హైదరాబాద్‌లో మళ్లీ రెచ్చిపోయిన నేపాలీ గ్యాంగ్, నాచారంలో ఇంటి యజమానికి మత్తుమందు ఇచ్చి రూ.10 లక్షల నగదు, 20 తులాల గోల్డ్ తో పరార్

nepali gang: పని కావాలంటూ వస్తారు.. సైలెంట్‌గా వాళ్ల పని చేసుకొని పోతారు. ఇది నేపాలీ గ్యాంగ్ చోరీ ఫార్ములా.. నేపాల్ నుంచి వచ్చిన ఈ గ్యాంగ్ హైదరాబాద్‌లో వరుస చోరీలకు పాల్పడుతోంది. నెల రోజుల వ్యవధిలో రెండు చోట్ల భారీ మొత్తంలో దోచుకెళ్లిందీ ముఠా. ఇంట్లో పనిమనుషులుగా చేరి.. వాళ్ల పని కానిచ్చేస్తున్నారు ముఠా సభ్యులు. ఇటీవల హైదరాబాద్ రాయదుర్గంలోని ఓ వ్యాపారవేత్త ఇంట్లో జరిగిన చోరీ ఘటన మరువక ముందే నాచారంలో మళ్లీ రెచ్చిపోయారు ముఠా సభ్యులు. ఇంటి యజమానులకు మత్తు మందు ఇచ్చి ఇళ్లు లూటీ చేశారు. 10 లక్షల నగదు, 20 తులాల బంగారంతో ఉడాయించారు.
10 రోజుల క్రితమే పనిలోకి వచ్చిన భార్యాభర్తలు:
మేడ్చల్ జిల్లా నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఇంట్లో 10 రోజుల క్రితమే పనికి దిగారు భార్యాభర్తలు. యజమానులకు నమ్మకంగా ఉన్నట్లు నటించారు. ఇంట్లో వారంతా శుభకార్యానికి వెళ్లగా తమ ప్లాన్‌ను అమలు చేశారు. ఒంటరిగా ఉన్న వృద్ధురాలికి తినే ఆహారంలో మత్తుమందు కలిపి ఇచ్చారు. ఆమె నిద్రలోకి జారుకోగానే ఇంట్లో ఉన్న బంగారం, నగదు మొత్తం సర్దేసి రాత్రికి రాత్రి అక్కడి నుంచి పరారయ్యారు.