Minister Harish Rao: అలాంటి ప్రకటనలు మానుకో.. హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాస్‌రావుకు మంత్రి హరీష్‌రావు క్లాస్..
రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాస్ రావు కొద్దికాలంగా రాజకీయ ప్రకటనలు చేస్తూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. పలుసార్లు శ్రీనివాస్ రావు మాట్లాడుతూ..

Minister Harish Rao
Telangana Health Director Srinivasarao: తెలంగాణ వైద్యఆరోగ్య శాఖ డైరెక్టర్ గడల శ్రీనివాసరావును వైద్యఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు హెచ్చరించారు. ఇటీవలి కాలంలో గడల శ్రీనివాస్ కొత్తగూడెం నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో కొత్తగూడెంలో బీఆర్ఎస్ అభ్యర్థిని నేనే అంటూ, స్థానిక ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలుసైతం చేశారు. ఈ విషయాలను ప్రస్తావిస్తూ తాజాగా మంత్రి హరీష్‌రావు గడల శ్రీనివాస్‌రావుకు ఫోన్ చేసి క్లాస్ పీకినట్లు తెలిసింది. ఓ శాఖకు కీలక అధికారిగా ఉంటూ రాజకీయ ప్రకటనలు చేయడం మానుకోవాలని హెచ్చరించినట్లు సమాచారం.
రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాస్ రావు కొద్దికాలంగా రాజకీయ ప్రకటనలు చేస్తూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. పలుసార్లు శ్రీనివాస్ రావు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఆదేశిస్తే ప్రజలకోరిక మేరకు రానున్న రోజుల్లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించారు. రాబోయే ఎన్నికల్లో కొత్తగూడెం అసెంబ్లీ నుంచి పోటీచేస్తానని అన్నారు. రాజకీయాల్లోకి వచ్చినా కేవలం కొత్తగూడెం నియోజకవర్గం నుంచి మాత్రమే పోటీ చేస్తానని, ఇక్కడే పుట్టిన నేను ఈ గడ్డమీదే చనిపోతానని ఇటీవల గడల శ్రీనివాస్ రావు వ్యాఖ్యానించారు. మరోవైపు ప్రస్తుతం కొత్తగూడెం ఎమ్మెల్యేగా ఉన్న వనమాపైనా పలు వ్యాఖ్యలు చేశారు.
కొత్తగూడెం ఎమ్మెల్యేగా వనమా వెంకటేశ్వరరావు కొనసాగుతున్నారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా వనమా విజయం సాధించారు. ఆ తరువాత బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అయితే, ఇటీవల ఎన్నికల అఫిడవిట్‌లో వివరాలు తప్పుగా చూపినట్లు 2018లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేసి వనమాపై ఓడిపోయిన జలగం వెంకట్రావు కోర్టుకు వెళ్లాడు. ఇటీవల వనమా ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు తీర్పునిచ్చింది. హైకోర్టు తీర్పును వనమా సుప్రీంకోర్టులో సవాల్ చేయగా ఊరట లభించింది. అయితే, మరోసారి కొత్తగూడెం నియోజకవర్గం నుంచి వనమా బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు.
ఇటీవల సీఎం కేసీఆర్‌నుసైతం వనమా కలిశారు. ఈసందర్భంగా కొత్తగూడెం సీటుపై కేసీఆర్ తనకు హామీ ఇచ్చినట్లు, కొత్తగూడెం బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగేది నేనేఅంటూ వనమా చెప్పారు. ఇదిలాఉంటే.. గతంలో పలుమార్లు గడల శ్రీనివాస్ రావు రాజకీయపరంగా వ్యాఖ్యలు చేసినా పార్టీ అధిష్టానం పట్టించుకోలేదు. బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల కోసం మొదటి జాబితా ప్రకటించేందుకు సిద్ధమైన సమయంలో శ్రీనివాస్‌రావుకు మంత్రి హరీష్‌రావు ఫోన్ చేసి రాజకీయ ప్రకటనలు చేయడంపై క్లాస్ పీకడం చర్చనీయాంశంగా మారింది. దీంతో గడల శ్రీనివాస్‌రావు కొత్తగూడెం నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేయాలన్న ఆశలు అడియాశలైనట్లేనన్న చర్చ జరుగుతుంది.