పీటలమీద ఆగిన పెళ్లి- పెళ్ళికి వచ్చిన మరో యువతిని పెళ్లాడిన వరుడు

marriage cancel due to bride, groom married to a young woman who came for the cermony : కొద్ది సేపట్లో వధువు మెడలో వరుడు తాళి కట్ట బోతున్నాడు, వేద పండితులు మంత్రాలు చదువుతున్నారు. సినీ ఫక్కీలో క్లైమాక్స్ లో లాగా పోలీసులు వచ్చి ఆపండి పెళ్లి అన్నారు. అంతే పెళ్లి ఆగిపోయింది. వధువు పీటల మీదనుంచి లేచి ఇవతలకు వచ్చింది. ఇష్టంలేని పెళ్లి చేస్తున్నారని వధువే పోలీసులకు ఫోన్ చేసి ఆఖరి నిమిషంలో తాళి కట్టించుకోకుండా పీటలమీదనుంచి లేచి వెళ్లి పోయింది. కానీ .. అదే పెళ్లిక హజరైన మరోక యువతి వరుడి చేత మెడలో తాళి కట్టించుకోవటం ఇప్పుడు మహబూబాబాద్ జిల్లాలో చర్చనీయాంశం అయ్యింది.
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం గుండెపుడికి చెందిన యామిని కృష్ణమూర్తి, రంగమ్మ దంపతుల కుమారుడు యామిని రాజేశ్‌కు, కురవి మండలం కాంపెల్లికి చెందిన యువతికి పెద్దల సమక్షంలో వివాహం నిర్ణయించారు. గురువారం మధ్యాహ్నం గం.11-55 నిమిషాలకు సుముహూర్తం నిర్ణయించారు. గురువారం ఉదయం పెళ్లి ప్రారంభం అయ్యింది.
వరుడు కళ్యాణ వేదికలో పీటలమీద కూర్చున్నాడు. వధువు వచ్చి వరుడి పక్కన కూర్చుంది. కానీ ఆమె మనసు మనసు లో లేదు. అలజడిగా ఉంది. పెళ్లి మండపం నుంచే నేరుగా పోలీసులకు ఫోన్ చేసింది. తాను మరో యువకుడిని ప్రేమించానని, తల్లిదండ్రులకు తనకు బలవంతంగా పెళ్లి చేస్తున్నారని ఫిర్యాదు చేసింది. వెంటనే వచ్చి పెళ్లి నిలుపుదల చేయాలని కోరింది. వేద పండితులు మంత్రాలు పఠిస్తుండగా సుమూహూర్తం సమయానికి పోలీసులు ఎంటరై పెళ్ళి ఆపారు.
పెళ్లి కూతురు ఫిర్యాదు మేరకు మరిపెడ సీఐ సాగర్, ఎస్సై అశోక్, పెళ్లి మండపం వద్దకు వచ్చి పెళ్ళి ఆపారు. ముందుగా పెళ్లి కూతురుకి కౌన్సెలింగ్ ఇచ్చారు. అయినా ఆమె మనసు మారలేదు. తాను ప్రేమించిన వాడినే పెళ్లి చేసుకుంటానని భీష్మించుకు కూర్చుంది. చేసేదేమి లేక మరోసారి కౌన్సెలింగ్ కోసం ఆమెను సఖీ కేంద్రానికి తరలించారు. చివరికి పెళ్లి ఆగిపోయింది.
పీటలపై పెళ్లి ఆగిపోవటంతో వరుడి తరుపు వారు, ఇతర బంధువులు అవమానంగా ఫీలయ్యారు. ఇదే సందర్భంలో వరుడి తరుఫున వచ్చిన బంధువుల అమ్మాయి వరుడిని పెళ్లి చేసుకోటానికి సిధ్దపడటంతో వరుడు ఆ యువతి మెడలో తాళి కట్టాడు. పెళ్లి ఆగిపోవటం… అనుకున్న యువతితో కాకుండా వేరే యువతి మెడలో తాళి కట్టటం ప్రస్తుతం ఈ ప్రాంతంలో చర్చనీయాంశం అయ్యింది.