మెషీన్ అరిచిందిక్కడ.. వ్యక్తిని హత్య చేసి అతడి భార్య, కొడుకు 8 నెలల తర్వాత ఇలా దొరికిపోయారు..
ఇంటికి వెళ్లి ఈ విషయాన్ని తన తల్లి అరుణకు తెలిపాడు. వాళ్లిద్దరు మృతదేహాన్ని తగులబెట్టారు.

ఓ వ్యక్తిని చంపిన అతడి భార్య, కుమారుడు లై డిటెక్టర్ టెస్ట్‌లో దొరికిపోయారు. నిందితుడు నిజం చెబుతున్నాడా? అబద్ధం చెబుతున్నాడా? అన్న విషయాన్ని ఈ టెస్ట్ ద్వారా అంచనా వేయవచ్చు. ఈ పాలీగ్రాఫ్ మెషీన్ నిందితుడి గుండె స్పందన, శ్వాస, రక్తపోటు, చెమట పట్టే స్థాయిని బట్టి నిజం చెబుతున్నాడా? అబద్ధం చెబుతున్నాడా? అన్న విషయాన్ని నిర్ధారిస్తుంది.
ఇటీవల నిందితులకు జరిపిన ఈ టెస్ట్ ద్వారానే తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో నిందితులు పోలీసులకు దొరికిపోయారు. తాజాగా, పోలీసులు ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
జిల్లాలోని బీర్పూర్ గ్రామానికి సమీపంలో రోళ్లవాగు ప్రాజెక్ట్ దగ్గరలో పది నెలల క్రితం గ్రామస్థులు ఓ గుర్తు తెలియని మృతదేహాన్ని గమనించి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ మృతదేహం సగం కాలిపోయి ఉంది.
పోలీసులు దీనిపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. మృతుడు నర్సింహులపల్లి గ్రామవాసి అంకం లక్ష్మీనారాయణ అని స్థానికులు అన్నారు. దీంతో లక్ష్మీనారాయణ భార్య అరుణ, కుమారుడు సాయి కుమార్ (20)ను పోలీసులు పిలిపించారు.
అయితే, ఆ మృతదేహం లక్ష్మీనారాయణది కాదని వారు చెప్పడం గమనార్హం. పోలీసులే లక్ష్మీనారాయణ అంత్యక్రియలను జరిపించారు. అరుణ, సాయికుమార్‌పై పోలీసులకు అనుమానాలు వచ్చాయి.
డీఎన్ఏ పరీక్షతో..
ఫోరెన్సిక్ నిపుణులను పిలిపించి, లక్ష్మీనారాయణ మృతదేహం నుంచి సేకరించిన తుంటి ఎముకతో డీఎన్ఏ పరీక్షలు జరిపించారు. దీంతో మృతుడి తల్లి డీఎన్ఏతో అది సరిపోలింది. ఆ మృతదేహం లక్ష్మీనారాయణదేనని పోలీసులు తేల్చారు.
లక్ష్మీనారాయణ టైలరింగ్ పని చేసుకునేవాడు. కుటుంబ సభ్యులతో అతడికి గొడవలు జరిగాయి. లక్ష్మీనారాయణ మృతి చెందాడని తెలిసినప్పటికీ అతడి భార్య అరుణ, కుమారుడు సాయికుమార్ ఏమీ పట్టనట్లు ఉన్నారు.
అరుణ, సాయికుమార్‌ను పోలీసులు విచారించారు. వారు నేరాన్ని ఒప్పుకోలేదు. చివరకు లై డిటెక్టర్ టెస్టు నిర్వహించారు. దాని రిజల్ట్స్ ఆధారంగా అరుణ, సాయికుమార్‌ను పోలీసులు విచారించారు. చివరకు వారిద్దరు తామే లక్ష్మీనారాయణను చంపినట్లు ఒప్పుకున్నారు.
దీంతో వారు అతడిని ఎలా హత్య చేశారో తేలింది. హత్య జరగడానికి కొన్ని రోజుల ముందు లక్ష్మీనారాయణ అరుణ, సాయికుమార్‌తో గొడవ పెట్టుకున్నాడు. మద్యం తాగడానికి సాయికుమార్ తన తండ్రిని తీసుకెళ్లాడు. అక్కడ మళ్లీ వారిద్దరి మధ్య గొడవ జరిగింది. లక్ష్మీనారాయణ గొంతును పిసికి సాయికుమార్ చంపేశాడు. అనంతం ఇంటికి వెళ్లి ఈ విషయాన్ని తన తల్లి అరుణకు తెలిపాడు. వాళ్లిద్దరు మృతదేహాన్ని తగులబెట్టారు.