జగిత్యాల జిల్లాలో దారుణ ఘటన.. ఐదేళ్ల చిన్నారి గొంతుకోసి బాత్రూంలో పడేసి..
జగిత్యాల జిల్లాలో చిన్నారి హత్య ఘటన సంచలనంగా మారింది.

Jagtial District
Jagtial District: జగిత్యాల జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కోరుట్ల పట్టణంలో ఐదేళ్ల చిన్నారి శనివారం రాత్రి దారుణ హత్యకు గురైంది. బాలిక నివాసంకు కొద్దిదూరంలో ఉన్న ఓ ఇంట్లోని బాత్రూంలో మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. అయితే, పాపను కిరాతకంగా హత్య చేసింది సైకో నా..? లేదంటే.. ఏమైనా గొడవలు కారణమా..? ఇంకేమైనా కారణాలు ఉన్నాయా.. అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
జగిత్యాల జిల్లాలో చిన్నారి హత్య ఘటన సంచలనంగా మారింది. కోరుట్లలోని ఆదర్శ నగర్‌లో నివాసం ఉండే ఆకుల రాము-నవీన దంపతుల కూతురు హర్షిత (5) దారుణ హత్యకు గురైంది. శనివారం సాయంత్రం 5గంటలకు హర్షిత స్కూల్ నుంచి ఇంటికి వచ్చింది. సాయంత్రం 7గంటల సమయంలో చిన్నారి ఇంటి నుంచి బయటకు వెళ్తున్నట్లు సీసీ కెమెరాలో రికార్డయింది. ఆ తరువాత కనిపించకుండా పోయింది.
చిన్నారి కనిపించకపోవటంతో కుటుంబ సభ్యులు చుట్టుపక్కల ప్రాంతాల్లో ముమ్మరంగా గాలించారు. అయినా ఆచూకీ లభించక పోవటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు కింద కేసు నమోదు చేసిన పోలీసులు చిన్నారి కోసం వెతుకులాట ప్రారంభించారు.
పోలీసులు చుట్టుపక్కల ఇండ్లలో బాలిక కోసం వెతుకుతున్న క్రమంలో బాలిక ఇంటికి కొంతదూరంలోనే విజయ్ అనే వ్యక్తి ఇంటి బాత్రూమ్‌లో చిన్నారి డెడ్ బాడీ లభ్యమైంది. మృతదేహాన్ని అక్కడి నుంచి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. రాత్రంతా క్లూస్ టీమ్‌తో పోలీసులు విచారణ చేపట్టారు.
ఇంటికి చెందిన వ్యక్తి విజయ్ వరంగల్ జిల్లా నర్సంపేటలో ఉన్నట్లుగా చెబుతున్నట్లు సమాచారం. స్థానికంగా వినాయక విగ్రహాల తయారీ దుకాణంలో కూలీగా విజయ్ పనిచేస్తుంటాడని, అతను మద్యానికి బానిసయ్యాడని, ఎప్పుడు ఇంటికి వస్తాడో.. ఎప్పుడు వెళ్తాడో తెలియదని స్థానికులు చెప్పారు. అతడికి పెళ్లయినా భార్య, కుమార్తె వదిలివెళ్లడంతో ఇంట్లో ఒక్కడే ఉంటున్నాడని తెలిపారు.
అయితే, బాలిక మృతదేహం అతని ఇంట్లోని బాత్ రూంలోకి ఎలా వచ్చింది..? పాపను కిరాతకంగా హత్య చేసింది సైకోనా..? లేదా ఏమైనా గొడవల కారణంగా చిన్నారిని హత్య చేశారా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.