AP Telangana : తెలంగాణలో మెక్ డొనాల్డ్స్ గ్లోబల్ ఆఫీస్, ఏపీలో అశోక్ లేలాండ్ ప్లాంట్..
తెలంగాణను గమ్యస్థానంగా ఎంచుకోవడం గర్వంగా ఉందన్నారాయన.

AP Telangana : అమెరికాకు చెందిన ప్రముఖ కంపెనీ మెక్ డొనాల్డ్స్ తో తెలంగాణ ప్రభుత్వం కీలక ఒప్పందం కుదుర్చుకుంది. సంస్థ విస్తరణలో భాగంగా హైదరాబాద్ లో మెక్ డొనాల్డ్స్ ఇండియా గ్లోబల్ ఆఫీస్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. 2వేల మంది ఉద్యోగులతో ఆఫీస్ ను ప్రారంభించనుంది మెక్ డొనాల్డ్స్.
అసెంబ్లీలోని ఛాంబర్ లో మెక్ డొనాల్డ్స్ ఛైర్మన్, సీఈవో క్రిస్ తో పాటు సంస్థ ప్రతినిధులతో సీఎం రేవంత్ చర్చలు జరిపారు. రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యంతో పెట్టుబడుల ఒప్పందం చేసుకున్నారు. గ్లోబల్ ఆఫీస్ ఏర్పాటు చేస్తుండటంపై సీఎం రేవంత్ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణను గమ్యస్థానంగా ఎంచుకోవడం గర్వంగా ఉందన్నారాయన.
ప్రభుత్వం తరపున అన్ని సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం తెలంగాణలో 38 మెక్ డొనాల్డ్స్ ఔట్ లెట్స్ ఉన్నాయి. ప్రతీ ఏడాది 3 లేదా 4 కొత్త ఔట్ లెట్లను విస్తరించే ప్రణాళికను రూపొందిస్తున్నారు. కొత్తగా గ్లోబల్ ఇండియా ఆఫీస్ ఏర్పాటుతో రాష్ట్రంలోని యువతకు మరిన్ని ఉపాధి అవకాశాలు లభిస్తాయి.
అశోక్ లేలాండ్ ప్లాంట్ ను ప్రారంభించిన మంత్రి లోకేశ్..
కూటమి ప్రభుత్వం వచ్చాక ఏపీకి పరిశ్రమలు క్యూ కడుతున్నాయన్నారు మంత్రి నారా లోకేశ్. పాదయాత్ర సందర్భంగా మల్లవల్లికి వచ్చినప్పడు నిలిచిపోయిన అశోక్ లేలాండ్ ప్లాంట్ ను మళ్లీ తీసుకొస్తామని మాట ఇచ్చామన్నారు లోకేశ్.
ఇచ్చిన మాట ప్రకారం ఇప్పుడు అశోక్ లేలాండ్ ప్లాంట్ ను ప్రారంభించేందుకు ముందుకొచ్చామన్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లా మల్లవల్లిలో అశోక్ లేలాండ్ ప్లాంట్ ను మంత్రి లోకేశ్ ప్రారంభించారు. దీని ద్వారా వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ఈ ప్లాంట్ లో అత్యాధునిక ఎలక్ట్రిక్ బస్సులు తయారీ చేయనున్నారు.
”ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక ప్రగతి పరుగులు పెడుతోంది. 75 ఎకరాల్లో విస్తరించి ఉన్న అశోక్ లేలాండ్ ప్లాంట్ ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో ఒక మైలురాయి కానుంది. ఇక్కడ ఎలక్ట్రిక్ బస్సులు ఉత్పత్తి చేస్తారు. అశోక్ లేలాండ్ ప్లాంట్ ద్వారా ఉద్యోగాల కల్పన జరుగుతుంది. నైపుణ్యాభివృద్ధికి ప్రోత్సాహం లభిస్తుంది.
Also Read : స్టార్ బక్స్ కి బిగ్ షాక్.. రూ.432 కోట్లు కట్టాల్సిన పరిస్థితి.. టీ కప్ మూత లూజ్ గా పెట్టినందుకు..
పర్యావరణ అనుకూల రవాణకు ఊతమిస్తూ, ఆంధ్రప్రదేశ్ కోసం స్విచ్ ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సును స్వీకరించడం జరిగింది. ఇది సుస్థిర రవాణ దిశగా ఒక పెద్ద ముందడుగు” అని మంత్రి లోకేశ్ అన్నారు.