బాబోయ్..! హైదరాబాద్ మియాపూర్‌లో చిరుత సంచారం కలకలం..! వైరల్‌గా మారిన వీడియోలు..

ఆ చిరుత ఎప్పుడు ఎవరిపై దాడి చేస్తుందో అని స్థానికులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు.

బాబోయ్..! హైదరాబాద్ మియాపూర్‌లో చిరుత సంచారం కలకలం..! వైరల్‌గా మారిన వీడియోలు..

Updated On : October 19, 2024 / 2:02 AM IST

Leopard : హైదరాబాద్ మియాపూర్ లో చిరుత సంచారం కలకలం రేపింది. మియాపూర్ మెట్రో స్టేషన్ వెనుక చిరుత తిరుగుతోందని స్థానికులు అంటున్నారు. చిరుత సంచారం గురించి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు చిరుత ఆచూకీ కోసం గాలిస్తున్నారు. కొందరు స్థానికులు చిరుత సంచారానికి సంబంధించిన వీడియోలను పోలీసులకు ఇచ్చారు. దీంతో చుట్టుపక్కల కాలనీ వాసులు భయాందోళనలో ఉన్నారు. ఆ వీడియోలో ఓ జంతువు తిరుగుతూ ఉంది.

అయితే, అది చిరుతే అని కొందరు స్థానికులు భయాందోళన చెందుతున్నారు. ఆ చిరుత ఎప్పుడు ఎవరిపై దాడి చేస్తుందో అని కంగారుపడుతున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు చిరుత కోసం ముమ్మరంగా వెతుకుతున్నారు. అసలు ఆ వీడియోలో కనిపించింది చిరుతేనా? లేక మరొకటా? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉందని పోలీసులు అంటున్నారు. కాగా, ఎవరూ అనవసరంగా భయాందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

మియాపూర్ మెట్రో రైలు స్టేషన్ సమీపంలో కనిపించినట్లుగా చెబుతున్న చిరుతపులి జాడ కోసం అటవీ శాఖ అధికారులు రంగంలోకి దిగారు. శుక్రవారం రాత్రి అత్యవసరంగా పోలీసుల సాయంతో చిరుత కోసం వెతకడం ప్రారంభించారు. సమీప ప్రాంతాల్లో నివసించే ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అప్రమత్తం చేశారు. చిరుతపులి సంచారానికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియోలోని జంతువు రూపాన్ని బట్టి అది చిరుతపులే అని అటవీ అధికారులు అంటున్నారు. అయితే, ఇప్పటికిప్పుడు ఓ నిర్ధారణకు వచ్చేయలేమని అంటున్నారు.

చిల్కూరు పరిధిలోని తమ సిబ్బంది పోలీసు అధికారులతో కలిసి జంతువు కోసం వెతకడానికి సంఘటనా స్థలానికి చేరుకున్నట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. సమీపంలోని కొన్ని గుబురు ప్రాంతాల నుండి చిరుత మెట్రో స్టేషన్ సమీపంలోకి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఆ జంతువు కాలి గుర్తుల కోసం వెతుకుతున్నట్లు సీనియర్ అటవీ అధికారి తెలిపారు.

అర్థరాత్రి వరకు జంతువు కోసం అన్వేషణ కొనసాగుతుంది. చిరుతపులి నగరంలోకి రావడం ఇదే మొదటిసారి కాదని, గత కొన్నేళ్లుగా ఇలాంటి సంఘటనలు అనేకం నమోదయ్యాయని, అటవీ ప్రాంతం తగ్గిపోతుండటంతో అడవుల్లో ఉండాల్సిన క్రూర మృగాలు ఇలా జనావాసాల్లోకి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

Also Read : దావూద్‌కి, లారెన్స్ బిష్ణోయ్‌కి పోలికలు ఏంటి? బాలీవుడ్‌ను ఎందుకు లక్ష్యంగా చేసుకున్నాడు?