Parishad elections : ఏపీలో పరిషత్ ఫైట్..ఎన్నికలు జరుగుతాయా ? లేదా ? చిత్తూరులో వైసీపీ, టీడీపీ వర్గాల ఫైటింగ్

Parishad elections : ఏపీలో పరిషత్ ఫైట్..ఎన్నికలు జరుగుతాయా ? లేదా ? చిత్తూరులో వైసీపీ, టీడీపీ వర్గాల ఫైటింగ్

Parishad elections

AP HC : ఏపీలో పరిషత్‌ ఫైట్‌ సస్పెన్స్‌గా మారింది. ఎన్నికలు జరుగుతాయా లేదా అనే ఉత్కంఠ నెలకొంది. పరిషత్‌ పోరుకు సర్వం సిద్ధమైన దశలో.. హఠాత్తుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను నిలిపివేస్తూ సింగిల్‌ జడ్జి మంగళవారం మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. ఈ ఉత్తర్వులపై రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ హైకోర్టులో రాత్రి హౌస్‌ మోషన్‌ రూపంలో అప్పీల్‌ దాఖలు చేసింది. సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులు రద్దు చేయాలని అభ్యర్థిస్తూ.. కమిషన్‌ కార్యదర్శి కన్నబాబు దాఖలు చేసిన ఈ అప్పీల్‌ను హైకోర్టు ధర్మాసనం 2021, ఏప్రిల్ 07వ తేదీ బుధవారం విచారించే ఛాన్స్‌ ఉంది. ఏ క్షణమైనా హైకోర్టు.. తీర్పు వెల్లడించే అవకాశం ఉంది. మరో గంట సేపటిలో ఎన్నికల ప్రచారం ముగుస్తుందన్న సమయంలో పరిషత్‌ ఎన్నికలను వాయిదా వేస్తూ.. హైకోర్టు తీర్పు వెలువరించడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. దీంతో సుదీర్ఘకాలంగా సాగుతున్న ఈ పరిషత్‌ ఎన్నికల ప్రక్రియ ఎప్పుడు ముగుస్తుందా అనే ఉత్కంఠ, ఆందోళన.. అభ్యర్థుల్లో నెలకొంది.

చిత్తూరులో చిచ్చు : –
పరిషత్‌ ఎన్నికలు చిత్తూరు జిల్లాలో చిచ్చురేపాయి. నడిరోడ్డుపైనే బాహాబాహీకి దిగేలా చేశాయి. వైసీపీ, టీడీపీ వర్గాలు కొట్లాటకు దిగడంతో.. మాజీ సీఎం చంద్రబాబు నియోజకవర్గంలో హైటెన్షన్‌ నెలకొంది. ఇరు పార్టీల క్యాడర్‌ సై అంటే సై అంటూ.. కొట్లాటకు దిగి కుమ్మేసుకోవడంతో.. శాంతిపురంలో అశాంతి నెలకొంది. రెండు పార్టీల మధ్య పరిషత్ ఫైట్‌తో.. పోలీసులు రంగ ప్రవేశం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శాంతిపురంలో నడిరోడ్డుపై టీడీపీ, వైసీపీ నేతలు కొట్లాటకు దిగారు. పరిషత్‌ ఎన్నికలపై హైకోర్ట్‌ స్టే ఇవ్వడంతో.. ఎన్టీఆర్‌ విగ్రహానికి పాలాభిషేకం చేసేందుకు వెళ్లారు టీడీపీ నాయకులు.

అటువైపుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ వైసీపీ శ్రేణులు రావడంతో.. ఇరు వర్గాల మధ్య గొడవ మొదలైంది. చంద్రబాబుకు మద్దతుగా తెలుగు తమ్ముళ్లు.. ఎన్నికలకు భయపడే చంద్రబాబు కోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్నారని వైసీపీ శ్రేణుల నినాదాలు చేస్తూ.. కొట్లాటకు దిగారు. మాటా మాటా పెరగడంతో.. చేతులకు పనిచెప్పారు. ఇరువర్గాల మధ్య గొడవ కాస్తా ఘర్షణగా మారడంతో.. రోడ్డుపైనే ఒకరిపై ఒకరు పిడిగుద్దులతో విరుచుకుపడ్డారు. రాళ్లు, కర్రలతో దాడి చేసుకున్నారు. ఒళ్లు తెలియకుండా ఒక వర్గంపై మరో వర్గం దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఇరువర్గాలకు చెందిన పలువురికి గాయాలయినట్లు తెలుస్తోంది.