Telangana Congress Strategy For Parliament Elections
తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రాబోయే పార్లమెంట్ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. వచ్చే ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను కైవసం చేసుకోవాలని భావిస్తోంది. ఇందుకోసం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది హస్తం పార్టీ. లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థులకు మంత్రి పదవులు ఇచ్చి రంగంలోకి దింపాలని చూస్తోంది. ఇంతకీ తెలంగాణలో మినిస్టర్లు కానున్న ఆ ముగ్గురు ఎవరు?
రాబోయే పార్లమెంట్ ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ దృష్టి పెట్టింది. తెలంగాణలో ఉన్న 17 స్థానాల్లో మెజారిటీ సీట్లను కైవసం చేసుకునేందుకు ప్లాన్ చేస్తోంది. ఇందుకోసం ఎంపిక చేసిన స్థానాల్లో ముఖ్యమైన నేతలను బరిలో దింపేందుకు వ్యూహం రచిస్తోంది. వారిని ఇప్పటి నుంచే రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామ్యం చేయడం ద్వారా ప్రజల్లోకి వెళ్లి ఓట్లు రాబట్టాలనే వ్యూహం రచించింది హస్తం పార్టీ.
Also Read : ఫార్మా సిటీ విస్తరణకు దారేది? హైదరాబాద్ ఫార్మా పరిశ్రమ వర్గాల్లో హాట్ డిబేట్
ఈసారి కాంగ్రెస్ నుంచి పార్లమెంటు ఎన్నికల్లో బరిలో నిలిచే ముగ్గురు నేతలపై జోరుగా చర్చ సాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ దక్కని అద్దంకి దయాకర్ ను క్యాబినెట్ లోకి తీసుకుని వరంగల్ పార్లమెంట్ బరిలోకి దింపాలని యోచిస్తోంది కాంగ్రెస్. ఇక హైదరాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయాలని చూస్తున్న ఫిరోజ్ ఖాన్ కు సైతం మంత్రి పదవి ఇవ్వాలని చూస్తోంది.
ఇటీవలి ఎన్నికల్లో ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావును మంత్రివర్గంలోకి తీసుకుని మల్కాజ్ గిరి పార్లమెంటు బరిలోకి దింపేందుకు వ్యూహం రచిస్తోంది. ఈ ముగ్గురు నేతలను కేబినెట్ లోకి తీసుకునే అంశం పార్టీ అధిష్టానంతో చర్చించేందుకు సీఎం రేవంత్ రెడ్డి త్వరలోనే ఢిల్లీకి వెళ్లనున్నారు.
Also Read : తన కాన్వాయ్ వెళ్తున్న వేళ ట్రాఫిక్‌కి ఇబ్బంది కలగకుండా రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే పీసీసీ చీఫ్ గా ఉన్న నేపథ్యంలో ఆయన నిర్ణయం ఇందులో కీలకం కానుంది. ఈ ముగ్గురు నేతలను మంత్రివర్గంలోకి తీసుకోవడం ద్వారా కలిగే లాభాలు, పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చే సత్ ఫలితాలపై పార్టీ పెద్దలకు వివరించనున్నారు రేవంత్ రెడ్డి. తెలంగాణ ఎన్నికల్లో గెలుపుతో మంచి ఊపుమీదున్న కాంగ్రెస్.. పార్లమెంట్ ఎన్నికల విషయంలోనూ భారీ కసరత్తే చేస్తోంది. లోక్ సభ ఎన్నికల సమయంలో హస్తం పార్టీకి భారీ హైప్ తీసుకొచ్చేందుకు ఎంపిక చేసిన ముగ్గురిని క్యాబినెట్ లోకి తీసుకోవాలన్న ఆలోచనలో ఉంది. మరి కాంగ్రెస్ వేసిన ప్లాన్ ఏ మేరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.