దమ్ముంటే.. చర్చకు రండి- కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి మంత్రి పొన్నం సవాల్
IASపై దాడి జరిగితే ఖండించకపోగా సమర్థించడం దారుణం.

Ponnam Prabhakar Slams Kishan Reddy (Photo Credit : Facebook)
Ponnam Prabhakar : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై నిప్పులు చెరిగారు మంత్రి పొన్నం ప్రభాకర్. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ డైరెక్షన్ మేరకు కిషన్ రెడ్డి మూసీ నిద్ర చేపట్టారని పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. కిషన్ రెడ్డి ముందు మీ మొద్దు నిద్ర వీడండి అని ఆయన అన్నారు. కేంద్రం నుండి ఒక్క రూపాయి తీసుకొచ్చే శక్తి లేదు మీకు అని ధ్వజమెత్తారు. మూసీ కాలువ వాసన చూసిన తర్వాత అయినా దైవ సాక్షిగా వాస్తవాలు చెప్పాలన్నారు.
”కిషన్ రెడ్డి.. మీరసలు తెలంగాణ బిడ్డేనా? DNA పరీక్ష చేసుకోండి.. తెలంగాణ బిల్లు ఎలా పాస్ అయిందో మీకు తెలియదా? కలెక్టర్ ను కొట్టిన వారిని సమర్ధించిన మీరు కేంద్రమంత్రిగా అర్హులా? కొట్టినోళ్లను, కొట్టిచ్చినోళ్లను వదిలే ప్రసక్తే లేదు. IASపై దాడి జరిగితే ఖండించకపోగా సమర్థించడం దారుణం. ఆయన వైఖరి బాధాకరం. అసలు బీజేపీ స్టాండ్ ఏంటి? ఎంపీగా ప్రజలకు మీరేం చేశారో, నేనేం చేశానో.. దమ్ముంటే బహిరంగ చర్చకు రండి” అని సవాల్ విసిరారు పొన్నం ప్రభాకర్.
”మూసీ వాసన చూసి దైవ సాక్షిగా నిజాలే చెప్పాలి. కిషన్ రెడ్డి మొద్దు నిద్ర వీడి కేంద్రం నుంచి నిధులు తీసుకురావాలి. ఎంపీగా కిషన్ రెడ్డి తెలంగాణకు ఏం చేశారు? ప్రజలకు ఎవరేం చేశారో అనేదానిపై దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలి” అని కిషన్ రెడ్డికి సవాల్ విసిరారు పొన్నం ప్రభాకర్.
Also Read : సీఎం రేవంత్‌ను ఇరుకున పెట్టేలా బీఆర్ఎస్ భారీ వ్యూహం..! కేటీఆర్ పాదయాత్ర అక్కడి నుంచేనా?
సీఎం రేవంత్ సవాల్ ను స్వీకరించిన బీజేపీ..
మూసీ ప్రక్షాళన పేరుతో పేదల ఇళ్లను కూల్చొద్దు అంటూ బీజేపీ ఉద్యమం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఒక సవాల్ విసిరారు. ప్రతిపక్షంలో ఉన్న నాయకులు మూసీ పరివాహక ప్రాంతాల్లో ఒక రోజు నిద్ర చేయాలన్నారు. అక్కడ ఒక రోజు ఉంటే.. అక్కడ నివాసం ఉండే వారి ఎలాంటి బాధలు, ఇబ్బందులు పడుతున్నారో తెలుస్తుందన్నారు. అక్కడ ఎలాంటి వాసన వస్తుందో, దోమలు ఏ విధంగా కుడతాయో మీకూ తెలుస్తుందన్నారు. ఆ ప్రాంతాన్ని క్లీన్ చేస్తాను అంటే ఎందుకు అడ్డుపడుతున్నారు అంటూ సీఎం రేవంత్ రెడ్డి ఒక సవాల్ ను విసిరారు. బీజేపీ నేతలు ఆ సవాల్ ను స్వీకరించారు. మూసీ పరివాహక ప్రాంతాల్లోని బస్తీ వాసులతో మేము ఒకరోజు నిద్రించేందుకు సిద్ధం అంటూ ప్రకటించారు.
ఇవాళ సాయంత్రం 4 గంటల నుంచి రేపు ఉదయం 7 గంటల వరకు బస్తీ వాసులతో మమేకమై, అక్కడే ఉండి, వారితోనే తిని, నైట్ అక్కడే బస చేయనున్నారు. ఉదయం టిఫిన్ చేయనున్నారు. ఈ మేరకు కార్యక్రమాలను రూపొందించుకున్నారు బీజేపీ నేతలు. మూసీ పరివాహక ప్రాంతం 54 కిలోమీటర్లు.. ఆ ప్రాంతాల్లో ఉన్న సుమారు 20 బస్తీల్లో బీజేపీ నేతలు ఈ రాత్రంతా బస చేయనున్నారు. బస్తీ వాసులకు వారొక భరోసా కల్పించనున్నారు.
మూసీ ప్రక్షాళనకు, పునరుజ్జీవానికి మేము వ్యతిరేకం కాదు.. కానీ, ఆ పేరుతో బస్తీల్లో ఉన్న పేదల ఇళ్లను కూల్చివేస్తే అడ్డుకుంటామని బీజేపీ నేతలు రేవంత్ సర్కార్ కు తేల్చి చెప్పారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మూసీ ప్రక్షాళనకు సంబంధించిన డీపీఆర్ ను విడుదల చేయాలని, మూసీ ప్రక్షాళన చేశాక.. డ్రైనేజీ వాటర్ ను ఎక్కడికి పంపిస్తారు? మళ్లీ మురుగు నీరు వచ్చిన మూసీలో కలిస్తే.. మూసీ కలుషితం అవుతుందని.. వాటర్ ట్రీట్ మెంట్ ప్లాంట్లు ఎన్ని పెడుతున్నారు? వాటి వివరాలు ఏంటో చెప్పాలని బీజేపీ నేతలు ముందు నుంచి డిమాండ్ చేస్తున్నారు.
వాటర్ ట్రీట్ మెంట్ ప్లాంట్లు పెట్టకుండానే మూసీ ప్రక్షాళన చేస్తే దాని వల్ల ఉపయోగం ఏంటి? అని బీజేపీ నేతలు నిలదీస్తున్నారు. మూసీ ప్రక్షాళన చేసినంత మాత్రాన అక్కడ డెవలప్ మెంట్ కాదన్నారు. ముందుగా.. కాలనీల నుంచి వస్తున్న మురుగు నీటిని ట్రీట్ మెంట్ చేసి వదలాలని డిమాండ్ చేస్తున్నారు. మూసీకి రెండువైపుల ఉన్న విలువైన భూములను ప్రైవేట్ సంస్థలకు ధారాదత్తం చేయడాన్ని బీజేపీ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
ఈ నేపథ్యంలో బస్తీ వాసులతో మమేకం కానున్నారు. వారితో మాట్లాడి, వారి సమస్యలు తెలుసుకుని, వారికి ఒక భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు బీజేపీ నాయకులు. ఎట్టి పరిస్థితుల్లో మూసీ పరివాహక ప్రాంతంలో నివాసం ఉంటున్న పేదల ఇళ్లను కూల్చనివ్వబోము అని బీజేపీ నాయకులు తేల్చి చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి సవాల్ ను స్వీకరించిన కమలనాథులు.. ఇవాళ బస్తీ వాసులతో మమేకమై రాత్రికి అక్కడే నిద్రించనున్నారు.