Jubilee Hills : జూబ్లీహిల్స్‌లో స్థలం కబ్జా యత్నం.. ఇద్దరు సినీ నిర్మాతలపై కేసు నమోదు
Jubilee Hills : జూబ్లీహిల్స్‌లో స్థలం కబ్జా యత్నం కేసులో ఇద్దరు సినీ నిర్మాతలపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Jubilee Hills Police Station
Jubilee Hills : హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో స్థల కబ్జా యత్నం ఆరోపణల నేపథ్యంలో ప్రముఖ సినీ నిర్మాతలు సి. కళ్యాణ్, బురుగుపల్లి శివరామకృష్ణతో పాటు మరికొందరిపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.
Also Read : ‘నా భార్య, పిల్లలని ఏమీ అనొద్దు.. అన్నారంటే.. దెయ్యమై వాళ్లను వదిలిపెట్టను..’ కానిస్టేబుల్ బలవన్మరణం
వ్యాపారవేత్త కాంతమనేని రవిశంకర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది. వివాదాస్పద స్థలం జూబ్లీహిల్స్‌లోని ఉమెన్స్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీకి చెందిన ప్లాట్ నంబర్ 89గా గుర్తించారు.
ఫిర్యాదు ప్రకారం.. ఈ భూమిపై కోర్టులో కేసు పెండింగ్‌లో ఉండగా, జూన్ 10న కోర్టు రవిశంకర్ స్వాధీనంలో ఉన్న భూమిలో ఎలాంటి జోక్యం చేసుకోవద్దంటూ తాత్కాలిక నిషేధాజ్ఞలు జారీ చేసింది. అయినప్పటికీ కోర్టు ఉత్తర్వులను పట్టించుకోకుండా నిందితులు అక్రమంగా స్థలంలోకి ప్రవేశించారని రవిశంకర్ ఆరోపించారు.
స్థలంలోని తాళాలు పగులగొట్టి, ప్రధాన గేటును ధ్వంసం చేయడంతోపాటు అక్కడ ఉన్న సామగ్రిని చెల్లాచెదురు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా అక్కడ విధుల్లో ఉన్న సిబ్బందిని బెదిరించి, స్థలంలో నిర్మించిన గదిని కూడా ధ్వంసం చేశారని ఆరోపించారు. ఈ ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు ఘటనకు సంబంధించిన అన్ని అంశాలపై దర్యాప్తు చేపట్టారు.
