ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేసిన కవిత

kavitha
mlc kavitha : ఇటీవల జరిగిన ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేశారు. గురువారం(అక్టోబర్ 29,2020) మధ్యాహ్నం 12:45 నిమిషాలకు శాసనమండలి చైర్మన్ చాంబర్ లో కవిత ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేశారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కవితతో ప్రమాణస్వీకారం చేయించారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు కార్యక్రమానికి హాజరయ్యారు.
అక్టోబర్ 9న జరిగిన ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి కవితకు 728 ఓట్లు రాగా బీజేపీకి 56 ఓట్లు, కాంగ్రెస్‌కు 29 ఓట్లు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రతిపక్ష పార్టీలు కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయాయి. ఉప పోరులో 672 ఓట్ల మెజార్టీతో కవిత గెలుపొందారు. 2014 నుంచి 2019 వరకు లోక్‌సభ సభ్యురాలిగా నిజామాబాద్ నుంచి కవిత ప్రాతినిధ్యం వహించారు. ఇప్పటికే కవిత ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేయాల్సి ఉండగా, హోం క్వారంటైన్ లోకి వెళ్లడంతో ఈ కార్యక్రమం కాస్త ఆలస్యమై ఇవాళ జరిగింది.
నిజామాబాద్ జిల్లాలో పార్టీకి పట్టున్నా…పార్లమెంటు ఎన్నికల్లో ఎంపీగా కవిత విజయం సాధించలేకపోయారు. దాదాపు రెండేళ్ల తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఎమ్మెల్సీగా విజయం దక్కించుకుని పెద్దల సభలోకి అడుగుపెట్టారు కవిత. దీంతో కల్వకుంట్ల కుటుంబం నుంచి తొలిసారి పెద్దల సభకు ప్రాతినిధ్యం దక్కినట్లు అయ్యింది.