ఎదురుగా కొడుకు శవం..కోడలి దుస్థితి..అర్ధరాత్రి అడవిలో ఆగిపోయిన అంబులెన్స్..

  • Published By: nagamani ,Published On : August 5, 2020 / 04:51 PM IST
ఎదురుగా కొడుకు శవం..కోడలి దుస్థితి..అర్ధరాత్రి అడవిలో ఆగిపోయిన అంబులెన్స్..

అర్థరాత్రి..అటవీ ప్రాంతం..కన్ను పొడుచుకున్నా ఏమీ కనిపించి దుస్థితి. ఎటుచూసిన చీకటే..చెట్లు జుట్టు విరబోసుకున్న దెయ్యాల్లా కనిపించి భయపెడుతున్న సమయంలో కరోనా మృతదేహంతో వెళ్తున్న ఓ అంబులెన్స్ అడవి మధ్యలో ఆగిపోయింది. చుట్టూ జన సంచారం పెద్దగా లేదు. కరోనా మృతదేహంతో పాటు ఇద్దరు మహిళలు బిక్కుబిక్కుంటూ 4 గంటల పాటు నరకయాతన అనుభవించారు. గుండెలు అరిచేతిలో పెట్టుకుని దయనీయమైన స్థితిలో దుఃఖాన్ని దిగమింగుకుని ఆ ఆదివాసీ మహిళలు సహయం కోసం ప్రయత్నం చేశారు.



ఓ వైపు కొడుకు మరణం, మరోవైపు భర్త కోసం గుండెల్లో గూడుకట్టుకున్న వేదనతో తల్లిడిల్లిపోతున్న కోడలి పరిస్థితి చూసి ఆ తల్లి తట్టుకోలేకపోయింది. గుండెలవిసేలా ఏడుద్దామన్నా మాట పెగిలిబైటకురాని పరిస్థితి. అటుగా వెళ్లే వారు కూడా అంబులెన్స్ లో ఉన్నది కరోనా మృతదేహం అని తెలిసి సాయం చేసేందుకు ఎవ్వరూ ముందుకు రాలేదు.అలా అడగ్గా అడగ్గా..చివరకు ఓ వ్యక్తి సాయం చేయటంతో అదే రాత్రి అంత్యక్రియలు పూర్తి చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది.

కరకగూడెం మండలం అనంతారం గ్రామానికి చెందిన వ్యక్తి మణుగూరులో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. అతనికి కొన్ని రోజుల క్రితం జ్వరం రావటంతో అనుమానం వచ్చి భద్రాచలం ఏరియా హాస్పిటల్ లో పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్ అని తేలింది. వెంటనే హాస్పిటల్ లో చేరటం చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం మరణించాడు. అతని మృతదేహాన్ని అతని భార్య..తల్లి ప్రభుత్వ ఆస్పత్రి అంబులెన్స్‌లో తీసుకువస్తున్నారు. అప్పటికే అర్ధరాత్రి కావడంతో మణుగూరు క్రాస్‌రోడ్‌ వద్ద వాహనం ఆగిపోయింది. ఎంత ప్రయత్నించినా ముందుకు నడకపోవడంతో మరో వాహనం కోసం వెతికారు. అటుగా వెళ్లే వారిని సాయం చేయాలని మృతుడి భార్య, తల్లి వేడుకున్నారు. ఎంతోమందికి ఫోన్ చేశారు. అయినా ఎవరూ ముందుకు రాలేదు. కారణం కరోనా భయం. దాదాపు నాలుగు గంటల పాటు అడవిలోనే మృతదేహంతో ఉండిపోవాల్సి వచ్చింది.



బూర్గంపహడ్‌కు చెందిన నాని అనే యువకుడు సహాయంతో మృతదేహన్ని వారి గ్రామానికి తరలించేందుకు ముందుకు వచ్చి ట్రాలీ ఆటోను ఏర్పాటు చేశాడు. అంత భాదలో భర్తను కోల్పోయిన భార్య, కొడుకు కోల్పోయిన తల్లి మృతదేహన్ని అంబులెన్స్‌ నుంచి దించి ట్రాలీలోకి ఎక్కించిన దృశ్యం పలువురిని కంటతడి పెట్టించింది. ఆ యువకుడి సహాయంతో అంత్యక్రియలు పూర్తి చేశారు. ఆ రాత్రిని గుర్తు చేసుకొని ఇటువంటి దుస్థితి ఎవరికీ రాకూడదని కొడుకు పోగొట్టుకున్న తల్లి..భర్తను కోల్పోయిన భార్య గుండెలవిసేలా విలపిస్తున్నారు.