మల్కాజిగిరి ఏసీపీ, ఏసీబీ విచారణ, రూ. 100 కోట్లు, ఇంకెన్ని ఆస్తులున్నాయో

Malkajgiri ACP, ACB, Rs. 100 crore : మల్కాజిగిరి ఏసీపీ నరసింహారెడ్డి కేసులో ఏసీబీ దర్యాప్తు కొనసాగుతోంది. నాలుగు రోజుల కస్టడీలో భాగంగా 2020, అక్టోబర్ 08వ తేదీ గురువారం నాంపల్లిలోని ఏసీబీ కార్యాలయంలో నరసింహారెడ్డిని అధికారులు విచారించనున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన కేసులో.. నరసింహారెడ్డి ఆస్తులపై ఆరా తీయనున్నారు. ఇప్పటికే పెద్ద మొత్తంలో ఆస్తులను గుర్తించిన అధికారులు.. ఇంకా ఎక్కడెక్కడ ఆస్తులు కూడబెట్టారనే వివరాలను సేకరిస్తున్నారు.
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో చిక్కిన నరసింహారెడ్డిని ఏసీబీ ప్రశ్నిస్తోంది. మూడో రోజు కస్టడీలో భాగంగా నర్సింహారెడ్డి అక్రమాలు, బిజినెస్‌లు, బినామీలపై ఏసీబీ ఆరా తీసింది. పెద్ద అంబర్‌పేటలో ఓ హోటల్‌ను ఆయన బినామీల పేరుతో నిర్వహిస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు. ఇంకా ఎక్కడెక్కడ ఆస్తులు కూడబెట్టారనే వివరాలను సేకరించేందుకు ప్రయత్నిస్తున్నారు.
కొందరు పోలీసులతో కలిసి నర్సింహారెడ్డి భూములు కాజేసేందుకు ప్రయత్నించినట్లుగా తెలుస్తోంది. అలాగే బినామీలతో రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేసినట్లు ఏసీబీ గుర్తించింది. ఇప్పటికే అనంతపురంలో 55 ఎకరాల పొలం, మాదాపూర్‌లోని సర్వే నెంబర్ 64లో 1 వేయి 960 గజాల స్థలంతో పాటు పలు చోట్ల ఇళ్లు, స్థలాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దర్యాప్తులో నర్సింహారెడ్డి తన బినామీ ఆస్తుల గురించి నోరు విప్పకపోవడంతో ఆధారాలను అతని ముందుంచి ప్రశ్నించారు ఏసీబీ అధికారులు.
ఏసీబీ అధికారుల బృందాలుగా విడిపోయిన హైదరాబాదులోని మహేంద్రహిల్స్ లోని ఏసీపీ నివాసంలోనే కాకుండా ఇతర ప్రాంతాల్లో కూడా సోదాలు నిర్వహించారు. వరంగల్, జనగామ, నల్లగొండ, కరీంనగర్ జిల్లాల్లో, ఏపీలోని అనంతపురంలో సోదాలు జరిగాయి. తెలంగాణ, ఏపీల్లోనే 25 ప్రాంతాల్లో ఏక కాలంలో సోదాలు జరిపారు. సోదాల్లో నర్సింహారెడ్డికి ఉన్న ఆస్తులను గుర్తించారు.
3 ఇళ్లు, 5 ఓపెన్ ప్లాట్లు, వాణిజ్య స్థలాలతో పాటు రూ. 5 కోట్ల విలువైన ఆస్తులు, బంగారు, వెండి ఆభరణాలు, నగదు ఉన్నట్లు తేలింది. ప్రభుత్వ లెక్కల ప్రకారం అతని అస్తుల విలువల రూ.7.5 కోట్లు కాగా, మార్కెట్ విలువ ప్రకారం రూ.100 కోట్లు ఉంటుందని అంచనా వేశారు.
నర్సింహారెడ్డిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేశారు ఆయనకు రెండు బ్యాంక్ లాకర్లు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. నర్సింహారెడ్డి గతంలో మియాపూర్, ఉప్పల్, బేగంపేట ఇన్ స్పెక్టర్ గా, చిక్కడపల్లి డివిజన్ లో ఏసీపీగా పని చేశారు అక్కడి నుంచి మల్కాజిగిరికి బదిలీ అయ్యారు.