నుంచి అక్రమంగా మెడికల్‌ ఆక్సిజన్‌ సిలిండర్లను కొన్ని ముఠాలు హైదరాబాద్‌కు తరలిస్తున్నాయి. ఒక్కొక్క సిలిండర్‌కు లక్షకు పైగా వసూలు చేస్తున్నారు. గోల్కొండ, ముషీరాబాద్‌ పీఎస్‌ పరిధిలో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఇందులో రెండు ముఠాలు చిక్కాయి. వారిపై నాలుగు కేసులు నమోదు చేశారు.

ముషీరాబాద్‌లో వారం రోజుల్లో 150కిపైగా మెడికల్‌ ఆక్సిజన్‌ సిలిండర్లను సీజ్ చేశారు. అనుమతులు లేకుండా విక్రయిస్తున్న బాబా ట్రేడర్స్‌, రాస్‌ ఏజెన్సీ, నోబుల్‌ రెసిడెన్స్‌లో దాడులు జరిగాయి. అధిక ధరలకు సిలిండర్లను విక్రయిస్తున్న సర్దార్‌ ఖాన్‌ను తొలుత అరెస్ట్‌ చేశారు. ముషీరాబాద్ బాకారంలో హుస్సేన్‌ అనే వ్యక్తిని అరెస్ట్‌ చేశారు. ఆ తర్వాత నిసార్ అహ్మద్, వెంకట్ సుబ్బారావు అనే మరో ఇద్దరిని అరెస్ట్‌ చేశారు.

అనుమతులు లేకుండా మెడికల్‌ ఆక్సీజన్‌ సిలిండర్లను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ హెచ్చరించారు. అక్రమంగా సిలిండర్లనుగానీ.. డ్రగ్స్‌ను కానీ విక్రయిస్తే.. వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఆయన కోరారు.

‘ఇప్పటి వరకు పోలీసులకు చిక్కిన నిందితులపై ఎక్స్‌పోజివ్‌ యాక్ట్‌, అపడమిక్‌ యాక్ట్‌ 2005 కింద కేసులు నమోదు చేశారు. మెడికల్‌ సిలిండర్ల కొరత సృష్టిస్తూ.. అక్రమంగా విక్రయిస్తున్న ముఠాలపై పోలీసులు నిఘా వేశారు’ అని హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌ తెలిపారు.