Tan Singh Naik : లబాణా లంబాడీలను ఎస్టీ జాబితాలో చేర్చకపోతే.. బుజ్జగింపుల్లేవు యుద్ధమే : తాన్ సింగ్ నాయక్
ప్రాణాలకైనా తెగిస్తాం.. హక్కులను సాధించుకుంటామని తేల్చి చెప్పారు. కేంద్రంతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే తమను కలుపుకుని 10 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు.

Tan Singh Naik
Tan Singh Naik – Labana Lambada : లబాణా లంబాడీలను ఎస్టీ జాబితాలో చేర్చకపోతే బుజ్జగింపులు లేవని యుద్ధానికే సిద్ధమవుతామని సీఎం కేసీఆర్ కు లబాణా లంబాడా రాష్ట్ర అధ్యక్షుడు తాన్ సింగ్ నాయక్ తెలిపారు. దీనిపై ఇప్పటికీ మంత్రులు, ఎమ్మెల్యేలు స్పందించడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన చెల్లప్ప కమిషన్ కు విలువ లేదా అని ప్రశ్నించారు. ఉద్యమ నాయకునిగా తమ సమస్యలు కేసీఆర్ కు తెలియవా అని నిలదీశారు.
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో తాన్ సింగ్ నాయక్ మీడియా సమావేశంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ డిమాండ్లు పరిష్కరించకపోతే కామారెడ్డి నియోజకవర్గంతో పాటు తమ ప్రాంతాలైన 9 నియోజకవర్గాల్లో నామినేషన్లు వేస్తామని చెప్పారు. ఒక్కొక్క నియజకవర్గంలో 116 చొప్పున కామారెడ్డి నియోజకవర్గంలో మాత్రం 1016 నామినేషన్లు వేస్తామని వెల్లడించారు.
తాము కొత్తగా అడగడం లేదని బిచ్చం అడుక్కోవడం లేదు తమ హక్కులను అడుగుతున్నామని పేర్కొన్నారు. త్వరలో కామారెడ్డిలో 25 వేల మందితో ఏక్తా ర్యాలీ నిర్వహిస్తామని, కలెక్టర్ ను నిర్బంధిస్తామని తెలిపారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే సెక్రటేరియట్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు.
ప్రాణాలకైనా తెగిస్తాం.. హక్కులను సాధించుకుంటామని తేల్చి చెప్పారు. కేంద్రంతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే తమను కలుపుకుని 10 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. జీఓ 2,4,5 అమలు చేయాలని కోరారు. పోడు భూముల పట్టాలు ఇవ్వాలని, లబాణా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.