Nagarjuna Sagar Bypoll : ప్రచార బరిలోకి గులాబీ బాస్, 14న హాలియాలో బహిరంగ సభ

తెలంగాణలో బైపోల్‌ వార్‌తో.. మరోసారి పాలిటిక్స్‌ హీటెక్కుతున్నాయి. నాగార్జున సాగర్‌లో ప్రధాన పార్టీల ప్రచారం జోరుమీదుండగా.. ఉప ఎన్నిక ప్రచార బరిలోకి గులాబీ బాస్‌, తెలంగాణ సీఎం ఎంట్రీ ఇవ్వనున్నారు.

Nagarjuna Sagar Bypoll : ప్రచార బరిలోకి గులాబీ బాస్, 14న హాలియాలో బహిరంగ సభ

Nagarjuna Sagar Bypoll

Updated On : April 7, 2021 / 6:20 AM IST

election campaign : తెలంగాణలో బైపోల్‌ వార్‌తో.. మరోసారి పాలిటిక్స్‌ హీటెక్కుతున్నాయి. నాగార్జున సాగర్‌లో ప్రధాన పార్టీల ప్రచారం జోరుమీదుండగా.. ఉప ఎన్నిక ప్రచార బరిలోకి గులాబీ బాస్‌, తెలంగాణ సీఎం ఎంట్రీ ఇవ్వనున్నారు. ఈ నెల 14న హాలియా శివారులో జరిగే బహిరంగ సభలో.. కేసీఆర్‌ పాల్గొననున్నారు. సభ నిర్వహణకు సంబంధించి హాలియా శివారులోని పెద్దవూర మార్గంలో 20 ఎకరాల ఖాళీ స్థలాన్ని గుర్తించిన పార్టీ నేతలు.. సభకు అనుమతులు కూడా పొందినట్లు తెలుస్తోంది.

నాగార్జునసాగర్‌ నియోజకవర్గ నలుమూలల నుంచి జనసమీకరణ చేస్తుండటంతో.. 30 ఎకరాలను పార్కింగ్‌ కోసం ప్రత్యేకంగా కేటాయించారు. సభ నిర్వహణకు మరో 7 రోజులే వ్యవధి ఉండటంతో జన సమీకరణ బాధ్యతను సాగర్‌ నియోజకవర్గం పరిధిలో ఎన్నికల ఇన్‌చార్జీలుగా వ్యవహరిస్తున్న పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలకు అప్పగించారు. కోవిడ్‌ పరిస్థితుల నేపథ్యంలో సభ సందర్భంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాయి పార్టీ వర్గాలు.

సాగర్‌ సిట్టింగ్‌ స్థానాన్ని ఎలాగైనా కాపాడుకోవాలనే ప్రయత్నాల్లో ఉంది అధికార టీఆర్‌ఎస్‌. దుబ్బాక, గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో బీజేపీతో తలపడిన టీఆర్‌ఎస్‌.. సాగర్‌ ఉప ఎన్నికలో మాత్రం కాంగ్రెస్‌ను ప్రధాన ప్రత్యర్థిగా భావిస్తోంది. ప్రచారంలో పైచేయి సాధించి పోలింగ్‌ నాటికి విపక్ష శిబిరంలో ఆత్మవిశ్వాసం దెబ్బతీయడం ద్వారా భారీ మెజారిటీ సాధించేందుకు టీఆర్‌ఎస్‌ అధినేత వ్యూహాలు రచిస్తున్నారు.

ఉప ఎన్నిక ప్రచార బాధ్యతలను కొత్త బృందానికి అప్పగించిన కేసీఆర్‌ వివిధ వర్గాల నుంచి విభిన్న కోణాల్లో ప్రతిరోజూ అందుతున్న నివేదికలను విశ్లేషిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు. క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా తమ పార్టీ ప్రచార వ్యూహాన్ని రోజువారీగా మారుస్తున్నట్లు ప్రచారంలో సమన్వయ బాధ్యతలు నిర్వహిస్తున్న టీఆర్‌ఎస్‌ నేత ఒకరు వెల్లడించారు. ఎమ్మెల్యేలు బాల్క సుమన్, జీవన్‌రెడ్డి, రవీంద్రకుమార్, కోరుకంటి చందర్, భూపాల్‌రెడ్డి, కోనేరు కోణప్ప, శంకర్‌నాయక్, భాస్కర్‌రావుతో పాటు కరీంనగర్‌ మేయర్‌ సునీల్‌రావు, సుడా చైర్మన్‌ జీవీ రామకృష్ణారావు వంటి నేతలకు సాగర్‌ నియోజకవర్గం పరిధిలోని మున్సిపాలిటీలు, మండలాల వారీగా పూర్తి స్థాయిలో ప్రచార బాధ్యతలు అప్పగించడం ద్వారా కేసీఆర్‌ కొత్త తరహా వ్యూహాన్ని అమలు చేస్తున్నారు.

Read More : Parishad elections : ఏపీలో పరిషత్ ఫైట్..ఎన్నికలు జరుగుతాయా ? లేదా ? చిత్తూరులో వైసీపీ, టీడీపీ వర్గాల ఫైటింగ్