Pawan Kalyan Fan Niranjan : పవన్ కళ్యాణ్ ఫ్యాన్ నిరంజన్‌కి వచ్చిన అరుదైన వ్యాధి ఇదే.. 17 ఏళ్లు వచ్చినా పిల్లాడిలా..
Pawan Kalyan : వరంగల్ జిల్లా హన్మకొండకు చెందిన 17ఏళ్ల బాలుడు నిరంజన్ అరుదైన డ్యూచెన్ మాస్కులర్ డిస్ట్రోఫీ (డీఎండీ) వ్యాధితో బాధపడుతున్నాడు.
Pawan Kalyan fan warangal boy niranjan battles rare duchenne muscular dystrophy dmd disease
Pawan Kalyan Fan Niranjan : వరంగల్ జిల్లా హన్మకొండకు చెందిన 17ఏళ్ల బాలుడు నిరంజన్ అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు. ఎముకలు విగిపోయేలా, కడుపు పగిలిపోయేలా బాధించే జబ్బుతో పదేళ్లుగా నరకయాతన అనుభవిస్తున్నాడు. అయితే, ఆ బాలుడికి జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం, సినీ హీరో పవన్ కల్యాణ్ అంటే ఎనలేని అభిమానం. పవన్ సినిమాలు చూస్తూ ఫ్యాన్ అయ్యాడు. తన ముద్దుపేరును గబ్బర్ సింగ్ అని పెట్టుకున్నాడు. తనకు పవన్ కల్యాణ్‌ను కలవాలని ఉందని పలు సందర్భాల్లో నిరంజన్ కోరాడు. ఏదో ఒకరోజు అభిమాన హీరోను కలవాలని ఆశతో ఉన్నాడు. విషయం తెలుసుకున్న పవన్ కల్యాణ్.. స్వయంగా నిరంజన్ నివాసానికి వచ్చి బాలుడి కోరిక నెరవేర్చాడు. నిరంజన్ను ఆప్యాయంగా పలుకరించాడు. అతనికి తిరుపతి ప్రసాదాన్ని అందించిన పవన్.. రూ.లక్ష అందజేశారు. తన అభిమాన హీరోను కలిసిన ఆనందం నిరంజన్ కళ్లల్లో కొట్టిచ్చినట్లు కనిపించింది.
నిరంజన్‌కు అసలేమైంది..?
గ్రేటర్ వరంగల్ హనుమకొండ కేయూ రోడ్డులోని పెగడపల్లి డబ్బాల్ ప్రాంతానికి చెందిన పొనుగోటతి రాము, మానస దంపతుల కొడుకు నిరంజన్ అరుదైన డ్యూచెన్ మాస్కులర్ డిస్ట్రోఫీ (డీఎండీ) వ్యాధితో బాధపడుతున్నాడు. ఐదేళ్లలోపు ప్రభావం చూపే ఈ వ్యాధి వల్ల శరీరం ఎదుగుదల ఆగిపోతుంది. జన్యుపరమైన ఈ వ్యాధికి ఇప్పటివరకు చికిత్స లేదు. దీంతో నిరంజన్ తోపాటు అతని కుటుంబం తీవ్ర వేదన అనుభవిస్తోంది.
చిన్న వయసులోనే ప్రభావం చూపే ఈ వ్యాధి వల్ల శరీర ఎదుగుదల ఆగిపోతుంది. అంతేకాదు.. గుండె కండరాలు, శ్వాసకోశ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రాణాంతకంగా పరిగణించే ఈ వ్యాధి లక్షణాలు నిరంజన్‌కు ఏడేళ్ల వయసు నుంచే కనిపించడం ప్రారంభమయ్యాయి. కాలక్రమేణా కిడ్నీలు దెబ్బతినడంతో పాటు పొట్ట ఉబ్బరంగా మారింది. తమ కుమారుడిని వేదిస్తోన్న వ్యాధిని నయం చేయించేందుకు తల్లిదండ్రులు అనేక ఆస్పత్రులకు తిరిగారు. వరంగల్ తోపాటు హైదరాబాద్, కేరళ రాష్ట్రంలోని పలు ఆస్పత్రుల్లో నిరంజన్‌కు చికిత్స అందించారు. అయినా ఫలితం దక్కలేదు. దీంతో మూడేళ్లుగా నిరంజన్ మంచానికే పరిమితం అయ్యాడు. కిరాయి ఇంట్లో ఉంటూ చిన్నపాటి పనులు చేసుకుంటూ తల్లిదండ్రులు కొడుకును చూసుకుంటున్నారు.
