లాక్ డౌన్ : మోడీకి సీఎం కేసీఆర్ ఏం చెప్పారు

  • Publish Date - April 11, 2020 / 09:20 AM IST

లాక్ డౌన్ ను మరో రెండు వారాలు కొనసాగించాలని భారత ప్రధాన మంత్రి మోడీని..తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు. రైతులు, అనుబంధ రంగాలకు లాక్ డౌన్ లో సడలింపు ఇవ్వాలన్నారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని..కేంద్రం ఆదుకోవాలని, కరోనా వైరస్ నియంత్రణలో రాష్ట్రాలకు స్వేచ్చ ఇవ్వాలన్నారు. మరోవైపు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ భేటీ కూడా జరుగబోతోంది. కరోనా కట్టడికి భవిష్యత్ ప్రణాళికపై భేటీలో ప్రధానంగా చర్చించబోతున్నారు. అదేవిధంగా ఆర్థిక పరిస్థితి, సంక్షేమ పథకాలపై కూడా సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉంది. 

2020, ఏప్రిల్ 11వ తేదీ శనివారం ఉదయం 11 గంటలకు ప్రధాన మంత్రి మోడీ వీడియో కాన్పరెన్స్ నిర్వహించారు. ఇందులో రాష్ట్ర ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ పరిస్థితిపై సీఎం కేసీఆర్ వివరించారు. ఏప్రిల్ 14వ తేదీ వరకు లాక్ డౌన్ గడువు ముగుస్తున్నా..ప్రస్తుత పరిస్థితుల్లో ఇది కొనసాగించాలని సూచించారు. దీనివల్ల పరిస్థితి పూర్తిగా అదుపులోకి వస్తుందన్నారు.

లాక్ డౌన్ అర్థాంతరంగా ఎత్తివేయడం వల్ల కరోనా వైరస్ విజృంభించే అవకాశం ఉందని, ఇన్ని రోజుల పడిన శ్రమ విఫలవుతుందని వెల్లడించినట్లు తెలుస్తోంది. అలాగే..రాష్ట్రంలో పరిశ్రమలు, ఇతర వాణిజ్య సంస్థలు మూసివేయడం వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారిందని ప్రధాన మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున్న సహాయం చేయాలని కోరినట్లు సమాచారం. లాక్ డౌన్ కొనసాగించాలని ఇటీవలే సీఎం కేసీఆర్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈయన బాటలోనే మరికొన్ని రాష్ట్రాలు వెళుతున్నాయి. ఇప్పటికే..కొన్ని రాష్ట్రాలు ఏప్రిల్ 30వ తేదీ వరకు పొడిగించారు. 

ఇదిలా ఉంటే…2020, ఏప్రిల్ 11వ తేదీ శనివారం జరిగే కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. కరోనాపైనే ప్రధానంగా కేబినెట్ చర్చించనుంది. రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై మంత్రివర్గం చర్చించనుంది. కరోనా కట్టడికి  ఇప్పటి వరకు తీసుకుంటున్న చర్యలు.. మునుముందు తీసుకోవాల్సిన చర్యలనూ ఇందులో చర్చించనున్నారు. అంతేకాదు..

లాక్డౌన్ పొడిగింపుపైనా నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటికే కేసీఆర్ లాక్డౌన్ పొడిగించాలని అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే కేంద్రానికి కూడా తన అభిప్రాయాన్ని తెలిపారు. లాక్డౌన్ను కొనసాగిస్తేనే మంచిదని ఆయన సూచిస్తున్నారు. నేటి మంత్రిమండలిలోనూ లాక్డౌన్పై చర్చించనున్నారు. లాక్డౌన్ పొడిగిస్తూ నిర్ణయం తీసుకునే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి