త్వరలో బీఆర్ఎస్ ఎల్పీ కాంగ్రెస్‌లో విలీనం: దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు
బీఆర్ఎస్‌లో కేవలం నలుగురు ఎమ్మెల్యేలు మాత్రమే మిగులుతారని చెప్పారు.

త్వరలో బీఆర్ఎస్ ఎల్పీ కాంగ్రెస్‌లో విలీనం కాబోతుందంటూ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన నాగేందర్ ఈ సందర్భంగా మాట్లాడారు. బీఆర్ఎస్‌లో కేవలం నలుగురు ఎమ్మెల్యేలు మాత్రమే మిగులుతారని చెప్పారు.
బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో కేసీఆర్‌ను కలవాలంటే ఎమ్మెల్యేలకు కూడా అవకాశం దక్కేది కాదని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఉంటుందని, అందుకే ఎమ్మెల్యేలు ఈ పార్టీలో చేరుతున్నారని చెప్పారు. బీఆర్ఎస్‌పై ఆ పార్టీ ఎమ్మెల్యేలకే నమ్మకం లేదని అన్నారు. బీఆర్ఎస్‌లో ఎమ్మెల్యేలకు విలువ ఉండదని అన్నారు.
కాంగ్రెస్‌లో అందరికీ విలువ ఉంటుందని చెప్పారు. గతంలో కాంగ్రెస్ హయాంలో ఎమ్మెల్యేలకు స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్ ఉండేదని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో నియోజకవర్గం అభివృద్ధి చేయడానికి అసలు ఫండే లేదని చెప్పారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కొంత మంది మంత్రులు, ఎమ్మెల్యేలు వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని అన్నారు.
వాటి వివరాలు త్వరలో బయట పెడతానని తెలిపారు. కేటీఆర్ బినామీలు వేలాది కోట్ల రూపాయలను దోచుకున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాపాడుకోడానికి ఆరు నెలల్లో అధికారంలోకి వస్తామని మేకపోతు గాంభీర్యం చూపుతున్నారని చెప్పారు.
ఆ క్రెడిట్ మొత్తం జగన్‌దే.. చంద్రబాబు చేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు : మాజీ మంత్రి అమర్నాథ్