తెలంగాణ కాంగ్రెస్ నేతలకు మంత్రి పదవులు..!

  • Publish Date - October 14, 2020 / 05:30 PM IST

telangana congress leaders: కాంగ్రెస్‌ పార్టీలో ఎప్పటికప్పుడు విచిత్రమైన పరిణామాలు జరుగుతుంటాయి. ఏం లేకపోయినా ఏదో ఉన్నట్టుగా, ఏదో సాధించేసినట్టుగా మాట్లాడేస్తుంటారు. అసలు జరుగుతుందో లేదో తెలియని వాటి గురించి ఆశలు పుట్టిస్తుంటారు. సంగారెడ్డిలో కూడా అదే జరిగింది. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డికి రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి మణిక్కమ్‌ ఠాగూర్‌ ఓ హామీ ఇచ్చేశారు. అసలు విషయంలోకి వెళ్తే.. కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవ‌సాయ బిల్లుల‌పై కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా నిర‌స‌న‌లు చేపడుతోంది. అక్టోబ‌ర్ 2న గాంధీ, లాల్ బ‌హ‌దూర్ శాస్త్రి జ‌యంతిల‌ను పుర‌స్కరించుకొని కేంద్ర బిల్లుల‌కు నిర‌స‌న‌గా రైతులతో సంత‌కాల సేకరణ కార్యక్రమం చేప‌ట్టింది.

2023లో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే జ‌గ్గారెడ్డికి మంత్రి పదవి:
ఏఐసీసీ పిలుపు మేర‌కు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో చేప‌ట్టిన నిర‌స‌న కార్యక్రమానికి పార్టీ వ్యవ‌హారాల ఇన్‌చార్జి మ‌ణిక్కమ్‌ ఠాగూర్‌తో పాటు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇత‌ర ముఖ్యనేత‌లు హాజరయ్యారు. అంత వరకూ బాగానే ఉంది. సంగారెడ్డిలో చేప‌ట్టిన కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే తూర్పు జ‌గ్గారెడ్డి విజ‌య‌వంతం చేయ‌డంతో మ‌ణిక్కమ్‌ ఠాగూర్ బాగా ఇంప్రెస్ అయిపోయారట. సో.. స్టేజ్ మీద అంద‌రు నేత‌ల మ‌ధ్య మాట్లాడుతూ 2023లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే జ‌గ్గారెడ్డి మంత్రి అవుతార‌ని ప్రక‌టించారు. ముందు పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి పెట్టకుండా అప్పుడే అధికారం గురించి మాట్లాడడంపై సెటైర్లు వినిపిస్తున్నాయి.

10 అసెంబ్లీ స్థానాలు గెలిస్తే… ప‌ది మంది కూడా మంత్రుల‌వుతారు:
ఆ స్టేజ్‌పై ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన దామోద‌ర రాజ‌న‌ర్సింహ‌, గీతారెడ్డి, సురేష్ షెట్కార్ వంటి సీనియ‌ర్‌ నేత‌లు ఉన్నారు. ఆ ముగ్గురికి వచ్చిన తర్వాతే తనకు మంత్రి చాన్స్‌ వస్తుందని జగ్గారెడ్డి అన్నారు. లోలోపల ఫుల్‌ హ్యాపీ ఫీలైపోయినా కూడా బయటకు మాత్రం బాగోదనే ఉద్దేశంతోనే జగ్గారెడ్డి ఇలా కామెంట్‌ చేశారని అంటున్నారు. అంతేనా.. రెండు మూడు అడుగులు ముందుకేసి ఉమ్మడి మెద‌క్ జిల్లాలో ప‌ది అసెంబ్లీ స్థానాలు గెలిస్తే… ప‌ది మంది కూడా మంత్రుల‌వుతార‌ని చెప్పడం కొంచెం ఓవర్‌ అయిపోయిందని పార్టీలోనే గుసగుసలాడుకుంటున్నారు.

ఐదుగురికి మంత్రి ప‌ద‌వులు గ్యారెంటీ:
మరి వేదిక మీదనున్న పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తక్కువ తిన్నారా.. వెంట‌నే మైక్ తీసుకొని లేదు లేదు ఐదుగురికి మంత్రి ప‌ద‌వులు గ్యారెంటీ అంటూ చెప్పుకొచ్చారు. ఇలా మొత్తం మీద వారికి వారే మంత్రి ప‌ద‌వులు ప్రక‌టించుకుంటుంటే… కింద ఉన్న కార్యకర్తలు మాత్రం ఆలూ లేదు చూలు లేదు సామెతను గుర్తు చేసుకొని బయటకు కనిపించకుండా నవ్వుకున్నారట. ఏదైనా కాంగ్రెస్‌ నేతల తీరే వేరని అనుకుంటున్నారు.