మాస్క్ మస్ట్ : గ్రేటర్‌లో పెరుగుతున్న కాలుష్యం

  • Publish Date - November 23, 2019 / 03:16 AM IST

గ్రేటర్‌లో కాలుష్యం పెరిగిపోతోంది. శ్వాస తీసుకోవడం కష్టమౌతోంది. రోజురోజుకూ కాలుష్యం పెరిగిపోతున్న పొల్యూషన్‌తో నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మాస్క్ ఈజ్ మస్ట్ అంటున్నారు వైద్యులు. దీనికి తోడు చలి తీవ్రత అధికం కావడంతో స్వేచ్చగా ఊపిరి తీసుకోవడం కష్టతరమౌతోంది. అస్తమాతో బాధ పడుతున్న వారి పరిస్థితులు చెప్పనవసరం లేదు. ఇన్ హేలర్ సపోర్టు లేనిదే ఊపిరి తీసుకోవడం కష్టమౌతోంది. ప్రస్తుత వాతావరణం స్వైన్ ఫ్లూ కారక వైరస్, ఇతర బ్యాక్టీరియాల వృద్ధికి అనుకూలంగా ఉంటుంది. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వృద్ధులు, పిల్లలు, గర్భిణీలపై ఎక్కువ ప్రభావం చూపుతుంది.

వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు..వాహన, పారిశ్రామిక కాలుష్యానికి దూరంగా ఉండడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. 2019, నవంబర్ 22వ తేదీ శుక్రవారం నగరంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 158గా నమోదైంది. అందులో పీఎం 2.5 పీఎం 1.0 ఉద్గారాల తీవ్రత నమోదైంది. గాలిలో సల్ఫర్ డయాక్సైడ్, హైడ్రో కార్బన్స్, నైట్రోజన్ ఆక్సైడ్, అమ్మోనియం, కార్బోమోనాక్సైడ్ వంటి రసాయనాలు కలిసిపోవడం, పొగమంచులో ఇవి కలిసిపోయి శ్వాస తీసుకున్నప్పుడు అవి నేరుగా ఊపిరితిత్తుల్లోకి చేరి శ్వాస సంబంధ సమస్యలకు కారణమౌతున్నాయి. 
 

జాగ్రత్తలు అవసరం :
గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే..నగరంలో వాహన కాలుష్యం ఎక్కువ. బేగంపేట, బాలానగర్, నెహ్రూ జూలాజికల్ పార్క్, జీడిమెట్ల, ఆబిడ్స్, పంజాగుట్ట తదితర ప్రాంతాల్లో కాలుష్య తీవ్రత అధికంగా ఉన్నట్లు వాతావరణ నిపుణులు వెల్లడిస్తున్నారు. సాధ్యమైనంత వరకు గ్రీనరీ ప్రదేశాల్లో ఎక్కువగా గడపడం వల్ల వీటి నుంచి బయటపడొచ్చని అంటున్నారు వైద్యులు. జనసమూహం ఎక్కువగా ఉండే ప్రదేశాలకు వెళ్లకపోవడమే మంచిందంటున్నారు. ఒకవేళ వెళ్లాల్సి వస్తే ముక్కుకు మాస్క్ ధరించడం తప్పనిసరి అని వెల్లడిస్తున్నారు. 
Read More : ఆర్టీసీ కార్మికుల బతుకులు దయనీయం