MLC Kavitha Getting Ready For Jamili Elections : ఎంపీగా ఉన్నప్పుడు ఆమె…ఆ పార్టీలో సెంట్రర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. పార్లమెంట్‌లో గళం వినిపించడమే కాదు.. రాష్ట్రంలోనూ విస్తృతంగా పర్యటించేవారు. గత ఎన్నికల్లో ఓడిపోయాక…ప్రజల మధ్య అంతగా కనిపించలేదు. కానీ.. ఇటీవల ఎమ్మెల్సీ అయ్యాక…మళ్లీ ప్రజాక్షేత్రంలో జోరుగా పర్యటిస్తున్నారు. దీంతో స్టేట్ మినిస్టర్ అవుతారని టాక్ నడుస్తోంది కానీ..ఎప్పుడు జమిలి ఎన్నికలు వచ్చినా పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటే దిశగానే అడుగులు వేస్తున్నారా?..
ఎమ్మెల్సీ హోదాలో :-
టీఆర్‌ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవిత మళ్లీ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. రాష్ట్ర సాధన ఉద్యమకాలంలో…తెలంగాణ జాగృతి పేరుతో ప్రజలతో మమేకమైన కవిత… 2014 ఎన్నికల్లో ఎంపీగా గెలిచాక యాక్టివ్‌గా కనిపించారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో నిజామాబాద్‌లో ఓడిపోయాక రాజకీయాలకు కాస్త దూరంగా ఉన్నారు. రెండేళ్లు రాష్ట్ర, జిల్లా రాజకీయాల్లో అంతగా కనిపించలేదు. ఎమ్మెల్సీ హోదాలో ఇప్పుడు ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. తాను ఎంపీగా ఉన్నప్పుడు ప్రత్యేక చొరవచూపి మంజూరు చేయించిన 70 కోట్ల రూపాయల నిధులతో జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలో నిర్మాణమైన బోర్నపల్లి బ్రిడ్జిని పరిశీలించారు. కవిత స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నివడంతో…పునర్వైభవం దిశగా అడుగులేస్తున్నారని పొలిటికల్ సర్కిళ్లలో టాక్ నడుస్తోంది.
నిజామాబాద్‌లో :-
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో తన మార్కు వేసేందుకు, భవిష్యత్తు రాజకీయాలకు అన్ని అవకాశాలను వినియోగించుకునేలా విస్తృత పర్యటనలు చేస్తున్నారట కవిత. భవిష్యత్తు ఎన్నికల్లో బీజేపీని ధీటుగా ఎదుర్కోవాలంటే… ప్రజాక్షేత్రంలో నిరంతరం ఉంటూనే రాజకీయంగా పట్టు సాధించాలని పావులు కదుపుతున్నారట. ఇప్పటికే నిజామాబాద్ జిల్లా రాజకీయాల్లో కీలకంగా మారారని టాక్ కూడా నడుస్తోంది. ఢిల్లీ రైతు దీక్షలకు మద్దతుగా భారత్ బంద్‌లో పాల్గొన్న కవిత.. నూతన వ్యవసాయ, విద్యుత్ చట్టాలు, జీఎస్టీ బకాయిల చెల్లింపు అంశాల్లో కేంద్ర ప్రభుత్వ వైఖరి సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని ఆరోపిస్తున్నారు. కరీంనగర్‌కు ఏం సాధించారో చెప్పాలని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ను ప్రశ్నిస్తున్నారు.
వన్ నేషన్, వన్ ఎలక్షన్ :-
ఎమ్మెల్సీగా ఎన్నికైన వెంటనే కవితకు రాష్ట్ర కేబినెట్‌లో ఛాన్స్ ఉంటుందని ప్రచారం జోరుగా సాగింది. కేబినెట్‌లో మార్పుచేర్పులు జరిగితే కవితకు అవకాశం లేకపోలేదన్న వాదన పార్టీ వర్గాల్లో ఇప్పటికీ వినిపిస్తోంది. అయితే వన్ నేషన్ వన్ ఎలక్షన్ నినాదం ఊపందుకోవడంతో.. జాతీయ రాజకీయాలు లక్ష్యంగానే జిల్లాల్లో కవిత పర్యటనలు చేస్తున్నారని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. ఎమ్మెల్సీ పదవీకాలం తక్కువగా ఉండడంతో.. జమిలీ ఎన్నికలు ఎప్పుడొచ్చినా పార్లమెంట్ ఎన్నికల్లో విజయదుంధుబి మోగించేందుకు ప్రజా క్షేత్రంలో తిరుగుతున్నారని కార్యకర్తల్లో టాక్ నడుస్తోంది. ఏదేమైనా కవిత వరుస పర్యటనలతో టీఆర్‌ఎస్ శ్రేణుల్లో సరికొత్త జోష్ కనిపిస్తోందట.