హైదరాబాద్‌ను తాకిన దుబ్బాక ఉప ఎన్నిక వేడి, శాంతిభ‌ద్ర‌త‌ల అంశంపై రాజీప‌డం – కేటీఆర్

  • Publish Date - November 2, 2020 / 01:18 PM IST

Minister KTR Fires On BJP Leaders : దుబ్బాక ఉప ఎన్నిక వేడి హైదరాబాద్‌ను తాకింది. హైదరాబాద్‌ బీజేపీ ఆఫీస్‌ ముందు ఆ పార్టీ కార్యకర్త ఆత్మహత్యాయత్నం చేయడం రాజకీయంగా కలకలం రేపింది. ఈ అంశాన్ని అడ్డుపెట్టుకుని శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందని టీఆర్ఎస్‌ నేతలు ఎన్నికల సంఘానికి, డీజీపీకి ఫిర్యాదు చేశారు. దుబ్బాక ఉపఎన్నికలో గెలిచేందుకు బీజేపీ చిల్లర రాజకీయాలు చేస్తుందని మండిపడ్డారు TRS వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్.



ఓటర్లకు పంచుదామనుకున్న డబ్బును పోలీసులు పట్టుకోవడంతో కొత్త కుట్రకు తెరలేపిందని ఆరోపించారు. హైదరాబాద్‌లో శాంతిభద్రతల సమస్యలు సృష్టించి గెలుపొందేందుకు ప్రయత్నిస్తోందని కేటీఆర్ ఫైర్‌ అయ్యారు. లాఠీచార్జ్‌, గన్‌ ఫైరింగ్‌ జరిగే రేంజ్‌లో ఆందోళనకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ కూడా భారత ఎన్నికల కమీషన్‌తో పాటు రాష్ట్ర డీజీపీకి లేఖ రాసింది.



మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు..బీజేపీ పైన బాధ్యతారహితమైన ఆరోపణ చేశారంటూ ఈసీఐ, డీజీపీ దృష్టికి తీసుకెళ్లింది. బీజేపీ నాయకులు, కార్యకర్తలను బెదిరింపులకు గురిచేసే విధంగా మాట్లాడిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరింది. ఇక…మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావు మండిపడ్డారు. బీజేపీపై కేటీఆర్‌ తప్పుడు స్టేట్‌మెంట్‌ ఇచ్చారని..తమ పార్టీపై ఇలాంటి తప్పుడు సమాచారం ఎవరిచ్చారంటూ ఆయన ప్రశ్నించారు.



ప్రజాస్వామ్యంలో ధర్నాలు, ఆందోళన చేసే హక్కుందని..అవసరమైనప్పుడు దాన్ని తప్పకుండా వినియోగించుకుంటామని స్పష్టం చేశారు రామచంద్రరావు. ఓ వైపు టీఆర్ఎస్‌…మరోవైపు బీజేపీ..ఎన్నికల సంఘం, డీజీపీకి ఫిర్యాదులు చేయడంతో…పోలీసులు అప్రమత్తమయ్యారు. మొత్తంగా దుబ్బాక ఉప ఎన్నిక..పొలిటికల్‌ హీట్‌ను రాజేస్తుంది.
c