కచ్చితంగా మెదక్ వెళ్తాను, ఎవరు అడ్డుకుంటారో చూస్తా- ఎంపీ రఘునందన్ రావు

మెదక్ ఎస్పీ గతంలో పింక్ ప్రభుత్వానికి.. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి వత్తాసుగా పనిచేస్తున్నారని ధ్వజమెత్తారు. బక్రీద్ సందర్భంగా పశువులను తరలిస్తున్నారని సమాచారం ఇస్తే పట్టించుకోలేదు. పైగా ఇష్టం వచ్చినట్లు ఎస్ఐ, సిఐ మాట్లాడారు.

కచ్చితంగా మెదక్ వెళ్తాను, ఎవరు అడ్డుకుంటారో చూస్తా- ఎంపీ రఘునందన్ రావు

Raghunandan Rao Madhavaneni : మెదక్ ఘటనలో కత్తి పోట్లకు గురై హైదరాబాద్ మియాపూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గో సంరక్షకుడు అరుణ్ రాజ్ ని మెదక్ ఎంపీ రఘునందన్ రావు పరామర్శించారు. గోవులను తరలిస్తున్నారని గో సంరక్షకులు పోలీసులకు సమాచారం ఇస్తే.. మెదక్ టౌన్ పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఎంపీ రఘునందన్ రావు ఆరోపించారు. చట్టం తెలియకుండా పోలీసులు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

బక్రీద్ పండుగ సందర్భంగా జంతు వధపై చాలా స్పష్టంగా రాష్ట్రాల డీజీపీలకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసిందని ఆయన గుర్తు చేశారు. మెదక్ లో నిన్నటి ఘటనకు పోలీసులే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. గో సంరక్షకులపై దాడి జరిగితే.. ఇప్పటివరకు దాడి చేసిన వారిని పట్టుకోకుండా.. హిందువులని అరెస్ట్ చేశారని సీరియస్ అయ్యారు. దాడి చేసిన వారిని అరెస్ట్ చేయకపోతే జరిగే పరిణామాలకు ఎస్పీ బాధ్యత వహించాలని ఆయన హెచ్చరించారు. మెదక్ ఎస్పీ గతంలో పింక్ ప్రభుత్వానికి.. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి వత్తాసుగా పనిచేస్తున్నారని ధ్వజమెత్తారు.

”బక్రీద్ సందర్భంగా పశువులను తరలిస్తున్నారని సమాచారం ఇస్తే పట్టించుకోలేదు. పైగా ఇష్టం వచ్చినట్లు ఎస్ఐ, సిఐ మాట్లాడారు. మెదక్ టౌన్ లో 144 సెక్షన్ ఉందని డీజీ చెబుతున్నారు. ప్రజల చేత ఎన్నుకున్న ఎంపీని. కచ్చితంగా మెదక్ వెళ్తాను. ఎవరు అడ్డుకుంటారో చూస్తాను. మీరు భయపడితే భారత రాజ్యాంగానికి, ప్రజలకు భయపడాలి. మూడు రంగుల జెండాకు కాదు. హిందువులను మాత్రమే అరెస్ట్ చేశారు. ఘటనకు బాధ్యులైన ముస్లింలను అరెస్ట్ చేయలేదు. ఘటనకు బాధ్యులైన వారిని వెంటనే అరెస్ట్ చేయాలి” అని ఎంపీ రఘునందన్ రావు డిమాండ్ చేశారు.

Also Read : కేసీఆర్‌ను అష్టదిగ్బంధం చేసిన ఆ 8మంది నేతలెవరు? వారిని టచ్ చేసి కేసీఆర్ తప్పు చేశారా?- ప్రొ. నాగేశ్వర్ విశ్లేషణ