NEET Exam All The Best : లక్షా 17 వేల మంది తెలుగు విద్యార్థులు దరఖాస్తు

  • Published By: madhu ,Published On : September 13, 2020 / 06:55 AM IST
NEET Exam All The Best : లక్షా 17 వేల మంది తెలుగు విద్యార్థులు దరఖాస్తు

Updated On : September 13, 2020 / 11:44 AM IST

NEET 2020 Exam : వైద్య విద్య ప్రవేశాల కోసం దేశ వ్యాప్తంగా నీట్‌ పరీక్ష జరుగనుంది. ఇందుకోసం నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ ఏర్పాట్లు పూర్తి చేసింది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు లక్షా 17 వేల మంది విద్యార్థులు ఇప్పటికే ఈ పరీక్ష కోసం దరఖాస్తు చేసున్నారు. దీంతో వారంతా 2020, సెప్టెంబర్ 13వ తేదీ ఆదివారం నీట్‌ పరీక్షకు హాజరుకానున్నారు.



తెలంగాణలో 55వేల 8 వందల మంది విద్యార్థులు పరీక్ష రాయనుండగా.. ఏపీలో… 61వేల 892 మంది ఎగ్జామ్‌కు హాజరుకానున్నారు. నీట్‌ పరీక్ష కోసం ఏపీలోని 8 జిల్లాల్లో 151 కేంద్రాలు ఏర్పాటు చేశారు. తెలంగాణలో హైదారాబాద్‌, రంగారెడ్డి, ఖమ్మం, వరంగల్‌, కరీంనగర్‌ జిల్లాల్లో 112 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నీట్‌ ఎగ్జామ్‌ జరుగనుంది.



ఉదయం 11.30 నుంచే విద్యార్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించనున్నారు. ఎగ్జామ్‌ సెంటర్లలో కోవిడ్‌ నిబంధనల మేరకు ఏర్పాట్లు చేశారు. ఒక్కో రూమ్‌లో 15మంది విద్యార్థులు పరీక్ష రాసేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రతి విద్యార్థి మాస్క్‌లు, గ్లౌజులు ధరించాల్సి ఉంటుంది. విద్యార్థులకు థర్మల్‌ స్క్రీనింగ్ చేసిన తర్వాతే పరీక్ష కేంద్రంలోని అనుమతిస్తారు. విద్యార్థులు సాధారణ దుస్తులను మాత్రమే ధరించాలి.



స్లిప్పర్లు, సాండిళ్లు మాత్రమే వేసుకోవాలి. బురఖా లాంటివి ధరించేవారు నిర్దేశించిన సాధారణ సమయం కంటే ముందుగానే పరీక్ష హాలుకు చేరుకోవాలి. వీరిని తనిఖీ చేసి పరీక్ష హాలులోకి అనుమతిస్తారు. అయితే వైరస్‌ కారణంగా కట్టడి ప్రాంతాల్లో పరీక్ష కేంద్రాలుండవని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. హాట్ స్పాట్ ఏరియాల నుంచి వచ్చే వారిని కూడా ఎగ్జామినర్లుగా అనుమతించబోమని ఎన్‌టీఏ స్పష్టం చేసింది. అందుకు సంబంధించి కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ నిబంధనలు విధించింది.