Mohan Babu : కొట్టడం తప్పే..! మరో ఆడియో రిలీజ్ చేసిన మోహన్ బాబు, కీలక వ్యాఖ్యలు..
నేను చేసింది న్యాయమా, అన్యాయమా ప్రజలు ఆలోచించాలి. నా ఇంటి తలుపులు బద్దలు కొట్టుకొని రావడం న్యాయమా?'' అని ప్రశ్నించారు మోహన్ బాబు.

Mohan Babu
Mohan Babu : మీడియా ప్రతినిధిపై దాడి ఘటనపై మంచు మోహన్ బాబు కీలక ప్రకటన చేశారు. 11 నిమిషాల నిడివితో ఆడియో ఫైల్ ను విడుదల చేశారాయన. కుటుంబ సమస్యల్లో ఎవరైనా జోక్యం చేసుకోవచ్చా? అని మోహన్ బాబు ప్రశ్నించారు. ప్రజలు, రాజకీయ నాయకులు ఆలోచించాలి అని మోహన్ బాబు అన్నారు.
”నాలుగు రోజుల నుంచి నా ఇంటి ముందు మీడియా ఉండటం ఎంత వరకు సమంజసం? నా పిల్లలతో ఉన్న సమస్యను నేనే పరిష్కరించుకుంటానని మీడియాకు చెప్పా. నాపై కల్పిత కథలకు నేనేమీ బాధపడటం లేదు. నా ఇంట్లోకి దూసుకొచ్చే వాళ్లు మీడియా వాళ్లా? ఇంకా ఎవరైనా ఉన్నారో నాకు తెలియదు. మీడియాను అడ్డుపెట్టుకొని నాపై దాడి చేసే అవకాశం ఉందని ఆలోచించా. నేను మీడియాను కొట్టాలనేది దైవసాక్షిగా నేను ఆలోచించలేదు.
చీకట్లో ఘర్షణ జరిగింది. నేను కొట్టిన దెబ్బ అతనికి తగిలింది. మీడియా ప్రతినిధికి తగిలిన దెబ్బకు నేను బాధపడుతున్నా. ఆ మీడియా ప్రతినిధి నాకు తమ్ముడి లాంటివాడు. మీడియా ప్రతినిధి భార్యాబిడ్డల గురించి ఆలోచించాను. నా బాధ గురించి ఎవరూ ఆలోచించలేదు.
నేను సినిమాల్లో నటిస్తాను తప్ప నిజ జీవితంలో నటించాల్సిన అవసరం నాకు లేదు. నాకున్న ఒకటే ధైర్యం, సాహసం నీతిగా, ధర్మంగా బతకాలన్నదే నా ఆలోచన. గేటు బయట అసభ్యకరంగా ప్రవర్తించి కొట్టి ఉంటే నాపై 50 కేసులు పెట్టుకోవచ్చు, నన్ను అరెస్టు చేసుకోవచ్చు. నేనే పోలీస్ స్టేషన్ కు వెళ్లి అరెస్ట్ అయ్యే వాడిని. నా ఇంట్లోకి వచ్చి నా ఏకాగ్రతను, ప్రశాంతతను భగ్నం చేశారు. నా బిడ్డే నా ప్రశాంతతను చెడగొడుతున్నాడు. నా బిడ్డతో ఏదో ఒకరోజు న్యాయం జరుగుతుంది. మేం కూర్చొని మాట్లాడుకుంటాం. కుటుంబసభ్యుల గొడవకు మధ్యవర్తులు అవసరం లేదు.
నేను ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాను, అవన్నీ మరిచిపోయి నేను కొట్టిన విషయం ప్రస్తావిస్తున్నారు. నేను కొట్టిన విషయం తప్పే. కానీ ఏ సందర్భంలో కొట్టానో ఆలోచించాలి. మీకు టీవీలు ఉండొచ్చు. నేను కూడా రేపు టీవీ పెట్టొచ్చు. నేను మీడియా ప్రతినిధిని కొట్టినందుకు చింతిస్తున్నాను. నేను కొట్టింది వాస్తవమే, అసత్యం కాదు. నా విషయంలో మీడియా చూపిస్తుంది తప్పని ఎవరూ అడగటం లేదు. పైన భగవంతుడు చూస్తున్నాడు. పోలీసులంటే నాకు ఇష్టం. నా విద్యాలయం నుంచి ఎంతో మంది ఐఏఎస్ లు, ఐపీఎస్ లు అయ్యారు. నేను చేసింది న్యాయమా, అన్యాయమా ప్రజలు ఆలోచించాలి. నా ఇంటి తలుపులు బద్దలు కొట్టుకొని రావడం న్యాయమా?” అని ప్రశ్నించారు మోహన్ బాబు.
Also Read : పెదరాయుడి ఇంట్లో ఏం జరుగుతోంది? మోహన్ బాబు, మనోజ్ మధ్య అసలు వివాదం ఏమిటి?