New Toll policy: వాహనదారులకు గుడ్‌న్యూస్.. త్వరలో సరికొత్త టోల్ విధానం.. వెల్లడించిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ
రాజ్యసభలో గడ్కరీ మాట్లాడారు. ‘‘జాతీయ రహదారులపై వసూలు చేస్తున్న టోల్ ట్యాక్స్ లలో మార్పులు తెచ్చి వినియోగదారులకు..

Toll Plaza
New toll policy soon: టోల్ టాక్స్ విషయంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వాహనదారులకు శుభవార్త చెప్పారు. ప్రభుత్వం త్వరలో కొత్త టోల్ విధానాన్ని తీసుకురాబోతుందని, ఈ కొత్త విధానం ప్రకారం వాహనదారులకు టోల్ టాక్స్ చెల్లింపుల్లో ఉపశమనం లభిస్తుందని తెలిపారు. అంతేకాదు.. ఉపగ్రహాల సాయంతో ప్రధాన రహదారుల మీద టోల్ వసూలుచేసే వ్యవస్థపై అధ్యయనం, చర్చలు జరుగుతున్నాయని, అన్నీ అనుకున్నట్లు జరిగితే టోల్ గేట్ల వద్ద వాహనదారులు ఆగాల్సిన పనిలేకుండా వెళ్లొచ్చునని చెప్పారు.
రాజ్యసభలో గడ్కరీ మాట్లాడారు. ‘‘జాతీయ రహదారులపై వసూలు చేస్తున్న టోల్ ట్యాక్స్ లలో మార్పులు తెచ్చి, వినియోగదారులకు సమంజసమైన రాయితీలు ఇవ్వడానికి త్వరలో కొత్త విధానాన్ని తీసుకొస్తున్నాం. రహదారుల నిర్మాణంపై ప్రభుత్వం ఎంతో భారీగా నిధులను ఖర్చు చేస్తున్నందున టోల్ వసూలు తప్పనిసరి. దేశంలో నాలుగు లైన్ల రహదారుల మీదనే టోల్ వసూలు చేస్తున్నాం. రెండు లైన్ల రహదారులపై టోల్ టాక్స్ లేదు’’ అని గడ్కరీ పేర్కొన్నారు.
దేశంలో 2019-20లో టోల్ టాక్స్ ద్వారా రూ. 27,503 కోట్లు ఆదాయం సమకూరగా.. 2023-24లో అది రూ.64,809.86 కోట్లకు పెరిగిందని గడ్కరీ తెలిపారు. 2008 నిబంధనల ప్రకారం.. జాతీయ రహదారిపై ఒకే వైపున మరియు ఒకే దిశలో 60 కిలోమీటర్ల లోపల రెండవ టోల్ ప్లాజా నిర్మించకూడదు. అంటే రెండు టోల్ ప్లాజాల మధ్య కనీసం 60 కిలోమీటర్ల దూరం ఉండాలి.
ఉపగ్రహాల సాయంతో ప్రధాన రహదారుల మీద సుంకాలు వసూలు చేసే వ్యవస్థపై పరిశీలనకు నియమించిన ఎపెక్స్ కమిటీ దీనిపై మరింతగా అధ్యయనం, చర్చలు జరగాల్సి ఉందని తెలిపిందని గడ్కరీ అన్నారు. అంటే.. భద్రతాపరమైన, వ్యక్తిగత గోప్యతాపరమైన అంశాలను లోతుగా పరిశీలించాల్సి ఉందని చెప్పారు. ఈ విధానం అమల్లోకివస్తే వాహనదారులు టోల్ గేట్ల వద్ద ఆగాల్సిన అవసరం లేకుండానే ఆటోమేటిగ్గా టోల్ చెల్లిస్తూ వేగంగా కదలిపోవడానికి ఉపగ్రహాలు తోడ్పడతాయని అన్నారు. ప్రస్తుతం భారత్ తన నావిక్ వ్యవస్థ కింద పరిమిత సంఖ్యలోనే ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రయోగించి ఉంది. అంతర్జాతీయ యంత్రాంగమైన జీఎన్ఎస్ఎస్ లోని ఉపగ్రహాల సాయంతో ఎలక్ట్రానిక్ సుంకం వసూలు పద్దతిని ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తోందని గడ్కరీ తెలిపారు.