Telangana Inflation : తెలంగాణలోని కుటుంబాలకు డబుల్ షాక్.. నూనెల ధరలు పెరిగాయ్.. అల్లాడిస్తోన్న టమాటా, అల్లం.. దేశంలో తెలంగాణ టాప్
Telangana Inflation : కేంద్ర ప్రభుత్వం వస్తువుల వారీగా ద్రవ్యోల్బణ గణాంకాలను విడుదల చేస్తోంది.. ఈ గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా టమాటా, అల్లం ధరల పెరుగుదల కొనసాగుతోంది. తెలంగాణలో వంట నూనెల ద్రవ్యోల్బణం సుమారు 18 శాతానికి చేరుకుంది.
Telangana Inflation Continues Highest Among All States Since January 2026
Telangana Inflation: తెలంగాణలో ద్రవ్యోల్బణం ప్రభావం ప్రజల వంటింటిపై తీవ్రంగా పడుతోంది. ముఖ్యంగా టమాటా, అల్లం, వంట నూనెల ధరలు పెరగడంతో కుటుంబాల నెలవారీ బడ్జెట్ అమాంతం పెరిగిపోతోంది. పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ ధరల భారం పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
ప్రస్తుతం హైదరాబాద్ స్థానిక మార్కెట్లలో టమాటా కిలో ధర సుమారు రూ.40గా ఉండగా, అల్లం కిలో రూ.100 వరకు విక్రయిస్తున్నారు. దేశవ్యాప్తంగా కూడా మే నెలలో అత్యధికంగా ధరలు పెరిగిన ఆహార ఉత్పత్తుల్లో టమాటా, అల్లం ముందంజలో నిలిచాయి. టమాటా ద్రవ్యోల్బణం 48.43 శాతంగా, అల్లం ద్రవ్యోల్బణం 32.49 శాతంగా నమోదైంది.
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. నిత్యం వినియోగించే కూరగాయలు, వంట నూనెల ధరలు ఒకేసారి పెరగడం వల్ల కుటుంబాలపై తక్షణ ఆర్థిక భారం పడుతోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ ప్రభావం మరింత ఎక్కువగా కనిపిస్తోంది. దేశంలోనే అత్యధిక ద్రవ్యోల్బణం తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో నమోదవుతున్నట్లు గణాంకాలు సూచిస్తున్నాయి.
అధిక డిమాండ్, తక్కువ సరఫరా, ఉత్పత్తి తగ్గడం వల్ల ధరలు పెరుగుతాయని నిపుణులు పేర్కొంటున్నారు. తెలంగాణలో తలసరి ఆదాయం అధికంగా ఉండటం వల్ల వినియోగం పెరిగిందని, డిమాండ్‌కు తగిన సరఫరా లేకపోతే ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉంటుందని, అయితే, ఎల్పీజీ ధరల పెరుగుదల కూడా దీనికి ఒక కారణమని పేర్కొన్నారు.
ఇటీవల కేంద్ర ప్రభుత్వం వస్తువుల వారీగా ద్రవ్యోల్బణ గణాంకాలను విడుదల చేస్తోంది.. ఈ గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా టమాటా, అల్లం ధరల పెరుగుదల కొనసాగుతోంది. తెలంగాణలో వంట నూనెల ద్రవ్యోల్బణం సుమారు 18 శాతానికి చేరుకోవడంతో పట్టణ, గ్రామీణ కుటుంబాల రోజువారీ వంట ఖర్చులు మరింత పెరుగుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
గత నెల మేలోనూ దేశంలో మరే రాష్ట్రంలో లేనంతగా తెలంగాణ రిటైల్ ద్రవ్యోల్బణం రికార్డయింది. ఈ ఏడాది మొదలు ఇప్పటిదాకా తెలంగాణలో నమోదైన ద్రవ్యోల్బణం గణాంకాలే రాష్ర్టాలవారీగా చూసినట్లయితే టాప్‌లో ఉండటం గమనార్హం. ముఖ్యంగా ఆహారోత్పత్తుల ధరలు ఠారెత్తిస్తున్నాయి. దీంతో సామాన్య కుటుంబాల వంటింటి బడ్జెట్ తలకిందులైపోతున్నది.
