Congress: సీఎం ఇలాఖాలో బీసీ నేతల అలక.. ఎందుకు? డిమాండ్ ఏంటి?
బీఆర్ఎస్ హయాంలో వివిధ వర్గాలకు దక్కిన ప్రాధాన్యాన్ని గుర్తు చేస్తుండటం.. కాంగ్రెస్ పెద్దలను ఇరకాటంలో పడేలా చేస్తోందని తెలుస్తోంది.

సీఎం రేవంత్ సొంత జిల్లాలో.. కాంగ్రెస్ బీసీ నేతలు అలకపాన్పు ఎక్కారా అంటే.. అవును అనే సమాధానమే వినిపిస్తోంది. పదువుల పంపకాల్లో తగిన ప్రాధాన్యం దక్కడం లేదని.. సొంత సర్కార్ మీద గుర్రుగా ఉన్నారట. నామినేటెడ్ పదవులన్నీ.. ఒకే సామాజికవర్గానికి కట్టబెడుతున్నారని.. తమను కనీసం లెక్కలోకి తీసుకోవడం లేదని బీసీ నేతలు వాపోతున్నారనే గుసగుస స్టార్ట్ అయింది. పైగా బీఆర్ఎస్ సర్కార్ లెక్కలు తీస్తున్నారట. ఇది మరింత హైలైట్ అవుతోంది. అసలు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఏం జరుగుతోంది. బీసీ నేతల ప్రస్తుత డిమాండ్ ఏంటి?
నామినేటెడ్ పదవుల విషయంలో.. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోంది. పోస్టుల కేటాయింపుల్లో.. సామాజిక సమీకరణాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తున్నాయ్. కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావడానికి అన్ని వర్గాలు కలిసి పనిచేసినా… ప్రభుత్వ ఏర్పాటు తర్వాత ఒక సామాజికవర్గానికి మాత్రమే ప్రాధాన్యం ఇస్తున్నారన్న చర్చ జరుగుతోంది.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో మెజార్టీ నియోజకవర్గాల్లో బీసీ ఓటర్లు ఎక్కువగా ఉన్నారని.. పార్టీ అధిక స్థానాలను గెలవడానికి కారణం ఒకరకంగా వాళ్లే అని.. అయినా సరే తమను పట్టించుకోవడం లేదని బీసీ నేతలు వాపోతున్నారట. ఇక్కడితో ఆగారా అంటే.. గత ప్రభుత్వంలో ఏయే వర్గాలకు ఎలాంటి ప్రాధాన్యం దక్కిందో లెక్కలు చెప్తూ మరి నిలదీస్తున్నారని టాక్. బీఆర్ఎస్ హయాంలో ఎక్కువగా బీసీ లకే జిల్లాలో పెద్దపీట వేసిన విషయాన్ని కాంగ్రెస్ నేతలు గుర్తు చేస్తున్నారట.
కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరిన తర్వాత.. జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు.. నామినేటెడ్ పదవులు పొందిన వారిలో రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారిదే హవా కావడంతో.. బీసీ సామాజికవర్గ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది. ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి… ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా మాజీ మంత్రి చిన్నారెడ్డికి అవకాశం దక్కింది.
ఇక స్పోర్ట్స్ అథారిటి చైర్మన్‌గా వనపర్తికే చెందిన శివసేనా రెడ్డికి కట్టబెట్టారు. పోలీస్ హౌసింగ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని.. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డికి అప్పగించారు. మాజీ ఎంపీ జితేందర్ రెడ్డికి ఢిల్లీలో ప్రభుత్వ సలహాదారు పదవి దక్కింది. వీటితోపాటు జిల్లా స్థాయిలో పలు కీలక నామినేటెడ్ పదవులను కూడా రెడ్డి వర్గానికే కట్టబెట్టారని కాంగ్రెస్‌లోని బీసీ నేతలు గుర్తు చేస్తున్నారు.
మెజార్టీ ఓటర్లు బీసీలే?
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. అందులో రెండు రిజర్వ్‌డ్. మిగిలిన 12నియోజకవర్గాల్లో బీసీలు ఎమ్మెల్యేలు ఇద్దరు మాత్రమే. 10 స్థానాల్లో ఓసీ సామాజికవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలే ఉన్నారని.. ఐతే ఆ నియోజకవర్గాల్లో మెజార్టీ ఓటర్లు బీసీలే అని కొందరు నేతలు చెప్పుకొస్తున్నారు. రెండు లోక్‌సభ స్థానాలను, ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ రెడ్డి సామాజికవర్గాలకే టికెట్ కేటాయించిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు.
దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే సీతా దయాకర్‌రెడ్డికి… మహిళా, శిశు సంక్షేమ కమిషన్ ఛైర్‌పర్సన్ పదవి ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఇంకో పదవిని కూడా.. మళ్లీ అదే సామాజికవర్గానికే సీఎం రేవంత్ కట్టబెడతారా అంటూ బీసీ నేతలు వాపోతున్నారట. పార్టీకోసం పనిచేసిన బడుగు బలహీన వర్గాలకు చెందిన వారు ఎంతో మంది ఉండగా.. అగ్రవర్ణాల వారినే నామినేటెడ్ పదవులు వెతుక్కుంటూ రావడం ఏంటని పార్టీ అంతర్గత సమావేశాల్లో ప్రశ్నిస్తున్నారని తెలుస్తోంది.
జిల్లా నుంచి మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరికి బీసీ కోటాలో మంత్రి పదవి ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. ఐతే దీనిపై కూడా బీసీ లీడర్లు పెదవి విరుస్తున్నారు. ఆయన ఒక్కడికి మంత్రి పదవి ఇస్తే ఉమ్మడి పాలమూరు జిల్లాలోని బీసీలందరికీ న్యాయం చేసినట్టేనా అని ప్రశ్నిస్తున్నారు. ఆయనతో పాటు జిల్లా స్థాయి నామినేటెడ్ పదవుల్ని… మిగతా నేతలకు ఇచ్చినప్పుడే న్యాయం జరుగుతుందని అంటున్నారు. జిల్లాలో జనాభా శాతానికి తగ్గట్లు… పదవుల్లో న్యాయమైన వాటా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
బీఆర్ఎస్ హయాంలో వివిధ వర్గాలకు దక్కిన ప్రాధాన్యాన్ని గుర్తు చేస్తుండటం.. కాంగ్రెస్ పెద్దలను ఇరకాటంలో పడేలా చేస్తోందని తెలుస్తోంది. ఇప్పటికైనా తమను గుర్తించి నామినేటెడ్ పదవుల్లో తగిన ప్రాధాన్యం కల్పించాలని.. మహబూబ్‌నగర్ బీసీ వర్గం ఆశావాహులు విన్నపాలు వినిపిస్తున్నారట. మరి వారి డిమాండ్‌ను రేవంత్ సర్కార్ ఏ మేరకు పరిగణలోకి తీసుకుంటుందన్నది హాట్‌టాపిక్‌గా మారింది.