Inter Exams 2025: ఇంటర్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు.. ఆ నిబంధన ఎత్తివేత.. విద్యార్థులు ఇవి తప్పక పాటించాలి
ఇంటర్ వార్షిక పరీక్షలు ఇవాళ్టి నుంచి ప్రారంభంకానున్నాయి. ఇందుకోసం అధికారులు పకడ్బంధీ ఏర్పాట్లు చేశారు.

Inter first year exams
Inter Exams 2025: ఇంటర్ వార్షిక పరీక్షలు ఇవాళ్టి నుంచి ప్రారంభంకానున్నాయి. ఇందుకోసం అధికారులు పకడ్బంధీ ఏర్పాట్లు చేశారు. ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొత్తం మూడు గంటలపాటు పరీక్షలు నిర్వహిస్తారు. అయితే, గతంలో ఒక్క నిమిషం ఆలస్యంగా పరీక్షా కేంద్రాలకు చేరుకున్నా లోపలికి అనుమతించేవారు కాదు. ప్రస్తుతం ఒక్క నిమిషం ఆలస్యం నిబంధనను ఇంటర్ బోర్డు ఎత్తివేసింది. పరీక్ష ప్రారంభమైన ఐదు నిమిషాల వరకు.. అంటే 9.05 గంటల వరకు విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారు.
రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు తొమ్మిది లక్షల మందికిపైగా విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరుకానున్నారు. ఇందులో అబ్బాయిలు 4,97,528 మంది ఉండగా.. 4,99,443 మంది అమ్మాయిలు ఉన్నారు. పరీక్షల కోసం 1,532 సెంటర్లు ఏర్పాటు చేయగా.. ఇందులో 49 సెల్ప్ సెంటర్లు ఉన్నాయి. ఉదయం 8.45 గంటల నుంచి 9 గంటల మధ్యలో విద్యార్థులకు ఓఎంఆర్ షీట్ అందజేస్తారు. ఇవాళ్టి నుంచి 19వ తేదీ వరకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు జరగనున్నాయి. ఇదిలాఉంటే.. రేపటి (మార్చి 6వ తేదీ) నుంచి ఇంటర్ సెకండ్ఇయర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మార్చి 20వ తేదీ వరకు సెకండ్ ఇయర్ పరీక్షలు జరుగుతాయి.
పరీక్షల పకడ్బందీ నిర్వహణ కోసం.. కంట్రోల్ కమాండ్ సెంటర్‌లో ప్రత్యేకంగా స్మార్ట్ నిఘాను పెడుతున్నారు. 45 పరీక్షా కేంద్రాలకు ఒక బృందం చేత నిఘాపెట్టారు. పరీక్ష కేంద్రాల వద్ద 100 మీటర్ల దూరంలో బీఎన్ఎస్ 163 (144సెక్షన్) అమల్లో ఉంటుంది. పోలీసు బందోబస్తు ఉంటుంది. అదేవిధంగా హాల్ టికెట్ లేకుండా విద్యార్థులను పరీక్షకు అనుమతించరు. హాల్ టికెట్ పై తప్పులుంటే ప్రిన్సిపాళ్లను, ఇతర అధికారులను సంప్రదించి సవరించుకోవచ్చు. పరీక్షా కేంద్రానికి వాచ్ లు, సెల్ ఫోన్లు, పేజీలు, క్యాలిక్యులెటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, ముద్రిత సామాగ్రిని పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించరు.