Hyderabad Pharma City : ఫార్మా సిటీ విస్తరణకు దారేది? హైదరాబాద్‌ ఫార్మా పరిశ్రమ వర్గాల్లో హాట్‌ డిబేట్‌

ఈ విషయంలో కొత్త ప్రభుత్వం తగిన శ్రద్ధ, ప్రణాళికలు రూపొందించకపోతే ఇక్కడ ఉన్న ఫార్మా కంపెనీలు తమ విస్తరణ ప్రాజెక్టుల అమలు కోసం ఇతర రాష్ట్రాల వైపు దృష్టి సారించే పరిస్థితి ఉత్పన్నం అవుతుందని ఇక్కడి ఫార్మా పరిశ్రమల వారు అంటున్నారు.

Hyderabad Pharma City : ఫార్మా సిటీ విస్తరణకు దారేది? హైదరాబాద్‌ ఫార్మా పరిశ్రమ వర్గాల్లో హాట్‌ డిబేట్‌

Hyderabad Pharma City

Updated On : December 14, 2023 / 11:01 PM IST

హైదరాబాద్ నగర శివార్లలో రంగారెడ్డి జిల్లా యాచారం, కడ్తాల్, కందుకూరు మండలాల పరిధిలో 19వేల ఎకరాల విస్తీర్ణంలో గత ప్రభుత్వం అభివృద్ది చేయ తలపెట్టిన ఫార్మా సిటీ ప్రతిపాదనను ఉపసంహరించుకుని ఆ స్థలాల్లో టౌన్ షిప్ అభివృద్ది చేయాలంటూ కొత్త ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఫార్మాసిటీ కోసం ప్రత్యామ్నాయంగా ఏ ప్రాంతాన్ని గుర్తిస్తారు అనేదానిపై ఫార్మా పరిశ్రమ వర్గాల్లో చర్చ మొదలైంది.

హైదరాబాద్ నగరానికి ఫార్మా రంగంలో గత 30 ఏళ్లుగా ప్రత్యేక గుర్తింపు ఉంది. ఐటీ తర్వాత అత్యధిక సంఖ్యలో మహా నగరంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తున్నది ఫార్మా రంగంలోనే. ఒక అంచనా ప్రకారం హైదరాబాద్ నగరం చుట్టుపక్కల వెయ్యికి పైగా భారీ, మధ్యతరహా ఫార్మా పరిశ్రమలు ఉన్నాయి. ఈ యూనిట్లలో అత్యధిక శాతం జీడిమెట్ల, ఖాజీపల్లి, పాశమైలారం, ఉప్పల్, బాచుపల్లి పరిసర ప్రాంతాల్లో నెలకొన్ని ఉన్నాయి. ఈ పరిశ్రమల్లో దాదాపుగా లక్షమందికి పైగా ప్రత్యక్షంగా, మరో లక్ష మందికిపైగా పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు పొందుతున్నారు.

దాదాపు 30 నుంచి 35 సంవత్సరాల క్రితం హైదరాబాద్ చుట్టుపక్కల ఫార్మా పరిశ్రమలు నెలకొల్పిన ప్రాంతాల్లో జనవాసాలు భారీగా విస్తరించి కాలుష్య సంబంధమైన సమస్యలు ఉత్పన్నం అవుతుండటంతో ఆయా ప్రాంతాల్లో కొత్త పరిశ్రమల స్థాపనకు లేదా ఉన్న పరిశ్రమల ఉత్పత్తి సామర్థ్య విస్తరణకు ప్రభుత్వం నో చెప్పింది. దీంతో ఫార్మా పరిశ్రమల కోసం అనువైన ప్రాంతాన్ని వెతకాల్సిన పరిస్థితి ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి అటు ఫార్మా కంపెనీలకు ఉత్పన్నమైంది.

Also Read : రాయదుర్గం నుంచి ఎయిర్‌పోర్టుకు మెట్రో ఉపయోగకరం కాదు.. మరో రూట్‌లో మెట్రో ప్లాన్

హైదరాబాద్ లో ఇప్పటికే ఉన్నవి, కొత్తగా ఏర్పాటు చేయదలిచిన ఫార్మా పరిశ్రమలకు కాలుష్య సమస్య, స్థానికుల నుంచి వ్యతిరేకత ఏర్పడటంతో దాదాపు 20 సంవత్సరాల క్రితమే అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖపట్నం సమీపంలోని పరవాడ వద్ద ఫార్మా పార్కును అభివృద్ధి చేసింది. హైదరాబాద్ లో ఉన్న పలు ఫార్మా కంపెనీలు తమ విస్తరణ ప్రాజెక్టులను విశాఖపట్నంలోని ఫార్మా పార్కులోనే నెలకొల్పాయి. దీంతో అక్కడ ఫార్మా పరిశ్రమలు భారీగా వచ్చాయి. మరికొన్ని హిమాచల్ ప్రదేశ్ వంటి ఇతర రాష్ట్రాలకు తమ యూనిట్లను విస్తరించాయి.

ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో ఫార్మా పరిశ్రమను మరింతగా విస్తరించాల్సిన ఆవశ్యకతను దృష్టిలో ఉంచుకుని రంగారెడ్డి జిల్లాలోని 3 జిల్లాల పరిధిలో కొత్త ఫార్మా సిటీ ఏర్పాటుకు దాదాపు ఐదేళ్ల క్రితం రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఈ ఫార్మా సిటీ ప్రాజెక్టుకు 19వేల ఎకరాలు అవసరం అని గుర్తించగా, దీనిలో దాదాపు 10వేల ఎకరాలు ప్రభుత్వ ఆధీనంలోనే ఉన్నాయి. దాదాపు 70శాతం భూసేకరణ పూర్తి కాగా, మిగతా భూమి విషయంలో స్థానికుల నుంచి బాగా వ్యతిరేకత వచ్చింది. భూములు కోల్పోవడంతో పాటు కాలుష్యం అంశం ప్రధానంగా చర్చకు వచ్చింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ పార్టీ తమ ఎన్నికల వాగ్దానాల్లో భాగంగా రంగారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేయతలపెట్టిన ఫార్మా సిటీ ప్రాజెక్టును రద్దు చేస్తామని నిస్పష్టంగా ప్రకటించింది.

ఇందుకు తగ్గట్లుగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం జరిగిన సమీక్షా సమావేశంలో ప్రభుత్వ పరంగా విధాన నిర్ణయాలు ప్రకటించారు. ఈ కొత్త ఫార్మా సిటీ ప్రాంతంలో మెగా టౌన్ షిప్ ప్రాజెక్టును అభివృద్ధి చేయాలని, ఫార్మా సిటీ ఏర్పాటుకు నగరానికి బాగా దూరంగా కాలుష్య సమస్య ఉత్పన్నం కాని మరో ప్రాంతాన్ని పరిశీలించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో హైదరాబాద్ ఫార్మా రంగ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని కొత్తగా ఏర్పాటు చేయాల్సిన ప్రాజెక్టుపై ఫార్మా సిటీ వర్గాల్లో కొత్త చర్చ మొదలైంది.

వాస్తవానికి ఇప్పటిదాక ఏర్పాటు చేయతలపెట్టిన ఫార్మా సిటీ పరిధిలో తమ కొత్త యూనిట్లను నెలకొల్పేందుకు 400 ఫార్మా కంపెనీలు దరఖాస్తులు పెట్టుకున్నాయి. ఈ ఫార్మా సిటీలో 20ఏళ్ల వ్యవధిలో రూ.70వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని, దాదాపు 5లక్షల 50వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని గత ప్రభుత్వం అంచనా వేసింది. తొలి దశలో 200 కంపెనీలకు స్థలం కేటాయించాలని గత ప్రభుత్వం భావించినా వివిధ సమస్యల వల్ల ఫార్మాసిటీ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేని పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి.

మరింతగా ఫార్మా రంగ అభివృద్ధికి హైదరాబాద్ నగర పరిధిలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవాలంటే రాష్ట్ర ప్రభుత్వం సత్వరం మరో కొత్త ప్రాంతాన్ని ఎంపిక చేసి అక్కడ ఫార్మా సిటీ అభివృద్ధికి వేగవంతంగా చర్యలు తీసుకోవాలని స్థానిక ఫార్మా పరిశ్రమలు కోరుతున్నాయి. ఈ విషయంలో కొత్త ప్రభుత్వం తగిన శ్రద్ధ, ప్రణాళికలు రూపొందించకపోతే ఇక్కడ ఉన్న ఫార్మా కంపెనీలు తమ విస్తరణ ప్రాజెక్టుల అమలు కోసం ఇతర రాష్ట్రాల వైపు దృష్టి సారించే పరిస్థితి ఉత్పన్నం అవుతుందని ఇక్కడి ఫార్మా పరిశ్రమల వారు అంటున్నారు.

Also Read : అధికారం ఎవరికీ శాశ్వతం కాదు, ఫ్రెండ్లీ పోలీసింగ్ దారి తప్పుతోంది- లాకప్‌డెత్ ఘటనపై బాల్క సుమన్ వార్నింగ్

కొత్త ప్రభుత్వం ఈ పరిస్థితులను గుర్తించి తక్షణ చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు. మరోవైపు కేంద్రం కేటాయించిన బల్క్ డ్రగ్ పార్కుల్లో తెలంగాణకు చోటు దక్కలేదు. ఫార్మా సిటీలో బల్క్ డ్రగ్ పార్కు కోసం ప్రత్యేకంగా 2వేల ఎకరాలు కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చినా కేంద్రం మాత్రం ఏపీ, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ లకు పార్కులను కేటాయించింది. తెలంగాణ ప్రభుత్వం మరోసారి ప్రయత్నం చేసి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం ద్వారా రాష్ట్రానికి బల్క్ డ్రగ్ పార్క్ వచ్చే అవకాశం ఉంది.