లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం(ఏప్రిల్-3,2019)ఆందోల్ లో టీఆర్ఎస్ నిర్వహించిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా గత ప్రభుత్వాలపై కేసీఆర్ విమర్శలు గుప్పించారు.సమైక్య పాలనలో ఎన్నో అవస్థలు పడ్డామని కేసీఆర్ అన్నారు.గత ప్రభుత్వాలు రైతులను పట్టించుకోలేదన్నారు.దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందన్నారు.రైతు బీమాతో రైతు కుటుంబాలను ఆదుకుంటున్నామన్నారు.మిషన్ భగీరథతో ఇంటింటికీ మంచినీరు ఇచ్చామని అన్నారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు బంధు,రైతు బీమా దేశానికే ఆదర్శమన్నారు.తెలంగాణ రాష్ట్రం కాకపోతే రైతు బంధు,రైతు బీమా రాకపోయేదని కేసీఆర్ అన్నారు. రైతు బంధు ద్వారా ఎకరానికి రూ.10వేలు ఇస్తామని కేసీఆర్ తెలిపారు.రవాణాశాఖ మంత్రిగా ఉన్న సమయంలో తాను ఆందోల్ ప్రాంతంలో విస్తృతంగా పర్యటించానని,అక్కడి సమస్యలపై తనకు అవగాహన ఉందని కేసీఆర్ అన్నారు.
జహీరాబాద్ లో నిమ్స్ హాస్పిటల్ నిర్మిస్తున్నామని తెలిపారు.దాదాపు 2లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయన్నారు.కాళేశ్వరం పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు.కాళేశ్వరం కాదు వేగేశ్వరం అని కేసీఆర్ అన్నారు.ప్రతి నియోజకవర్గంలో లక్ష ఎకరాలు నీళ్లిస్తామన్నారు.సింగూర్ మీద లిఫ్ట్ లు ఏర్పాటు చేసి పొలాలకు నీరిస్తామన్నారు.అనుకున్న స్థాయిలో దేశం అభివృద్ధి చెందలేదన్నారు.
కాంగ్రెస్,బీజేపీ నాయకులు ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారన్నారు.స్వాతంత్ర్యం వచ్చి 73ఏళ్లు గడుస్తున్నా దేశ ప్రజల కనీస ప్రాధమిక అవసరాలు తీరలేదన్నారు.ఐదేళ్ల పాలనలో నరేంద్రమోడీ అట్టర్ ఫ్లాప్ అయ్యాడన్నారు.టీఆర్ఎస్ తెలంగాణ ప్రజలకు ఏజెంట్ అని అన్నారు.టీఆర్ఎస్ కు లోపాయికారీ రాజకీయం చేసే అవసరం లేదన్నారు.వ్యవసాయానికి 24గంటల కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు.మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ లో కూడా వ్యవసాయానికి 24గంటల కరెంట్ ఇవ్వడం లేదన్నారు.