MP Raghunandan Rao : నల్గొండ జిల్లా ఐఎస్ఐ తీవ్రవాదుల అడ్డా- బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు
మదర్సాలపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? మదర్సాల లెక్క ఎందుకు బయటికి తీయడం లేదు?

Raghunandan Rao
MP Raghunandan Rao : బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రోహింగ్యాలకు షెల్టర్ గా మారిందన్నారు. నల్గొండ జిల్లా.. ఐఎస్ఐ తీవ్రవాదులకు అడ్డాగా మారిందని ఆరోపించారు. నల్గొండ నుంచి ఇద్దరు మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నారని, మదర్సాలపై ఎందుకు నిఘా పెట్టడం లేదని ఆయన ప్రశ్నించారు. అక్కడ జరుగుతున్న కార్యకలాపాలు ఎందుకు బయటకు రావడం లేదని నిలదీశారు.
దేశంలో ఎక్కడ ఉగ్రవాద దాడులు జరిగినా మూలాలు నల్గొండలోనే కనబడతాయని చెప్పారు. ఉగ్రవాదులకు నల్గొండ సేఫ్ జోన్ గా మారిందన్నారు. నల్గొండలో ఓవైపు ఐఎస్ఐ ఉగ్రవాదం, మరోవైపు వామపక్ష తీవ్రవాదం.. ఈ రెండూ బీజేపీ ఎదుగుదలను అడ్డుకుంటున్నాయని అన్నారు. రాష్ట్రంలో ఎవరి అనుమతితో మదర్సాలు నడుస్తున్నాయని రఘునందన్ రావు ప్రశ్నించారు. మదర్సాలపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? మదర్సాల లెక్క ఎందుకు బయటికి తీయడం లేదు? అని నిలదీశారు. మదర్సాలలో కలెక్టర్, విద్యాశాఖ అధికారులు ఎందుకు తనిఖీలు చేయడం లేదని రఘునందన్ రావు అడిగారు.
Also Read: యుద్ధ భయంతో ఉక్కిరిబిక్కిరి.. వెయ్యికి పైగా మదర్సాలను ఖాళీ చేయించిన పాకిస్తాన్..
పహల్గాం ఘటన తర్వాత భారత్ లో ఉన్న పాకిస్తాన్, బంగ్లాదేశీయులను బయటికి పంపమని కేంద్రం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు స్పష్టమైన ఆదేశాలిచ్చిందని రఘునందన్ రావు గుర్తు చేశారు. అయినా తెలంగాణ ప్రభుత్వానికి సోయి లేదని మండిపడ్డారు. కులగణన చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారు, కులగణన తప్పుల తడక అని కాంగ్రెస్ నేతలే ఒప్పుకున్నారని విమర్శించారు.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇద్దరు మంత్రులున్నా ధాన్యం కొనుగోళ్లు చేయక అన్నదాతలను గోస పెట్టిస్తున్నారని వాపోయారు. ఎస్ఎల్ బీసీ టన్నెల్ ప్రమాదంలో మృతి చెందిన వారి మృతదేహాలను కూడా బయటికి తీయలేని చేతకాని ప్రభుత్వమిది అంటూ రేవంత్ సర్కార్ పై విరుచుకుపడ్డారు ఎంపీ రఘునందన్ రావు.