deekshith kidnapper: మహబూబాబాద్ లో తొమ్మిదేళ్ల బాలుడు దీక్షిత్ కిడ్నాప్ కథ సుఖాంతం అయ్యింది. అతడిని క్షేమంగా ఇంటికి తీసుకొచ్చారు పోలీసులు. ప్రధాన సూత్రధారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 2020, అక్టోబర్ 22వ తేదీ తెల్లవారుజామున 3 గంటలకు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
నిందితుల్లో బాలుడి తండ్రి అత్యంత సన్నిహితడు ఉన్నట్లు సమాచారం. ఉదయం 11 గంటలకు ఎస్పీ కోటిరెడ్డి మీడియా సమావేశంలో కిడ్నాప్ కు సంబంధించిన వివరాలను వెల్లడించనున్నారు.
2020, అక్టోబర్ 19వ తేదీ సోమవారం మధ్యాహ్నం కిడ్నాప్ చేశారు దుండగులు. స్థానిక కృష్ణ కాలనీలో నివాసం ఉంటూ.. ఓ ప్రముఖ టీవీ చానల్ వీడియో జర్నలిస్టుగా పని చేస్తున్న రంజిత్, వసంత దంపతుల పెద్ద కుమారుడు దీక్షిత్ రెడ్డి ఇంటి ముందు ఆడుకుంటుండగా దుండగులు కిడ్నాప్ చేశారు.
బైక్ పై వచ్చిన గుర్తు తెలియని దుండగులు బాలుడిని తీసుకుపోయారని స్థానికులు తెలిపారు. రాత్రి 9:45 నిమిషాలకు కిడ్నాపర్లు బాలుడి తల్లికి ఫోన్ చేశారు. రూ.45 లక్షలు ఇస్తే బాలుడిని విడిచిపెడతామన్నారు. ఈ విషయాన్ని ఎవరికి చెప్పొద్దని హెచ్చరించారు. పోలీసులకు ఫిర్యాదు చేయవద్దన్నారు. బాలుడి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు స్వీకరించిన జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు.
కానీ దుండగులు తెలివివగా వ్యవహరించారు. ఇంటర్నెట్ ద్వారా కాల్ చేస్తూ..దొరకకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. కొడుకు ఎలా ఉన్నాడోనని తల్లిదండ్రులు తల్లిడిల్లిపోయారు. అయితే..ఇక్కడ బాలుడు తండ్రి రంజిత్ రెడ్డి బాబాయ్ కొడుకు మనోజ్ పై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేశారు. చీటీల డబ్బు వసూలు కోసం మనోజ్ ను రంజిత్ రెడ్డి పనిలో పెట్టుకున్నాడు.
కిడ్నాపైన రోజు మనోజ్ బైక్ పై వెళ్లాడని దీక్షిత్ స్నేహితులు చెబుతున్నారు. బాలుడి ఆచూకీ కోసం 8 ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. మనోజ్ ను అదుపులోకి తీసుకున్న తర్వాత..ఫోన్ కాల్స్ బంద్ అయ్యాయి. దీంతో మనోజ్ పైనే పోలీసులు అనుమానాలు వ్యక్తం చేశారు.
ఇద్దరు డీఎస్పీలు, 8 మంది సీఐలు, 15 మంది ఎస్ ఐ ల నేతృత్వంలో సెర్చింగ్ నిర్వహించారు. చివరకు దీక్షిత్ ను క్షేమంగా తల్లిదండ్రులకు అప్పచెప్పడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.