Sangareddy Murder : అప్పు తీర్చమంటే హతమార్చారు..స్నేహితులే కిడ్నాప్ చేసి చంపేశారు

హైదరాబాద్ లో అదృశ్యమైన వ్యాపారవేత్త మధుసూదన్‌రెడ్డి కేసు మిస్టరీ వీడింది. అతని స్నేహితులే కిడ్నాప్ చేసి సంగారెడ్డిలో హతమార్చారు. ఆపదలో ఆదుకున్న స్నేహితుడినే దారుణంగా చంపేశారు.

Sangareddy

Madhusudan Reddy murder : హైదరాబాద్‌లో కిడ్నాప్.. సంగారెడ్డిలో మర్డర్. ఇచ్చిన అప్పు అడిగాడని.. అందరూ కలిసి హతమార్చారు. పాతబస్తీలో అదృశ్యమైన వ్యాపారవేత్త మధుసూదన్‌రెడ్డి కేసు మిస్టరీ వీడింది. అతని స్నేహితులే కిడ్నాప్ చేసి హతమార్చినట్లు పోలీసులు నిర్ధారించారు. ఆపదలో ఆదుకున్న స్నేహితుడినే దారుణంగా హతమార్చారు కిరాతకులు.

సంగారెడ్డిలో హైదరాబాద్‌కు చెందిన వ్యాపారి మధుసూదన్ రెడ్డి హత్య సంచలనంగా మారింది. ఈ నెల 19న మధుసూదన్‌రెడ్డిని ఆయన స్నేహితులు కిడ్నాప్‌ చేశారు. అనంతరం హత్య చేసి… మృతదేహాన్ని కోహిర్ మండలం దిగ్వాల్‌ శివారులో పాతిపెట్టారు. పోలీసుల విచారణలో అతడ్ని స్నేహితులే హత్య చేసినట్లు తేలింది.

కర్మన్‌ఘాట్‌కు చెందిన మధుసూదన్‌రెడ్డి చార్మినార్‌లో వ్యాపారం చేస్తున్నాడు. మధుసూదన్‌రెడ్డిపై దొంగతనాలు, మర్డర్‌ కేసులున్నాయి. గతంలో ఓ హత్య కేసులో జైలుకు వెళ్లి వచ్చాడు. జైల్లో ఉన్నప్పుడే కర్నాటకకు చెందిన సంజీవ్‌తో పరిచయమైంది. జైలు నుంచి విడుదలయ్యాక ఇద్దరూ కలిసి హైదరాబాద్‌లో వ్యాపారం మొదలుపెట్టారు. ఈ క్రమంలో మధుసూదన్‌రెడ్డి.. వ్యాపారంలో భాగంగా సంజీవ్‌కు 40 లక్షల రూపాయల వరకు అప్పుగా ఇచ్చాడు‌.

అయితే తీసుకున్న డబ్బు ఎంతకీ తీర్చకపోవడంతో సంజీవ్‌పై ఒత్తిడి తెచ్చాడు మధుసూదన్‌రెడ్డి. డబ్బు ఇచ్చే ఉద్దేశ్యం లేని సంజీవ్‌… మధుసూదన్‌ను ఎలాగైన హత్య చేయాలని ప్లాన్‌ చేశాడు. డబ్బు తిరిగిచ్చేస్తానంటూ ఫోన్‌కాల్‌ చేసి పిలిచాడు. దీంతో ఇంటికి వెళ్లిన మధుసూదన్‌రెడ్డిని… సంజీవ్‌, గిరీష్‌, జగన్నాథ్‌ కలిసి కిడ్నాప్‌ చేశారు. సంగారెడ్డి జిల్లాలోని దిగ్వాల్‌ దగ్గరున్న ఫాంహౌస్‌కు తీసుకెళ్లి హత్య చేశారు. అక్కడే శవాన్ని పాతిపెట్టి ఆనవాళ్లు కనిపించకుండా చేసేలా ప్రయత్నించారు.

హత్య చేశాక.. మధుసూదన్‌రెడ్డి కుటుంబ సభ్యులకు జగన్నాథ్‌ కాల్‌ చేసి… కిడ్నాప్‌ చేశామని చెప్పాడు. ఈ విషయం పోలీసులకు చేరడంతో ఫోన్‌కాల్‌ డేటా ఆధారంగా జగన్నాథ్‌ను అరెస్ట్‌ చేశారు. విచారణలో మధుసూదన్‌రెడ్డిని హత్య చేసినట్లు నిందితుడు నేరం అంగీకరించాడని పోలీసులు తెలిపారు.

మృతుడి కుటుంబ సభ్యుల్ని ఘటనా స్థలానికి తీసుకెళ్లిన పోలీసులు.. ఆయన శవాన్ని బయటికి తీశారు. నిందితులు ముంబై హైవే వైపు వెళ్లినట్లు పోలీసులు భావిస్తున్నారు. మధుసూదన్‌రెడ్డి ఎలా చంపారు..? ఈ హత్యలో ఇంకా ఎవరెవరు ఉన్నారు? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.