మంత్రి దామోదర రాజనర్సింహతో జూనియర్ డాక్టర్ల చర్చలు విఫలం

హైదరాబాద్ మినిస్టర్ క్వార్టర్స్ లో జూడాలతో మంత్రి దామోదర రాజనర్సింహ చర్చలు జరిపారు. అన్ని డిమాండ్లను పరిష్కరించాలని కోరారు.

మంత్రి దామోదర రాజనర్సింహతో జూనియర్ డాక్టర్ల చర్చలు విఫలం

Junior Doctors Strike : తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహతో జూనియర్ డాక్టర్ల చర్చలు విఫలమయ్యాయి. మంత్రి ప్రతిపాదనలపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని జూడాలు చెప్పారు. అప్పటివరకు సమ్మె కొనసాగిస్తామని తెలిపారు. హైదరాబాద్ మినిస్టర్ క్వార్టర్స్ లో జూడాలతో మంత్రి దామోదర రాజనర్సింహ చర్చలు జరిపారు. అన్ని డిమాండ్లను పరిష్కరించాలని కోరారు.

శ్రీహర్ష, జూనియర్ డాక్టర్..
స్టైఫండ్ కి గ్రీన్ ఛానల్ పై మారోమారు చర్చించి నిర్ణయిస్తామని మంత్రి తెలిపారు. కాకతీయ వర్సిటీలో రోడ్లు సహా హాస్టల్ ఏర్పాట్లపై ఇప్పటికే ఫైనాన్స్ శాఖకు పంపాము. వైద్యుల భద్రత గురించి ఇప్పటివరకు ఎలాంటి చర్చ జరగలేదన్నారు. దానిపై ఆలోచిస్తామన్నారు. కొత్త మెడికల్ కాలేజీలకు బస్ ఏర్పాట్లపై డీఎంఈ నిర్ణయం తీసుకోవాలని మంత్రి తెలిపారు. డీఎంఈని కలిసి ఈ అంశంపై చర్చిస్తాం. సమ్మెపై రాష్ట్ర స్థాయి జూడాలతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. అప్పటి వరకు సమ్మె యధాతధంగా కొనసాగిస్తాం.

ఉపకారవేతనాలు ప్రతి నెల ఇవ్వాలని జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు. జూడాల సమ్మెకు ఇదొక ప్రధాన కారణంగా చెప్పొచ్చు. పని చేస్తున్న ఆసుపత్రుల్లో మౌలిక వసతులు కల్పించాలని, భద్రత పెంచాలని మరో డిమాండ్. గడిచిన కొన్నేళ్లుగా ఉపకారవేతనాల విషయంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని జూనియర్ డాక్టర్లు వాపోయారు. స్టైపండ్ చెల్లింపులో తీవ్ర జాప్యం జరుగుతోందన్నారు. దీనికి సంబంధించి వెంటనే గ్రీన్ చానల్ ఏర్పాటు చేసి, ఉపకారవేతనాలు పెండింగ్ లో పెట్టకుండా చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే వారి ప్రధాన డిమాండ్.

ఇవాళ్టి నుంచి సమ్మెకు వెళ్తామన్నారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వారితో పలు దఫాలుగా చర్చలు జరిపేందుకు కొంత ప్రయత్నాలు చేసినా.. జూడాలు వినలేదు. గత నోటీసు ప్రామాణికంగా చేసుకుని సమ్మెలోకి వెళ్లారు. హైదరాబాద్ నగరంలోని గాంధీ, ఉస్మానియా, నీలోఫర్ ఆసుపత్రులతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ ఆసుపత్రులు, మెడికల్ కాలేజీల్లో జూడాలు విధులు బహిష్కరించి ఆందోళనకు దిగారు. ఉపకార వేతనాల చెల్లింపు, పని చేస్తున్న ఆసుపత్రుల వద్ద మౌలిక వసతుల కల్పన, హాస్టల్ లో మెరుగైన వసతుల కల్పన, భద్రత.. జూనియర్ డాక్టర్ల ప్రధాన డిమాండ్లుగా ఉన్నాయి.

జూనియర్ డాక్టర్ల ప్రతినిధులు ఇవాళ మంత్రి దామోదర రాజనర్సింహతో గంటకు పైగా చర్చలు జరిపారు. ముఖ్యంగా స్టైఫండ్ విషయంలో గ్రీన్ చానల్ ఏర్పాటు చేయాలన్నది వారి ప్రధాన డిమాండ్. అయితే మంత్రితో జరిగిన చర్చలు విఫలం అయ్యాయి. దీంతో సమ్మె యధాతధంగా కొనసాగుతుందని జూనియర్ డాక్టర్లు తేల్చి చెప్పారు.

Also Read : కాంగ్రెస్‌లో చేరికల చిచ్చు.. ఎమ్మెల్సీ పదవికి జీవన్ రెడ్డి రాజీనామా? రంగంలోకి మంత్రి శ్రీధర్ బాబు