Smita Sabharwal
Smita Sabharwal: సీనియర్ ఐఏఎస్, తెలంగాణ పర్యాటకశాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్ చిక్కుల్లో పడినట్లు తెలుస్తోంది. అద్దె కారు విషయంలో ఆమెకు నోటీసులు ఇచ్చేందుకు జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్శిటీ అధికారులు సిద్ధమైనట్లు సమాచారం. ఈ మేరకు యూనివర్శిటీ బోర్డు మీటింగ్ లో చర్చించిన అధికారులు.. న్యాయ నిపుణుల సూచనలను తీసుకొని ఆ తరువాత ఆమె నుంచి రావాల్సిన సొమ్మును రాబట్టేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలో ఆమెకు ఒకటిరెండు రోజుల్లో నోటీసులు జారీ చేయనున్నారని సమాచారం.
Also Read: AP Telangana : తెలంగాణలో మెక్ డొనాల్డ్స్ గ్లోబల్ ఆఫీస్, ఏపీలో అశోక్ లేలాండ్ ప్లాంట్..
బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో స్మితా సబర్వాల్ కీలక పోస్టుల్లో పనిచేసిన విషయం తెలిసిందే. ఆమె సీఎంఓ అదనపు కార్యదర్శిగా ఉన్న సమయంలో ఆమె ఇచ్చిన లేఖ మేరకు 2016 అక్టోబర్ నెల నుంచి 2024 మార్చి నెల వరకు ఓ కారును అద్దెకు తీసుకున్నారు. ఆ కారుకు నెలకు రూ.63వేల చొప్పున అద్దె రూపంలో జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్శిటీ నుంచి తీసుకున్నారని తెలుస్తోంది. వర్శిటీ నిబంధనలకు విరుద్ధంగా అద్దెపేరిట 90 నెలలకు రూ.61లక్షలు తీసుకున్నట్లు ఇటీవల ఆడిట్ లో అధికారులు గుర్తించారు. ఈ విషయంపై ఆడిట్ శాఖ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో అధికారులు వాటిని రికవరీ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
స్మితా సబర్వాల్ అద్దెకు తీసుకున్నవాహనం నాన్ టాక్స్ కాదు, ఎల్లో ప్లేట్ వాహనం కాదు. ఓ వ్యక్తి పేరిట ఆ వాహనం ఉన్నట్లు ఆడిట్ శాఖ విచారణలో తేలింది. అయితే, సీఎంవో స్మితా సబర్వాల్ కార్యాలయం నుంచి ప్రతి నెలా వాహనం అద్దె రిసిప్టులు రావడంతో వర్శిటీ యాజమాన్యం ప్రతినెలా డబ్బులు చెల్లించినట్లు తెలిసింది.
ఈ విషయంపై ప్రభుత్వానికి రెండుమూడు రోజుల్లో పూర్తి నివేదిక సమర్పించిన తరువాత స్మిత సబర్వాల్ నుంచి నిధులు తిరిగి రాబట్టేందుకు నోటీసులు ఇవ్వాలని వర్శిటీ అధికారులు యోచిస్తోన్నట్లు సమాచారం.