సహస్ర హత్య కేసు: బ్యాటు కోసం చోరీకి వెళ్లాడు సరే.. మరి ఆ లెటర్‌లో ఉన్న “మిషన్ డన్” మ్యాటర్ ఏంటి? స్మార్ట్‌ఫోన్ ఎలా కొన్నాడు?
ఆ బాలుడు స్మార్ట్‌ఫోన్ కొనుక్కునేందుకు అతడి ఇంట్లో కూడా డబ్బులు ఇవ్వలేదని పోలీసులు చెప్పారు. స్మార్ట్‌ఫోన్‌ను కొనుక్కోవడానికి ఇతర నేరాలకు కూడా పాల్పడ్డాడా? ఆ స్లిప్‌లో అలా ఎందుకు రాశాడు?

Sahasra Case
Sahasra Case: హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో చోటుచేసుకున్న సహస్ర (11) హత్య కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. ఆమెను హత్య చేసింది పక్కింటి బాలుడే (15) నని, బ్యాటు చోరీ కోసమే ఈ పని చేశాడని ఇప్పటికే పోలీసులు ప్రకటించారు. అయితే, ఇప్పటికీ పలు సందేహాలు తలెత్తుతున్నాయి.
బ్యాటు కోసమే ఆ ఇంట్లోకి వెళ్లాడని పోలీసులు అంటున్నాడు సరే.. మరి ఆ పిల్లాడు రాసుకున్న ఆ లెటర్‌లో ఉన్న “మిషన్ డన్” మ్యాటర్ ఏంటి? (Sahasra Case)
చోరీ చేయడానికి వెళ్లే ముందు ఆ బాలుడు ప్లాన్ స్లిప్ రాసుకున్నాడు. ఓటీటీల్లో క్రైమ్ వెబ్ సిరీస్‌లు ఎక్కువగా చూసే అలవాటు ఉన్న ఆ బాలుడు రాసుకున్న స్లిప్‌లో ఈ విధంగా ఉంది..
- మొదట ఇంట్లోకి వెళ్లాలి
- గ్యాస్ ఉన్న చోటుకు చేరాలి
- గ్యాస్ పైపును కట్ చేయాలి
- డబ్బు తీసుకుని ఇంటిని లాక్ చేయాలి
- గ్యాస్ లీక్ చేసి బయటకు రావాలి
- ఇంటి బయట తాళం వేసి బయటపడాలి
- మిషన్ డన్
అసలు ఆ పిల్లాడు.. సహస్ర ఇంట్లో చోరీ కోసమే ఈ స్లిప్ రాసుకున్నాడా? ఆ ఇంట్లో బ్యాట్ చోరీ చేయాలని అనుకుంటే అతడు ఇలా ఎందుకు రాసుకుంటాడు? చివరకు ఆ పిల్లాడు ఈ స్లిప్‌లో మిషన్ డన్ అని రాసుకున్నాడు. అంటే, పని పూర్తయిపోయిందని అర్థం.
అయితే, అతడు అనుకున్నది అనుకున్నట్లు జరగలేదు కదా? మరి అంతకు ముందే ఆ పిల్లాడు వేరే ఏదైనా చోరీకి పాల్పడి ఈ స్లిప్ రాసుకున్నాడా? లేదంటే ఇంగ్లిష్ సరిగ్గా రాక, వాక్య నిర్మాణ దోషంలో భాగంగా మిషన్ డన్ అన్న పదాన్ని రాసుకున్నాడా? అతడు డబ్బు తీసుకుని, ఇంటిని లాక్ చేయాలని రాసుకున్నాడు. మరి బ్యాట్ గురించిన అంశాన్ని స్లిప్‌లో రాయలేదు కదా?
సహస్ర తమ్ముడి వద్ద మంచి క్రికెట్ బ్యాట్ ఉంది. దాన్ని చోరీ చేయాలని నిందితుడు అనుకున్నాడు. అందుకోసమే, దానిని చోరీ చేసేందుకు సహస్ర ఇంట్లోకి వెళ్లాడని పోలీసులు తెలిపారు. ఇంట్లో ఉన్న బాలిక అతడిని అడ్డుకోవడంతో ఆమెను కత్తితో దాడి చేసి చంపేశాడని చెప్పారు. ఆ కత్తిని స్వాధీనం చేసుకున్నామని అన్నారు.
పిల్లాడు స్మార్ట్‌ఫోన్ ఎలా కొన్నాడు?
ఆ బాలుడు 2 నెలల క్రితం ఓ స్మార్ట్ ఫోన్ కొన్నాడని కూడా పోలీసులు తెలిపారు. ఆ స్మార్ట్‌ఫోన్ అతడి వద్దకు ఎలా వచ్చింది? అన్న విషయంపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆ బాలుడు స్మార్ట్‌ఫోన్ కొనుక్కునేందుకు అతడి ఇంట్లో కూడా డబ్బులు ఇవ్వలేదని పోలీసులు చెప్పారు. స్మార్ట్‌ఫోన్‌ను కొనుక్కోవడానికి ఇతర నేరాలకు పాల్పడ్డాడా? అన్న దానిపై కూడా విచారణ చేస్తున్నామని సీపీ మహంతి తెలిపారు.
ఆ బాలుడు స్లిప్‌లో “మిషన్ డన్” అని రాసుకున్న వాక్యం అసలు బ్యాటు చోరీకి సంబంధించిందేనా? స్మార్ట్‌ఫోన్ కొనడానికి డబ్బులు చోరీ చేయడానికి అంతకుముందే ఆ బాలుడు స్లిప్ రాసుకుని, ఆ పనిని పూర్తి చేశాడా? అని నెటిజన్లు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.