Karimnagar Car Case : యాక్సిడెంట్ కాదు హత్య.. కరీంనగర్ కారు ఘటనపై సీపీ సీరియస్
రాష్ట్రంలో సంచలనం రేపిన కరీంనగర్ కారు ప్రమాద ఘటనలో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. కారు ఓనర్ రాజేంద్రప్రసాద్, మరో ముగ్గురు మైనర్లను అదుపులోకి తీసుకున్నారు.

Karimnagar Car Accident Case
Karimnagar Car Case : రాష్ట్రంలో సంచలనం రేపిన కరీంనగర్ కారు ప్రమాద ఘటనలో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. కారు ఓనర్ రాజేంద్రప్రసాద్, మరో ముగ్గురు మైనర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలుడు కారు నడిపి ప్రమాదానికి కారణమైనట్లు పోలీసులు నిర్ధరించారు. కారు ఓనర్ కొడుకు(మైనర్) డ్రైవింగ్ చేశాడని కరీంనగర్ సీపీ సత్యనారాయణ తెలిపారు. ఇద్దరు మైనర్ స్నేహితులతో కలిసి కారు నడిపినట్లు
వెల్లడించారు. కాగా, కారుని తానే నడిపినట్లు నమ్మించేందుకు బాలుడి తండ్రి రాజేంద్రప్రసాద్ ప్రయత్నం చేశారని సీపీ చెప్పారు.
రాజేంద్రప్రసాద్ కొడుకే కారు నడిపినట్లు తమ దర్యాఫ్తులో తేలిందని సీపీ వెల్లడించారు. బ్రేక్ బదులు యాక్సిలేటర్ తొక్కడంతో ఘోర ప్రమాదం జరిగిందని వివరించారు. మైనర్లు ప్రతిరోజు ఉదయం కారులో బయటకు వస్తున్నారని సీపీ అన్నారు. అంబేద్కర్ స్టేడియంలో వాకింగ్ కోసం మైనర్లు కారులో వెళ్తారని చెప్పారు. ప్రమాదానికి కారణమైన కారుపై ఓవర్ స్పీడ్ చలాన్లు ఇప్పటికే చాలా ఉన్నాయని సీపీ తెలిపారు.
ఈ ఘటనపై యాక్సిడెంట్ కేసు కాకుండా హత్య కేసు నమోదు చేశామని సీపీ చెప్పారు. నలుగురు అమాయకుల ప్రాణాలు పోయినందుకు హత్య కేసు నమోదు చేశామన్నారు. మైనర్లకు కారు అందుబాటులో ఉంచడంతో యజమానిపై కేసు నమోదు చేశామని సీపీ తెలిపారు. స్మార్ట్ సిటీ పనుల కోసం రోడ్డుపక్కన గుడిసెలను వారం రోజుల క్రితం తొలగించామన్నారు సీపీ. కాగా, కొందరు రోడ్డుపక్కన గుడిసెల్లో ఉండి వృత్తి పనులు చేసుకుంటున్నారని తెలిపారు.
కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఆదివారం ఘోర కారు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ కారు బీభత్సం సృష్టించింది. నగరంలోని కమాన్ సెంటర్ దగ్గర తెల్లవారుజామున వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి రోడ్డు పక్కనున్న గుడిసెల్లోకి దూసుకుపోయింది. ఈ ఘటనలో సీసా కమ్మరి వృత్తి చేసే నలుగురు కూలీలు దుర్మరణం చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
Lemon Tea : లెమన్ టీ తాగితే ఎక్కవకాలం జీవించ వచ్చా?
ప్రమాదం తర్వాత నిందితులు కారును అక్కడే వదిలి పరారయ్యారు. కూలీలపై దూసుకెళ్లిన కారుపై గతంలోనూ ర్యాష్ డ్రైవింగ్ చలాన్లు జారీ అయ్యాయి. ప్రమాదంలో చనిపోయిన కూలీల కుటుంబాలకు న్యాయం చేయాలంటూ కరీంనగర్ లో పలు పార్టీలు, సంఘాలు ధర్నాలు నిర్వహించాయి.