Phone Call Settings Changed: మీ స్మార్ట్‌ ఫోన్ కాల్ సెట్టింగ్స్ మారిపోయాయా? కారణం ఇదే.. పాత డిస్ ప్లే కావాలంటే జస్ట్ ఇలా చేయండి..

ఫోన్‌లో కాల్, డైలర్ స్క్రీన్ అకస్మాత్తుగా మారిపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. (Phone Call Settings Changed)

Phone Call Settings Changed: మీ స్మార్ట్‌ ఫోన్ కాల్ సెట్టింగ్స్ మారిపోయాయా? కారణం ఇదే.. పాత డిస్ ప్లే కావాలంటే జస్ట్ ఇలా చేయండి..

Updated On : August 23, 2025 / 11:10 PM IST

Phone Call Settings Changed: మీరు ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ వాడుతున్నారా? అందులో కాల్ సెట్టింగ్స్ లో మార్పులు వచ్చాయా? ఇలా ఎందుకు జరిగిందో తెలియడం లేదా? అసలేం జరిగిందో అని కంగారు పడుతున్నారా? అవును..నిజమే.. ఒకరో ఇద్దరో కాదు.. చాలా మంది ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లు తమ కాల్, డైలర్ సెట్టింగ్స్‌లో సడెన్ గా వచ్చిన మార్పును చూసి విస్తుపోయారు. అసలేం జరిగిందోనని ఆందోళన చెందుతున్నారు.

ఫోన్ నుంచి ఎవరికైనా కాల్ చేస్తున్నప్పుడు లేదా కాల్ వచ్చినప్పుడు ఫోన్ ఇంటర్‌ ఫేస్ (డిస్‌ప్లే), డిజైన్ మారినట్లు కనిపిస్తుంది. ఎలాంటి సెట్టింగ్స్ మార్చకుండానే డిస్‌ప్లే దానంతట అదే ఎలా మారిందా అని చాలా మంది అయోమయంలో ఉన్నారు. కొందరు తమ ఫోన్ హ్యాక్ అయిందేమో అని భయాందోళనకు గురయ్యారు.

ఫోన్‌లో కాల్, డైలర్ స్క్రీన్ అకస్మాత్తుగా మారిపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఎలాంటి అప్ డేట్, నోటిఫికేషన్ లేకుండానే ఈ మార్పు ఎలా జరిగిందా అని ఆరా తీస్తున్నారు. ఆండ్రాయిడ్ ఫోన్‌లలో ఈ మార్పులకు అసలు కారణం ఏమిటి? సెట్టింగ్స్ ఎలా మారాయి? పాత డిస్ ప్లే రావాలంటే ఏం చేయాలి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

ఏంటీ.. మెటీరియల్ 3 ఎక్స్‌ప్రెసివ్ రీడిజైన్..?

ఆండ్రాయిడ్ యూజర్ల ఫోన్‌లలో ఇంటర్‌ఫేజ్ ఒక్కసారిగా మారిపోవడానికి కారణం.. మెటీరియల్ 3 ఎక్స్‌ప్రెసివ్ రీడిజైన్. ఇది ఆండ్రాయిడ్ ఫోన్స్ కోసం గూగుల్ తీసుకొచ్చిన సాఫ్ట్ వేర్. ‘మెటీరియల్ 3 ఎక్స్‌ప్రెసివ్ రీడిజైన్’ అనే అప్‌డేట్‌ తీసుకొస్తున్నట్లు గూగుల్ 2025 మేలోనే ప్రకటించింది. ఈ అప్‌డేట్.. ఫోన్ సాఫ్ట్‌వేర్ డిస్‌ప్లే వినియోగాన్ని ఈజీ చేయడంతో పాటు మరింత వేగవంతం చేస్తుందని గూగుల్ పేర్కొంది. కొత్త డిస్‌ప్లే సెట్టింగ్స్‌లో చాలా మారతాయంది. నోటిఫికేషన్లు, కలర్ థీమ్‌లు, ఫోటోలు, జీ మెయిల్, వాచ్ మొదలైన అప్‌డేట్స్ కూడా అందులో భాగం.

‘మెటీరియల్ 3 ఎక్స్‌ప్రెసివ్ రీడిజైన్’ అప్‌డేట్ కింద ఆండ్రాయిడ్ ఫోన్స్ కాల్ యాప్ డిజైన్‌ను మార్చినట్లు గూగుల్ తెలిపింది. ఈ అప్‌డేట్ మొదట జూన్‌లో కొంతమంది యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. తర్వాత దశలవారీగా విస్తృతంగా అందుబాటులోకి వచ్చింది. గూగుల్ ప్రకారం కాలింగ్ యాప్‌ వాడకాన్ని సులభతరం చేయడమే దీని లక్ష్యం. రీసెంట్ (రీసెంట్ కాల్స్), ఫేవరెట్స్ ఆప్షన్లను ‘హోమ్’లో కలిపేసింది గూగుల్. దీంతో, ఇప్పుడు మీరు ఫోన్ యాప్‌ను ఓపెన్ చేస్తే ‘హోమ్’, ‘కీప్యాడ్’ ఆప్షన్లు మాత్రమే కనిపిస్తాయి.

కొత్త సెట్టింగ్స్ ప్రకారం.. ఇప్పుడు ఒకే నంబర్ నుంచి వచ్చే అన్ని కాల్స్ ఒకే చోట కనిపించవు. బదులుగా, సమయం వారీగా కాల్ హిస్టరీలో కనిపిస్తాయి. దీంతో, యూజర్లు తమ కాల్ హిస్టరీని మరింత స్పష్టంగా అర్థం చేసుకోవచ్చని గూగుల్ చెబుతోంది. ఎన్ని మిస్డ్ కాల్స్ ఉన్నాయి లేదా ఎన్ని వచ్చాయో చూడటానికి ప్రతి నంబర్‌ను విడిగా ఓపెన్ చేయాల్సిన అవసరం ఉండదని తెలిపింది.

అంతేకాదు.. ‘ఇన్‌కమింగ్ కాల్’, ‘ఇన్-కాల్’ డిజైన్‌ను కూడా యూజర్ ఫీడ్‌ బ్యాక్ తర్వాత మార్చారు. తద్వారా యూజర్లు ఫోన్ తీసేటప్పుడు అనుకోకుండా కాల్స్‌ను స్వీకరించరు లేదా కట్ చేయరు.

సెట్టింగ్స్ లో ఎలాంటి మార్పు చేయకుండానే.. డిస్ ప్లే ఎలా మారిపోయింది అనే సందేహం చాలామందిలో ఉంది. యూజర్లు తమ ఫోన్లలోని గూగుల్ ప్లే స్టోర్‌లో ఆటో-అప్‌డేట్లను ఎనేబుల్ చేసి ఉంటారని, కాబట్టి కొన్ని యాప్‌లు వాటికవే అప్‌డేట్‌ అయ్యాయని నిపుణులు వివరించారు.

అయితే కొత్తగా వచ్చిన ఈ మార్పుతో కొందరు బాగా కన్ ఫ్యూజ్ అవుతున్నారు. డిస్ట్రబ్ గా ఫీల్ అవుతున్నారు. ఈ ఫీచర్ తమకు నచ్చలేదంటున్నారు. పాత డిస్ ప్లే బాగుందని అభిప్రాయపడుతున్నారు. మరి పాత డిస్ ప్లే కావాలంటే యూజర్లు ఆటో-అప్‌డేట్స్ ను ఆఫ్ చేయాలి. ఫోన్ సెట్టింగ్స్ కి వెళ్లి అప్‌డేట్స్ అన్‌ఇన్‌స్టాల్ చేయాలి.

Also Read: టూ వీలర్స్‌పై టోల్ ట్యాక్స్? అసలు రూల్స్ ఏం చెబుతున్నాయి.. తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన విషయాలు..