యుద్ధ భయంతో ఉక్కిరిబిక్కిరి.. వెయ్యికి పైగా మదర్సాలను ఖాళీ చేయించిన పాకిస్తాన్..

వారం రోజులుగా భయంతో జీవిస్తున్నామని, చిన్నారులకు తమకు ఏం జరుగుతుందో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

యుద్ధ భయంతో ఉక్కిరిబిక్కిరి.. వెయ్యికి పైగా మదర్సాలను ఖాళీ చేయించిన పాకిస్తాన్..

Updated On : May 3, 2025 / 9:59 AM IST

Madrasas Shut Down: యుద్ధ భయంతో పాకిస్తాన్ వణుకుతోంది. ఇండియా వరుస విన్యాసాలతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. భారత్ ఎప్పుడు ఎటు నుంచి ఎలా దాడి చేస్తుందో తెలియక భయంతో అల్లాడిపోతోంది. పహల్గాం దాడికి ప్రతీకారం తీర్చుకోవాలని ఇండియా భావిస్తోందని, మిలిటరీ యాక్షన్ పక్కాగా ఉంటుందని అంచనా వేస్తోంది పాక్. ఇప్పటికే ప్రధాని మోదీ త్రివిధ దళాలకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వడంతో ఎప్పుడైనా దాడి చేయొచ్చని స్వయంగా పాక్ మంత్రులు, నేతలు కామెంట్లు చేస్తుండటం చూస్తే దాయాది దేశం ఎంతలా వణికిపోతోందో అర్థమవుతుంది.

ఇండియన్ ఆర్మీ ఎప్పుడైనా స్ట్రైక్ చేయొచ్చని భావిస్తున్న పాకిస్తాన్ పీవోకేను దాదాపుగా ఖాళీ చేస్తోంది. దాదాపు 15లక్షల మంది ప్రజలు ఎల్ వోసీని వీడినట్లు తెలుస్తోంది. మరికొంతమంది ఇప్పటికే నిర్మించిన బంకర్లలో తలదాచుకుంటున్నట్లు సమాచారం. వారం రోజులుగా భయంతో జీవిస్తున్నామని, చిన్నారులకు తమకు ఏం జరుగుతుందో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Also Read: భారత్‌ లక్ష్యంగా ఎల్‌వోసీ వెంట పాక్ ఆర్మీ బ్రిగేడ్ల మోహరింపు.. ఉగ్రవాదులతో ఈ బ్రిగేడ్లు ఏం చేయిస్తాయో.. వాటి చరిత్ర ఏంటో తెలుసా?

స్థానికులంతా ఆహార నిల్వలు పెంచుకోవాలని పీవోకే అధికారులు ఆదేశించారు. కనీసం రెండు నెలలకు సరిపడా ఆహారాన్ని నిల్వ చేసుకోవాలని నియంత్రణ రేఖ సమీపంలోని ప్రజలను అప్రమత్తం చేస్తోంది. ఇప్పటికే దాదాపు వెయ్యికి పైగా మదరసా పాఠశాలలను ఖాళీ చేయించింది.

 

10 రోజుల పాటు తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఒకవేళ యుద్ధ పరిస్థితుల్లో గాయాలైతే ఏం చేయాలి, ఎలాంటి చికిత్సను అందించాలో కూడా అక్కడున్న స్థానికులకు నేర్పిస్తున్నట్లు తెలుస్తోంది. గాయాలైన వారికి ప్రథమ చికిత్స ఎలా చేయాలి, స్ట్రెచర్ పై ఎలా తీసుకెళ్లాలి, కాల్పుల నుంచి ఎలా తప్పించుకోవాలి అని నేర్పించారని పీవోకేలోని స్థానికులు చెబుతున్నారు. దీంతో యుద్ధం అనివార్యమని పాకిస్తాన్ భావిస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది.

ఇప్పటికీ భారత్, పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. బోర్డర్ లో పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. ఎల్ వో సీ దగ్గర కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ ఫైరింగ్ చేస్తోంది. దాదాపు 8 రోజులుగా కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. అయితే పాక్ కాల్పులను ఇండియన్ ఆర్మీ తిప్పికొడుతోంది. పాక్ కు ధీటుగా బదులిస్తోంది. ఒకవైపు కాల్పులు జరుపుతూనే గురువారం సైరన్లను మోగించింది. యుద్ధ సమయంలో మాత్రమే ఇలాంటి సైరన్లను మోగిస్తారు. దీంతో యుద్ధానికి తాము సిద్ధంగా ఉన్నామంటూ భారత సైన్యం పరోక్ష సంకేతాలు ఇచ్చినట్లైంది.